ఇది బీఆర్ఎస్ చేతకాని తనమేనా ?
x

ఇది బీఆర్ఎస్ చేతకాని తనమేనా ?

కేసీఆర్ చేతకానితనం వల్లే తెలంగాణా తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఉందన్నది వాస్తవం.


తాజా రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ చేతకానితనమే అని సందేహం లేకుండా చెప్పచ్చు. విషయం ఏమిటంటే సచివాలయం ముందు సోమవారం రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాందీ 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1500 కిలోల కంచుతో చేసిన ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, పీసీసీ కొత్త అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలంతా హాజరయ్యారు. ఇదివరకే కాకుండా ఇపుడు కూడా రాజీవ్ విగ్రహం ఆవిష్కరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నానా రచ్చ చేశారు. తెలంగాణా తల్లి విగ్రహం ఏర్పాటుచేయాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఏర్పాటుచేసినందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం బీఆర్ఎస్ నిరసనలు తెలపాలని కేటీఆర్ పిలుపిచ్చారు. మరి కేటీఆర్ పిలుపుకు బీఆర్ఎస్ లో ఎంతమంది స్పందించారో తెలీదు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజీవ్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ బెదిరింపులు, నిరసన పిలుపు కాదు. కేసీఆర్ చేతకానితనం వల్లే తెలంగాణా తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఉందన్నది వాస్తవం. ఎలాగంటే సచివాలయం నిర్మాణ పనుల్లో తెలుగుతల్లి విగ్రహం ఉండటం పనులకు ఆటంకం కలిగిస్తోందని కేసీఆర్ తెలుగుతల్లి విగ్రహాన్ని తీయించేశారు. నిజానికి తెలుగుతల్లి విగ్రహానికి సచివాలయం నిర్మాణపనులకు ఎలాంటి సంబంధంలేదనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. అయినా సరే ఆరోపణలను లెక్కచేయకుండా తెలుగుతల్లి విగ్రహాన్ని తీయించేశారు. తెలుగుతల్లి విగ్రహాన్ని తీయించేసిన చోట తెలంగాణాతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. కొంతకాలానికి తెలంగాణా తల్లి విగ్రహం తయారీ కూడా పూర్తయ్యింది.



కొత్త సచివాలయం నిర్మాణం అయిపోయి ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. తర్వాత సచివాలయంకు ఎదురుగా అమరజ్యోతి నిర్మాణం కూడా అయిపోయి, ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. మరి రెండింటికి మధ్యలో తీసేసిన తెలుగుతల్లి విగ్రహం ప్రాంతంలో తెలంగాణా తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఎందుకు ఏర్పాటుచేయలేదు ? దాదాపు ఏడాదిపాటు తెలంగాణా తల్లి విగ్రహం ఏర్పాటుచేస్తామన్న ప్రాంతాన్ని కేసీఆర్ ఖాళీగానే ఉంచేశారు. కొత్త సచివాలయం, అమరజ్యోతి నిర్మాణాలు పూర్తియిపోయాయి కాబట్టి తెలంగాణాతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయమని తెలంగాణా వాదులు మొత్తుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదు.




తెలంగాణాతల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో కేసీఆర్ మనసులో ఏముందో తెలీదు కాని తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలుగుతల్లి విగ్రహాన్ని తీయించేసిన ప్రాంతంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించగానే కేటీఆర్ ఏదేదో మాట్లాడారు. రాజీవ్ విగ్రహాన్ని తీసి పారేస్తామని నానా రచ్చచేశారు. ఒక వైపు మాటల యుద్ధం జరుగుతుండగానే సోమవారం సచివాలయం-అమరజ్యోతికి మధ్యలో ఖాళీగా ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. దానిపై కేటీఆర్ మండిపోయి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని భద్రంగా తీసి గాంధీభవన్ కు పంపిస్తామంటు చేసిన ప్రకటన రాజకీయ రచ్చకు దారితీసింది.



ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ రాజీవ్ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడితే మరి అధికారంలో ఉన్న రేవంత్, మంత్రులు ఊరుకుంటారా ? కేటీఆర్ కు తగ్గట్లే ఘాటు సమాధానాలిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా ? వచ్చిన తర్వాత అప్పుడు ఏమిచేస్తుంది ? చెప్పినట్లే రాజీవ్ విగ్రహాన్ని పీకేస్తుందా ? అన్నది ఇపుడు అనవసరం. ఇపుడు విషయం ఏమిటంటే అధికారంలో ఉండగానే కేసీఆర్ తెలంగాణాతల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు ? అని. తెలుగుతల్లి విగ్రహాన్ని తీయించేసిన కేసీఆర్ అదే ప్రాంతంలో తెలంగాణాతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయించేసుంటే ఇపుడా ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ కు అవకాశం ఉండేది కాదు. తెలంగాణాతల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ప్రాంతంలో రాజీవ్ విగ్రహం ఏర్పాటుచేసి తెలంగాణా అస్తిత్వాన్ని రేవంత్ దెబ్బ తీశారన్న ఆరోపణల్లో కూడా పసలేదు. ఎందుకంటే తెలంగాణాతల్లి విగ్రహాన్ని కేసీఆర్ సచివాలయం బయట ఏర్పాటు చేయాలని అనుకుంటే రేవంత్ తెలంగాణాతల్లి విగ్రహాన్ని సచివాలయంలోనే ఏర్పాటు చేశారు. రాజీవ్ విగ్రహం ఏర్పాటు కోసం తెలంగాణాతల్లి విగ్రహానికి రేవంత్ తక్కువేమీ చేయలేదు.




కేసీఆర్ లాగ రేవంత్ కూడా తెలంగాణాతల్లి విగ్రహాన్ని ఎక్కడో మూలన పడేసుంటే అప్పుడు కేటీఆర్ తెలంగాణా సెంటిమెంటును ప్రయోగించినా ఉపయోగముండేది. రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో తెలంగాణాతల్లి విగ్రహం ఏర్పాటుకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. రేవంత్ చేసిన పనివల్ల కేసీఆర్ చేతకానితనమే బయటపడింది. కేటీఆర్ వ్యవహారం ఎలాగుందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది.

Read More
Next Story