రేవంత్ మాటలకు అర్ధమిదేనా ?
x

రేవంత్ మాటలకు అర్ధమిదేనా ?

అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల, హామీల అమలుకు సరిపడా నిధులు లేవని ఇపుడు చెప్పటం ఎందుకు ?


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 1692 మంది లెక్షిరర్లకు నియామక పత్రాలు ఇచ్చేసమయంలో రేవంత్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఇంతకీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే ‘ఆదాయం పెరిగితేనే పథకాలు అమలుచేయగలం’ అన్నాడు. సంక్షేమపథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వానికి నెలకు రు. 22 వేల కోట్లు కావాలని చెప్పాడు. అయితే నెలకు ఆదాయం రు. 18,500 కోట్లు మాత్రమే వస్తోందట. అంటే రేవంత్ చెప్పిన లెక్కల ప్రకారమే నెలకు రు. 3500 కోట్లు ఆదాయంలో కోతపడుతోంది. నెలకు అందుతున్న రు. 18500 కోట్లలో ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలకే రు. 6500 కోట్లు ఖర్చవుతోందట.

మరో రు. 6500 కోట్లు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోందట. మిగిలిన రు. 5,500 కోట్లలోనే 30 సంక్షేమపథకాలకు నిధులు ఖర్చు చేయాల్సొస్తోందని రేవంత్(Revanth) చెప్పాడు. ఈ రు. 5,500 కోట్లలోనే సంక్షేమ పథకాల అమలే కాకుండా ప్రాజెక్టుల నిర్మాణాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేస్తున్నదట ప్రభుత్వం. 5500 కోట్ల రూపాయల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయాలంటే చాలా కష్టంగా ఉందన్నాడు. అందుకనే ఒక్కోనెలలో ఒక్కో పథకానికి చెల్లింపులను పెండింగులో పెడుతున్నట్లు రేవంత్ వాపోయాడు. తమ ప్రభుత్వం వస్తున్న ఆదాయాన్ని కేవలం రొటేషన్ మాత్రమే చేస్తోందన్నాడు.

రేవంత్ చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే సంక్షేమపథకాల అమలుకు ప్రభుత్వం దగ్గర నిధులు సరిపడా లేవన్న కారణాన్ని చూపించి మెల్లిగా కొన్ని పథకాల అమలుకు కోతపెడతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2023 ఎన్నికల్లో రైతు రుణమాఫీ అన్నాడు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత రు. 2 లక్షల లోపు రుణాలున్న సుమారు 45 లక్షలమంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. రు. 2 లక్షలకు పైగా రుణాలు పూర్తిగా మాఫీకాలేదు. 2 లక్షలకు పైగా రుణాలున్న రైతుల సంఖ్య సుమారుగా 14 లక్షలుంది. వీళ్ళందరికీ రుణమాఫీ ఎప్పడవుతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే మహిళలకు తులంబంగారం ఇస్తామని మరో హామీ ఇచ్చాడు. మహిళలకు తులంబంగారం ఎప్పుడిస్తావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) ప్రభుత్వాన్ని గట్టిగా తగులుకుంటున్నా రేవంత్ నుండి సమాధానం లేదు.

కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులందరికీ స్కూటీలు(Scooty) ఇస్తామన్నది మరో హామీ. ఇప్పటివరకు ఒక్క విద్యార్ధినికి కూడా స్కూటి ఇవ్వలేదు ప్రభుత్వం. ప్రతి విద్యార్ధినికి తలా ఒకస్కూటీ ఇవ్వాలంటే కొన్ని లక్షల స్కూటీలు అవసరం. అంతడబ్బు రేవంత్ ఎక్కడనుండి తీసుకొస్తాడు ? అధికారంలోకి రావటమే లక్ష్యంగా నోటికొచ్చిన అడ్డుగోలు హామీలను ఎవరివ్వమన్నారు ? అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల, హామీల అమలుకు సరిపడా నిధులు లేవని ఇపుడు చెప్పటం ఎందుకు ? తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్లరూపాయల అప్పుల్లో ఉందన్న విషయం ప్రతిపక్షంలో ఉన్నపుడే రేవంత్ కు బాగా తెలుసు. అప్పుడేమో అధికారం అప్పగిస్తే ఆకాశాన్ని నేలమీదకు తీసుకొస్తాం.. తెలంగాణ(Telangana)కు సముద్రాన్ని తీసుకొస్తామనే ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చేసి ఇపుడేమో ఆదాయాలు పెరిగితేనే పథకాలను అమలుచేయగలమని మొసలి కన్నీరు కార్చటం ఎందుకు ? రేవంత్ వైఖరి చూస్తుంటే పథకాల అమలుపై ఎప్పుడో చేతులెత్తేసినా ఆశ్చర్యంలేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story