పాలకొండలో వైఎస్సార్ సీపీ పదిలమేనా...
x

పాలకొండలో వైఎస్సార్ సీపీ పదిలమేనా...

పాలకొండలో వైఎస్సార్సీపీ బలమైన క్యాడర్ ను కలిగి ఉంది. జగన్ పర్యటనకు వచ్చిన జనమే నిదర్శనమని ప్రజలు అంటున్నారు.


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలకొండలో పర్యటించారు. ఈ నియోజకవర్గం మొదటి నుంచీ వైఎస్సార్సీపీకి అనుకూలంగానే ఉంది. అయితే ఇప్పుడు మునిసిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేందుకు పావులు కదిపి ఫెయిల్ అయింది. రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ వార్డు, డివిజన్ సభ్యులు తెలుదేశం, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. పాలకొండలో మాత్రం ఒక్కరు తెలుగుదేశం పార్టీలో చేరగా మిగిలిన సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక్కరు ఎస్సీ సామాజిక వర్గం కావడం, చైర్మన్ పోస్టు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు కావడంతో అక్కడ తెలుగుదేశం పార్టీకి చుక్కెదురైంది. వేరే వారు పోటీ చేసేందుకు వీలు లేదు. అలాగని పార్టీ మారిన వర్డు మెంబరు నామినేషన్ చెల్లే అవకాశం లేదు. దీంతో అక్కడ మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. సభ్యులు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు.

పట్టు నిలుపు కున్న వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి తన పట్టు నిలుపుకున్నారు. ఆమె కొండదొర (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన వారు. పాలకొండ నియోజకవర్గం ఎస్టీకి రిజర్వు కావడంతో అక్కడ కళావతికి ఎదురు లేకుండా ఉంది. కళావతి మంచి వాక్చాతుర్యం ఉన్న మహిళ. అక్కడి గిరిజనుల్లో ఆమె పట్టు పెంచుకున్నారు. ఆమె ఎలా చెబితే అలా అడుగులు వేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉన్నారంటే ఆశ్చర్యంగానే ఉంటుది. రెండు సార్లు ఎమ్మెల్యేగా విధులు నిర్వహించిన కళావతి అవినీతి మచ్చ అంటించుకోలేదు. మాజీ మంత్రి రాజన్న దొరతో మంచి రాజకీయ సంబంధాలు పెట్టుకున్నారు. రాజన్న దొర ద్వారా పాలకొండ అటవీ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాత్రం కళావతి రహదారుల నిర్మాణాలు చేయించలేక పోయారు. నిధులు లేక చేయించలేక పోయారనే ప్రచారం ఆమెను కాపాడింది.

పాలకొండ ప్రజలకు రాజశేఖరంపై గురి ఎక్కువ..

పాలకొండలో వైఎస్సార్సీపీ ఏ కార్యక్రమాలు చేసినా అవి పాలవలస రాజశేఖరం ఇంటి నుంచే మొదలవుతాయి. రాజశేఖరం జనవరి 13న మృతి చెందారు. ఆయన సమితీ అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు విక్రాంత్, కుమార్తె రెడ్డి శాంతిలు రాజకీయాల్లో ఉన్నారు. రాజశేఖరం భార్య కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. కోడలు, అల్లుడు కూడా పదవుల్లో ఉన్నారు. ఎప్పుడు వెళ్లినా రాజశేఖరం ఇల్లు జనంతో సందడిగా ఉంటుంది. ఒక్కో మూలన ఒక్కో గిరిజన తెగకు చెందిన వారు కూర్చుని ఉంటారు. ఆ నియోజకవర్గంలో ఎవరికి ఏమి కావాల్సి వచ్చినా రాజశేఖరం వారి సమస్యలు పరిష్కరించే వారు. అందుకే ఆయనంటే జనం అంత దగ్గరగా ఉంటారు. ఆయన మృతి చెందటంతో నియోజకవర్గంలో కాస్త నైరాస్యం నెలకొన్నా విక్రాంత్ నేతృత్వంలో పార్టీ పటిష్టంగానే ఉంది. రాజాం నియోజకవర్గం కూడా వీరి చేతుల్లోనే ఉంది. గతంలో రెండు సార్లు వైఎస్సార్సీపీనే అక్కడ గెలిచింది. గత ఎన్నికలో టీడీపీ గెలిచింది.

ఇంట్లో వారంతా రాజకీయాల్లోనే..

పాలవలస రాజశేఖరం తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన భార్య పాలవలస ఇందుమతి రేగిడి మండల జడ్పిటీసీగా ఉన్నారు. కుమారుడు విక్రాంత్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అల్లుడు రౌతు హనుమంతరావు ప్రస్తుతం మునిసిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇన్చార్జ్ చైర్మన్ గా ఆయనే కొనసాగుతున్నారు. విక్రాంత్ భార్య గౌరీ పార్వతి పాలకొండ జడ్పిటీసీగా ఉన్నారు. కుమార్తె, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గా పనిచేస్తున్నారు. అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. దాదాపు అందరికీ పదవులు ఉన్నాయి. నియోజకవర్గంలో వీరి ఇంటి నుంచే వైఎస్సార్సీపీ రాజకీయాలు నడుస్తున్నాయి.

రాజశేఖరం కుటుంబానికి జగన్ అత్యంత ప్రాధాన్యత..

పాలవలస రాజశేఖరం కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పూర్వపు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గం ప్రస్తుతం మన్యం జిల్లాలో కలిసింది. పార్వతీపురం మన్యం జిల్లా గతంలో విజయనగరం జిల్లాలో ఉంది. పాలకొండ నియోజకవర్గం ఎక్కువ అటవీ ప్రాంతం కావడం, గిరిజనులు ఎక్కువ మంది ఉండటం విశేషం. రాజశేఖరం కోడలు, భార్య జడ్పీటీసీలుగా ఉన్నారు. కుమారుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. కుమార్తె మాజీ ఎమ్మెల్యే. వీరు ఏమి చెబితే అది కాదనే పరిస్థితి జగన్ వద్ద లేదు. వైఎస్సార్ సీపీ బలం పెరుగుతుందే తప్ప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం పెరగటం లేదు. గిరిజనులంతా ఎక్కువగా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారని చెప్పొచ్చు. మునిసిపాలిటీలోనే వైఎస్సార్సీపీ పట్టు తెలిసిపోయింది. డబ్బుకు ఆశపడి తెలుగుదేశం వైపు మొగ్గు చూపకుండా ఉన్న కౌన్సిలర్స్ ను జగన్ అభినందించారు.

పాలకొండ మునిసిపాలిటీ వైఎస్సార్ సీపీ దే..

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీలో వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఈ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇందులో 17 వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుపొందగా 3 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో గెలుపొందింది. ఇక్కడ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన యందవ రాధాకుమారి ఇటీవలి వరకు ఉన్నారు. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఆయన చనిపోవడంతో రాధాకుమారికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె మునిసిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ చైర్మన్ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఈ మునిసిపాలిటీ చైర్మన్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. రెండో వార్డు నుంచి గెలిచిన ఆకుల మల్లీశ్వరి ఒక్కరు మాత్రమే ఎస్సీ మహిళగా ఉన్నారు. దీంతో ఆమె మాత్రమే ఎన్నికలో పోటీ చేసేందుకు అర్హురాలు.

ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీలో ఉన్న మల్లీశ్వరి ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈమె ఎన్నికలో పోటీ చేయాలంటే వైఎస్సార్సీపీ బీఫారం ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీలో చేరినా బి ఫారం ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. అయితే ఈమె తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల వైఎస్సార్సీపీ బీ ఫారంపై పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎన్నికల అధికారికి ఆమె చెప్పారు. అందుకు నిబంధనలు అంగీకరించవని ఎన్నికల అధికారి ఆమెకు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ తరపున గెలిచారు కాబట్టి ఆ పార్టీ తరపున మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నిక ఆగిపోయింది. ఆమె కాకుండా పోటీ చేసే అర్హత వేరే వారికి లేకపోవడంతో మూడో సారి కూడా ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం ఇక్కడ వైఎస్సార్సీపీ వైఎస్ చైర్మన్ హనుమంతరావు ఇన్చార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ వత్తిడులకు లొంగకుండా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అడుగులు వేస్తున్నారు. పాలవలస రాజశేఖరం కుటుంబంపై ఉన్న గౌరవమే అక్కడ వైఎస్సార్సీపీని కాపాడుతుందనటడంలో సందేహం లేదు.

పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ట నిమిత్త మాత్రుడు

జనసేన పార్టీ తరపున నిమ్మక జయకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉన్నత విద్యావంతుడు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో ఆ సీటు జనసేనకు పోవడంతో జయకృష్ణ పార్టీ మారి జనసేనకు వచ్చి టిక్కెట్ సంపాదించారు. జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాలకొండ నుంచి కళావతిపై పోటీ చేసి ఓడిపోయారు. జయకృష్ణ తండ్రి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పార్టీలో చేరి 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పాలకొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ కుటుంబం ప్రభావం తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజశేఖరం కుటుంబ ప్రభావం ముందు పనిచేయలేదు. చివరకు తెలుగుదేశం పార్టీ నుంచి సీటు కోసం జనసేనకు జయకృష్ణ వెళ్లాల్సి వచ్చింది.

Read More
Next Story