వివాదాల ‘కొండా’ నేపధ్యం ఇది
x

వివాదాల ‘కొండా’ నేపధ్యం ఇది

ఎలాంటి సంబంధంలేని సినీ సెలబ్రిటీలు సమంత-నాగచైతన్య-నాగర్జునను ఎలా పిక్చర్లోకి తెచ్చి గబ్బుపట్టించారో అందరు చూసిందే.


మొదటినుండి ఇంతే కొండా సురేఖ వ్యవహారం. ఈమె రాజకీయ జీవితం మొదటినుండి వివాదాలమయమే. ఈమెను దూరంగా ఉంచితే ఒకసమస్య. దగ్గరకు తీసుకుంటే మరో సమస్య అన్నట్లుగా ఉంటుంది. అంటే ఎవరు కూడా సురేఖను దూరంగా ఉంచలేరు అలాగని దగ్గరకూ తీసుకోలేరు. ఇపుడు వరంగల్ జిల్లాలోని చాలామంది ఎంఎల్ఏలతో ఈమెకు పడటంలేదు. వరంగల్ జిల్లాలోని సహచర ఎంఎల్ఏలతో మంత్రికి వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకనే మెజారిటి ఎంఎల్ఏలు మంత్రిపై కత్తికట్టారు. ఇపుడు మంత్రి వ్యవహారం ప్రభుత్వంలోనే కాకుండా పార్టీలో కూడా పెద్ద తలనొప్పిగా మారింది. తాజా వివాదం గురించి మాట్లాడుకునేముందు సురేఖ నేపధ్యం గమనించాలి. అసలు కొండా నేపధ్యం ఏమిటంటే 1995లో వరంగల్ జిల్లాలోని వంచనగిరి ఎంపీటీసీ గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత గీసుకొండ మండల పరిషత్ అధ్యక్షురాలయ్యారు. ఎంపీపీ హోదాలో జిల్లా కాంగ్రెస్ లో బాగా యాక్టివ్ గా ఉండేవారు. దాంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారుగా మారారు.

వైఎస్సార్ మద్దతుదారుగా మారిన తర్వాత 1996లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి సభ్యురాలయ్యారు. ఎప్పుడైతే వైఎస్సార్ మద్దతుదారయ్యారో 1999 ఎన్నికల్లో సురేఖకు శాయంపేట ఎంఎల్ఏగా టికెట్ వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన సురేఖ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శిగా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీలో సభ్యురాలిగా, ఆరోగ్య, ప్రాధమిక విద్య కమిటి సభ్యురాలిగా పనిచేశారు. 2000లో ఏఐసీసీ కోఆప్షన్ సభ్యురాలిగా, పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2004లో శాయంపేట నియోజకవర్గంలో రెండోసారి గెలిచారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో శాయంపేట రద్దవ్వటంతో పరకాల నియోజకవర్గంలో 2009లో పోటీచేసి గెలిచారు. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన సురేఖను వైఎస్సార్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

రెండోసారి సీఎం అయిన వెంటనే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించటంతో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. జగన్ కు సీఎం పదవి ఇవ్వటానికి అధిష్టానం నిరాకరించిందని గోలగోల చేసి తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. పార్టీతో జగన్ కు విభేదాలు మొదలైతే సురేఖ జగన్ పక్షంలో చేరారు. జగన్ కేసుల్లో వైఎస్సార్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చినందుకు నిరసనగా అధిష్టానంపై తిరుగుబాటు చేసి ఎంఎల్ఏ గా 2011, జూలైలో రాజీనామా చేశారు. జగన్ ఏర్పాటుచేసిన వైఎస్సార్సీపీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. అందుకనే వైసీపీ తరపున 2012, జూన్ 12వ తేదీన జరిగిన ఉపఎన్నికలో పరకాల నియోజకవర్గం నుండి పోటీచేశారు. అయితే అప్పటికే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకున్న నేపధ్యంలో వైసీపీ అభ్యర్ధిగా ఓడిపోయారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో సురేఖ ఇంటిమీదకు ఉద్యమకారులు దాడులు చేస్తే ఆమె తిరగబడి వాళ్ళపైన తన మద్దతుదారులతో దాడులు చేశారు.

2014 ఎన్నికలకు ముందు జగన్ తో విభేదించి పార్టీలో నుండి బయటకు వచ్చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోటీచేసి గెలిచారు. అయితే కొంతకాలానికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో పడని కారణంగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. తర్వాత అనేక ఆటుపోట్లకు గురైన సురేఖ చివరకు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోటీచేసి గెలిచి అటవీ, దేవాదాయ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మొదటినుండి అంటే ఎంపీటీసీగా ఉన్నప్పటినుండి ఇపుడు దేవాదాయ శాఖ మంత్రి వరకు ఎప్పుడూ వివాదాలే. ఎవరో ఒకరితో వివాదం నడుస్తుండాల్సిందే సురేఖకు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో వివాదం మొదలైతే చివరకు ఎలాంటి సంబంధంలేని సినీ సెలబ్రిటీలు సమంత-నాగచైతన్య-నాగర్జునను ఎలా పిక్చర్లోకి తెచ్చి గబ్బుపట్టించారో అందరు చూసిందే.

జిల్లాలో టీడీపీ, టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకరరావుతో పడదు. పార్టీలోని సీనియర్ నేతలతో పడదు. సొంతపార్టీ ఎంఎల్ఏలతో ఎప్పుడూ వివాదాలే. ఇపుడు సమస్య ఏమిటంటే పరకాల ఎంఎల్ఏ రేవూరి ప్రకాష్ రెడ్డితో పెద్ద గొడవవుతోంది. తన నియోజకవర్గం పరకాలలో మంత్రి జోక్యం చేసుకుంటోందని రేవూరి గోల మొదలుపెట్టారు. రేవూరికి మద్దతుగా మరికొందరు ఎంఎల్ఏలు కూడా మంత్రిపైన ఇవే ఆరోపణలతో గాంధీభవన్లో పెద్ద దుమారమే రేపారు. మంత్రిపై ఫిర్యాదులు చేయటానికి చాలమంది ఢిల్లీకి వెళ్ళటానికి రెడీ అయ్యారు. అయితే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ జోక్యం చేసుకుని నేతలను ఢిల్లీకి వెళ్ళకుండా ఆపారు.

సురేఖ వివాదం పీసీసీ స్ధాయిలో సద్దుమణుగుతుందని ఎవరికీ అనిపించటంలేదు. ఎందుకంటే సురేఖ ఎవరుచెప్పినా వినేరకం కాదు. సమస్య మంత్రితో కన్నా ఆమె భర్త కొండా మురళితోనే ఎక్కువ. కొండా మురళిని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్కుగా సురేఖ కంట్రోల్ అవుతారు. అయితే మురళిని కంట్రోల్ చేయటం కష్టం. విచిత్రం ఏమిటంటే భార్య, భర్తలు ఇద్దరూ ఆవేశపరులే. మామూలుగా ఎక్కడైనా ఇద్దరిలో ఒకళ్ళు ఆవేశపరులైతే రెండోవారు కంట్రోల్ చేస్తుంటారు. కాని ఇక్కడ ఇద్దరూ ఆవేశపరులు అవ్వటంతోనే మంత్రి చుట్టూ వివాదాలు పెరిగిపోతున్నాయి. మొత్తంమీద వరంగల్ కాంగ్రెస్ లో కొండా చిచ్చు దావానంలా వ్యాపిస్తోంది అనటంలో ఎలాంటి సందేహంలేదు. మరి ఈ వివాదం ఎలాగ చల్లారుతుందో చూడాల్సిందే.

Read More
Next Story