మావోయిస్టుల శాంతిచర్చల డిమాండుకు మద్దతు పెరుగుతోందా ?
x
Operation Kagar in Karreguttala forest

మావోయిస్టుల శాంతిచర్చల డిమాండుకు మద్దతు పెరుగుతోందా ?

ఆదివాసీ+మాజీ మావోయిస్టయిన సీతక్క ఆపరేషన్ కగార్ నిలిపేయాలని రేవంత్ కు తెలీకుండా డిమాండ్ చేసే అవకాశంలేదు


క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఆపరేషన్ కగార్’ నిలిపేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డిమాండ్లు అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాల ఎంతడిమాండ్ చేసినా ఎలాంటి ఉపయోగాలుండవు. అయితే శాంతిచర్చలకు మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క(Minister Seetakka) కూడా డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. మావోయిస్టు(Maoists) ప్రభావిత రాష్ట్రాలను అనుసంధానం చేసుకుని కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది. 2026, మార్చినాటికి దేశంలో మావోయిస్టులను తుడిచిపెట్టేయటమే టార్గెట్ అని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Amitshah) ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇందులో భాగంగానే గడచిన పదిరోజులుగా ఛత్తీస్ ఘడ్-తెలంగాణ-మహారాష్ట్ర మధ్యలో ఉన్న కర్రెగుట్టల అడవుల్లో సుమారు 24 వేల మంది సిబ్బందితో భద్రతాదళాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే మావోయిస్టుల కోసం వేలాదిసంఖ్యలో భద్రతాదళాలు గాలింపు మొదలైందో శాంతిచర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్(Operation Kagar) నిలిపేయాలని ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల నేతలు పెద్దఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే అడవుల మధ్యలో మావోయిస్టు అగ్రనేతలు ఇరుక్కుపోయారని భద్రతాదళాల చేతుల్లో ఎన్ కౌంటర్ అయిపోక తప్పదని వీరిలో ఆందోళన పెరిగిపోతోంది. ఆపరేషన్ కగార్ నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నవారంతా ఏదోరకంగా మావోయిస్టుల మద్దతుదారులే అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

భద్రతాదళాల చేతిలో మావోయిస్టులు ఎన్ కౌంటర్ కాకుండా కాపాడుకోవటమే మద్దతుదారుల లక్ష్యం. అందుకనే ఇదే డిమాండుతో పౌరహక్కులు, మానవహక్కుల సంఘాల నేతలు రేవంత్(Revanth) ను కూడా కలిసి విజ్ఞప్తిచేశారు. ఇదేసమయంలో బీఆర్ఎస్(BRS Chief KCR) రజతోత్సవ బహిరంగసభలో కేసీఆర్ కూడా శాంతిచర్చలు జరపాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ డిమాండ్ తర్వాత వామపక్షాలు కూడా ఇదే డిమాండును వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మంత్రి సీతక్క కూడా ఆపరేషన్ కగార్ నిలిపేసి శాంతిచర్చలు జరపాలని కేంద్రాన్ని కోరటం ప్రాధాన్యత సంతరించుకున్నది. సీతక్క కూడా ఒకపుడు మావోయిస్టే అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆదివాసీ+మాజీ మావోయిస్టయిన సీతక్క ఆపరేషన్ కగార్ నిలిపేయాలని రేవంత్ కు తెలీకుండా డిమాండ్ చేసే అవకాశంలేదు. మంత్రివర్గంలో రేవంత్ కు సీతక్క ప్రధాన మద్దతుదారు. కాబట్టి శాంతిచర్చలు జరపాలన్న డిమాండ్ చేసేముందే రేవంత్ తో సీతక్క మాట్లాడి ఉంటారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ ఓకే అన్న తర్వాతే సీతక్క ఆపరేషన్ కగార్ నిలిపేయాలని డిమాండ్ చేసుంటారు. ఆపరేషన్ కగార్ నిలిపేసే విషయంలో రేవంత్ కూడా వ్యతిరేకంగా ఏమీలేరు. పౌరహక్కుల సంఘాల నేతలతో రేవంత్ మాట్లాడినపుడు ఈవిషయాన్ని ముందు పార్టీలో చర్చించి తర్వాత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

నిజానికి ఆపరేషన్ కగార్ నిలిపేయాలా ? లేకపోతే కంటిన్యుచేయాలా ? అన్న విషయం రేవంత్ చేతిలో లేదు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏపీ, ఒడిస్సా(ఏవోబీ) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గతంలో అమిత్ షా సమవేశం జరిపి అందరి ఆమోదం తీసుకున్న తర్వాతనే ఆపరేషన్ కగార్ మొదలైంది. పైరాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశమైనపుడు రేవంత్ తనకు ఎదురవుతున్న డిమాండ్లను ప్రస్తావించే అవకాశం మాత్రం ఉంది. అంతేకాని ఆపరేషన్ కగార్ నిలిపేయాలని తాను డిమాండ్ చేసినంత మాత్రాన ఆగిపోదన్న విషయం రేవంత్ కు కూడా బాగా తెలుసు. మావోయిస్టుల ప్రభావం తెలంగాణలో కన్నా ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సాలో చాలా ఎక్కువగా ఉంది. పైరాష్ట్రాలు శాంతిచర్చలకు సానుకూలంగా లేవు. పైగా అమిత్ షా మావోయిస్టుల ఏరివేత విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు.

మావోయిస్టులు కూడా ఆపరేషన్ కగార్ నిలిపేసి శాంతిచర్చలు(Peace Talks) జరపాలని పదేపదే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు రిక్వెస్టు చేస్తు లేఖలు విడుదలచేస్తున్నారు. శాంతిచర్చలు జరపాలని ఎందుకింతగా గోలచేస్తున్నారంటే చావుభయంతోనే అన్నది అర్ధమైపోతోంది. గడచిన నాలుగుమాసాలుగా వందలమంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో చనిపోగా, మరికొన్ని వందలమంది ప్రాణభయంతో లొంగిపోయారు. పదులసంఖ్యలో తీవ్రగాయాలతో తప్పించుకున్నారు. భద్రతాదళాలు ఇదేపద్దతిలో ఆపరేషన్ కగార్ ను కంటిన్యుచేస్తే మావోయిస్టులను తుడిచిపెట్టేయటం పెద్ద కష్టమేమీ కాదన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఆపరేషన్ కగార్ ఇపుడు తమ ప్రాణాలమీదకు వచ్చింది కాబట్టి ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే పదేపదే శాంతిచర్చలు జరపాలని ప్రభుత్వాలపై అన్నీవైపుల నుండి ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఆపరేషన్ కగార్ ను పూర్తిగా నిలిపేయకపోయినా పర్వాలేదు శాంతిచర్చల పేరుతో కొంతకాలం వాయిదావేస్తే చాలు ఊపిరిపీల్చుకోవచ్చన్నది మావోయిస్టుల వ్యూహంలాగుంది. అందుకనే అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగమే ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, బీఆర్ఎస్, వామపక్షాలు చివరకు మంత్రి సీతక్క కూడా శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సీతక్క డిమాండ్ చూసిన తర్వాత ముందు కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ నిలిపేయాలని లేదా కొంతకాలం వాయిదావేసి శాంతిచర్చలు జరపాలని కేంద్రప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేసినా ఆశ్చర్యపోవక్కర్లేదనే అనుమానం పెరిగిపోతోంది. ప్రొఫెసర్ హరగోపాల్ నాయకత్వంలో పౌరహక్కుల సంఘం నేతలు రేవంత్ రెడ్డిని కలిసి శాంతిచర్చలకు కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తిచేశారు. పరిస్ధితి చూస్తుంటే తొందరలోనే ఆపరేషన్ కగార్ నిలిపివేత లేదా వాయిదా వేయాలని రేవంత్ కేంద్రాన్ని డిమాండ్ చేసినా ఆశ్చర్యంలేదు. సీతక్క చేసిన డిమాండుతోనే ఈ విషయమై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story