రేవంత్ ‘ఈ స్లాట్’ విధానం బంపర్ హిట్ అయినట్లేనా ?
x
E Slot system in Registrations department

రేవంత్ ‘ఈ స్లాట్’ విధానం బంపర్ హిట్ అయినట్లేనా ?

అత్యంత అవినీతి మయమైన ప్రభుత్వశాఖలు ఏవని ఎవరిని అడిగినా రిజిస్ట్రేషన్ల శాఖ పేరు కచ్చితంగా ఉంటుంది.


అత్యంత అవినీతి మయమైన ప్రభుత్వశాఖలు ఏవని ఎవరిని అడిగినా రిజిస్ట్రేషన్ల శాఖ పేరు కచ్చితంగా ఉంటుంది. కొనుగోలుచేసిన ఆస్తిని మనపేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా పెద్దఎత్తున ముడుపులు ముట్టచెప్పనిదే ఫైల్ అంగుళం కూడా కదలదు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ రద్దుచేయాలన్నా, భాగపరిష్కారం చేసుకున్న డాక్యుమెంట్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా...విషయం ఏదైనా కానీండి రిజిస్ట్రేషన్ కార్యాలయం గడప తొక్కితే చాలు ముడుపులు చెల్లించుకోక తప్పదు. ముడుపులు చెల్లించకపోతే ఫైల్ ఎంతకాలమైనా అలాగే పడుంటుంది. ఇలాంటి ఆపీసులో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ‘ఈ స్లాట్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. గురువారం నుండి మొదలైన ఈ పద్దతిపై జనాలు ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే కట్టాల్సిన చలానాలు కట్టేస్తే 15 నిముషాల నుండి 30 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోతోంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రయకు పడుతున్న గంటల సమయాన్ని, ముడుపులు ముట్టచెప్పటాన్ని నిరోధించేందుకు రేవంత్ ప్రభుత్వం కొత్తగా ఈ స్లాట్(E slot) విధానాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానంలో 626 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రతి రిజిస్ట్రేషన్ సగటున 25 నిముషాల్లో పూర్తయిపోయింది. ఈ స్లాట్ విధానం ప్రక్రియ ఏ విధంగా జరుగుతోందనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఐజీ స్ధాయి ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూర్చున్నారు. రిజిస్ట్రేషన్లు ఒకేసారి మొదలవ్వటంతో ఉదయం కొద్దిసేపు సర్వర్లు మొరాయించాయి. తర్వాత కాసేపటికి పనిచేయటం మొదలుకాగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఊపందుకున్నది.

రిజిస్ట్రేషన్లు చేయించుకోదలచినవారు ముందుగా ప్రభుత్వ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్.తెలంగాణ.జీవోవీ.ఇన్(Registration.Telangana.Gov.In)లో తమకు కావాల్సిన సమయాలను నమోదుచేసి స్లాట్ బుక్ చేసుకున్నారు. వెంటనే సదరు జనాలకు కోరుకున్న స్లాట్ లో రిజిస్ట్రేషన్ సమయం బుక్ అయినట్లు సమాచారం అందింది. దాంతో సదరు జనాలు తాము కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళారు. స్లాట్ బుక్ చేసుకున్నపుడు ఆస్తి కొనుగోలా, అమ్మకమా ? అని టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా ముందే చెప్పాలి. దాని ప్రకారం ఆపీసుకు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్ల జాబితా కూడా స్క్రీన్ మీద కనబడ్డాయి. దాంతో జనాలు అన్నీ డాక్యుమెంట్లతో తాము స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి ఆఫీసుకు చేరుకున్నారు. తమకు కేటాయించిన సమయం ప్రకారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలై 25 నిముషాల్లోనే పూర్తయిపోయింది. అంతేకాకుండా వెంటనే రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లను కూడా జనాలకు అందుతోంది.

గతంలో ఇదే ప్రక్రియకు సుమారు 4 గంటలుపట్టేది. రిజిస్ట్రేషన్ ఆఫీసుకు చేరుకున్న తర్వాత అక్కడ సిబ్బంది ఆ డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ లేదని తిప్పటంతో జనాలకు బాగా విసుగొచ్చేసేది. అన్నింటినీ ఓర్చుకుని డాక్యుమెంట్లను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా డాక్యుమెంట్ల చేతికి వచ్చేటప్పటికి మరో రెండురోజులుపట్టేది. ఈనేపధ్యంలోనే ముడుపులు కీలకపాత్రపోషించేది. అడిగినంత ముడుపులు చెల్లించుకున్నవారికి రిజిస్ట్రేషన్ తొందరగా పూర్తయి డాక్యుమెంట్లు చేతికొచ్చేవి. ఇవ్వని వారికి బాగా ఆలస్యమయ్యేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. కొత్తగా ప్రవేశపెట్టిన ఈస్లాట్ రిజిస్ట్రేషన్ విధానం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటల తరబడి నిరీక్షణ లేకుండా అర్ధగంటలోపే రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని జనాలు కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.

స్లాట్ విధానం బ్రహ్మాండం

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈస్లాట్ విధానం బ్రహ్మాండంగా ఉందని గట్టు శ్రీనివాస్ అన్నారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకుని, అవసరమైన డాక్యుమెంట్లన్నింటినీ తీసుకెళ్ళినట్లు చెప్పారు. తాను ఆఫీసుకు వెళ్ళి అధికారులను కలిసిన దగ్గర నుండి 30 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిందని సంతోషంతో చెప్పారు. ఘన్ శ్యామ్ అనే అమ్మకందారుడు మాట్లాడుతు శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన స్లాట్ లో మరొకరికి కేటాయించినట్లు చెప్పారు. అర్ధగంటలోపే రిజిస్ట్రేషన్ అయిపోయిందన్నారు. ఆఫీసులో ఎలాంటి రద్దీ, అవినీతి లేకుండా ఈ స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని శ్యామ్ సంతృప్తి వ్యక్తంచేశారు. వల్లభ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ అర్ధగంలోనే పూర్తయినట్లు స్వాతి చెప్పారు. తాను ఆఫీసులోకి అడుగుపెట్టిన 20 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిందన్నారు. మూడునెలల క్రితం ఇదే మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కోసం ఆపీసుకు వస్తే మూడుగంటలు పట్టిన విషయాన్ని స్వాతి గుర్తుచేసుకున్నారు.

మొత్తంమీద అవినీతి నిలయంగా మారిపోయిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటలు, రోజుల తరబడి వెయిటింగ్ లేకుండా అర్ధగంటలోపే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతే జనాలకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది ? జనాలు హ్యాపీగా ఉంటే రేవంత్ ప్రభుత్వం మీద నెగిటివిటి కూడా తగ్గుతుందనటంలో సందేహంలేదు. ఇదే విషయమై ఆర్ధికశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) మాట్లాడుతు జనాలకు సౌకర్యాలు కల్పించటంలో భాగంగానే తమ ప్రభుత్వం సంస్కరణలను ప్రవేశపెట్టిందన్నారు. తమ ప్రభుత్వం ఏపనిచేసినా జనాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తుందన్నారు. త్వరలో ఆర్ధికశాఖలో తమ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలను తీసుకురాబోతున్నట్లు పొంగులేటి చెప్పారు.

Read More
Next Story