కలెక్టర్ మీద దాడి వెనుక ఇంత కుట్ర జరిగిందా ?
x

కలెక్టర్ మీద దాడి వెనుక ఇంత కుట్ర జరిగిందా ?

ప్లాన్ వేసుకుని ఉద్రిక్త వాతావరణ పరిస్ధితులను కల్పించుకుని, గ్రామస్తులను రెచ్చగొట్టి ముసుగులో కొందరు అసాంఘీక శక్తులు కలెక్టర్ మీద దాడిచేసినట్లు అర్ధమైపోతోంది.


తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తెలంగాణాలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్(Vikarabad District Collector Prateek Jain) ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. రాజకీయపార్టీల నేతలు లేదా క్యాడర్ ఒకళ్ళపై మరొకళ్ళు దాడులు చేసుకోవటం మామూలే. కాని ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ మీదనే దాడిచేసి కొట్టడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. జరిగిన దాడిని చూస్తే ఇదేదో అప్పటికప్పుడు కోపంతో గ్రామస్తులు కలెక్టర్ మీద దాడిచేసినట్లు అనిపించటంలేదు. ముందుగానే ప్లాన్ వేసుకుని ఉద్రిక్త వాతావరణ పరిస్ధితులను కల్పించుకుని, గ్రామస్తులను రెచ్చగొట్టి ఆ ముసుగులో కొందరు అసాంఘీక శక్తులు కలెక్టర్ మీద దాడిచేసినట్లు అర్ధమైపోతోంది. అందుకనే కలెక్టర్ మీద జరిగిన దాడిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నది. జిల్లా ఎస్పీ(District SP NarayanaReddy)నే స్వయంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికి దాడికి కారణమని పోలీసులు సుమారు 60 మంది మీద కేసులు నమోదుచేసి అరెస్టులు చేశారు. ఎలాగూ అరెస్టయ్యారు కాబట్టి పోలీసులు తీగను లాగితే డొంకంతా కదలటమే మిగులుంది.

ఇంతకీ జరిగింది ఏమిటంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy) నియోజకవర్గం కొండగల్(Kodangal) లో ఫార్మాయూనిట్లు(Pharma Units) ఏర్పాటుచేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఫార్మాయూనిట్లు ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించాలి. భూములు అంటే పంటపొలాలే అని అర్ధంచేసుకోవాలి. పంటలు పండే భూములను ఇచ్చేదిలేదని కొందరు రైతులు ప్రభుత్వానికి తెగేసిచెప్పారు. ఫార్మా కంపెనీలకు భూములు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ మొదటినుండి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందుకనే రైతుల వ్యతిరేకత వెనుక బీఆర్ఎస్(BRS) నేతలున్నారనే ఆరోపణలు, ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటి స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి సోమవారం కొడంగల్లోని దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి వెళ్ళారు. ఫార్మా యూనిట్ల ఏర్పాటులో ప్రజాభిప్రాయసేకరణ చేయటానికి కలెక్టర్ ప్రత్యేకంగా గ్రామస్తులతో మీటింగ్ పెట్టారు.

అయితే కలెక్టర్ ను మాట్లాడనీయకుండా మొదటినుండి గ్రామస్తుల్లో కొందరు పదేపదే అడ్డుపడుతునే ఉన్నారు. తాను చెప్పే విషయాలను అందరు వినాలని తర్వాత చర్చలు జరుపుదామని కలెక్టర్ ఎంతచెప్పినా గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో కలెక్టర్ తో పాటు వచ్చిన అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, స్పెషల్ ఆఫీసర్ కాస్త గట్టిగానే గ్రామస్తులతో మాట్లాడారు. స్వయంగా కలెక్టర్ గ్రామానికి వచ్చినపుడు ఏమి చెబుతారో వినాలని గట్టిగానే మందలించారు. దాంతో గ్రామస్తుల్లో కోపం కట్టలు తెంచుకుని ఒక్కసారిగా కలెక్టర్, అదనపు కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ మీదకు(Mob Attack) దాడిచేశారు. నిజానికి ఇక్కడ కలెక్టర్ మీద దాడిచేసేంత సీన్ లేనేలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే కలెక్టర్ చెప్పిన విషయాలు ఇష్టంలేకపోతే అదే విషయాన్ని చెప్పేసి రైతులు లేదా గ్రామస్తులు సమావేశం నుండి వెళ్ళిపోవచ్చు. అంతేకాని భూములు ఇవ్వటం ఇష్టంలేని రైతులు కలెక్టర్ మీద దాడిచేయాల్సిన అవసరం ఏముంది ?

ఒక్కసారిగా వందలాదిమంది గ్రామస్తులు కలెక్టర్ ను చుట్టుముట్టేసరికి అక్కడ ఏమి జరుగుతోందో పోలీసులతో పాటు అధికారులకు ఏమీ అర్ధంకాలేదు. ఈ గ్యాప్ లోనే ఇద్దరు మహిళలు కలెక్టర్ మీద చేయిచేసుకున్నారు. అలాగే అదనపు కలెక్టర్ మీద పిడిగుద్దులు కురిపించారు. స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని అయితే దుమ్మురేగగొట్టారు. కర్రలు, చెప్పులు తీసుకుని వెంటపడి మరీ తరిమారు. కలెక్టర్ మీద దాడి ఘటన సంచలనమైపోయింది. కలెక్టర్ మీద మామూలు జనాలకు ఎంత కోపమున్నా గట్టిగా మాట్లాడుతారు లేదా మాట్లాడటం ఇష్టంలేకపోతే సమావేశం నుండి వెళ్ళిపోతారు. ఎక్కడైనా జరిగేది ఇదే. కాని లగచర్లలో జరిగింది మాత్రం పూర్తి విరుద్ధం. జరిగిన ఘటన చూస్తే పక్కాగా ప్లాన్ చేసుకుని కలెక్టర్ తో పాటు అధికారులపై దాడిచేశారన్న విషయం అర్ధమైపోతోంది. ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే బీఆర్ఎస్ నేతల మీదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జరిగినదాడిలో కనిపించిన వారిలో కొందరు బీఆర్ఎస్ లో యాక్టివ్ గా తిరుగుతుంటారు కాబట్టే.

ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతు కలెక్టర్ మీద దాడి ఘటనకు బాధ్యులుగా గుర్తించిన వారిలో ఇప్పటికి 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అధికారులపై జరిగిన దాడిలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్లు చెప్పారు. ఎందుకంటే దాడిలో సురేష్ అనే కారుపార్టీ నేత కీలకంగా వ్యవహరించినట్లు వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనబడిందన్నారు. వికారాబాద్ జిల్లా ఘటన తర్వాత ఇతర జిల్లాల్లో గ్రామస్తులతో జరగాల్సిన అధికారుల సమావేశాలు రద్దుయ్యాయి. నల్గొండ(Nalgonda District) జిల్లా దామచర్ల మండలంలోని గణేష్ పహాడ్ లో అంబుజాసిమెంట్స్(Ambuja Cements) ఫ్యాక్టరీ ఏర్పాటు, భూముల సేకరణపై మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సుంది. లగచర్ల ఘటన ప్రభావం కారణంగా దామచర్ల మండలంలో సమావేశాన్ని అధికారులు వాయిదా వేసుకున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గ్రామసభలో కలెక్టర్ తో పాటు ఇతర అధికారుల మీద జరిగిన దాడి అక్కడితో ఆగిపోలేదు. వారిని సమావేశం నుండి వెళ్ళగొట్టి ఆ ప్రాంతం నుండి తరిమేశారు. గ్రామస్తుల రియాక్షన్ చూసిన తర్వాత కలెక్టర్ కూడా తన అధికారులతో అక్కడినుండి వెళ్ళటానికి రెడీ అయ్యారు. అయినా గ్రామస్తులు వదలకుండా వెంటపడి మరీ దాడులు చేశారు. అధికారులు కారులో కూర్చున్న తర్వాత కూడా వదిలిపెట్టకుండా కార్లను రాళ్ళు, కర్రలతో కొట్టి ధ్వంసంచేయటమే ఆశ్చర్యంగా ఉంది. కలెక్టర్, అధికారులను వెంటాడి మరీ దాడిచేశారంటేనే ఇది ప్లాన్ ప్రకారం జరిగిన దాడిగా అర్ధమైపోతోంది. కలెక్టర్ మీద ఎంతకోపమున్నా దాడికి ఎవరూ ప్రయత్నంచేయరు. ఎందుకంటే కలెక్టర్ మీద చేస్తే తర్వాత పరిణామాలు ఎలాగుంటాయో అందరికీ తెలుసు. మామూలుగా అయితే అసలు దాడి ఆలోచన కూడా గ్రామస్తులకు రాదు. పైగా కలెక్టర్ కు పోలీసు రక్షణ ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. ఇన్ని తెలిసినా కూడా దాడిజరిగిందంటే దీనివెనుక పెద్ద కుట్ర ఉందన్న విషయం అర్ధమైపోతోంది. ఇప్పటికే పోలీసులకు బీఆర్ఎస్ నేతల పాత్రపై ఆధారాలు కూడా దొరికినట్లు ఎస్పీ చెప్పారు. కాబట్టి కలెక్టర్ మీద దాడివెనుక బీఆర్ఎస్ హస్తం ఉందనే అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

Read More
Next Story