రేషన్ బియ్యం దొంగ రవాణా ఆపే సత్తా ఉందా?
x

రేషన్ బియ్యం దొంగ రవాణా ఆపే సత్తా ఉందా?

రేషన్ బియ్యం లక్షల క్వింటాళ్లు ఎల్లలు దాటుతున్నాయి. కళ్లతో పాలకులు చూస్తున్నారు. అయినా దొంగ రవాణా ఆగలేదు. ఒకవైపు పట్టుకుంటే మరో వైపు వెళుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యం దొంగ రవాణా ఎక్కువైంది. రేషన్ డీలర్లు ఈ రవాణాకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే బియ్యం అమ్ముతున్నది వారేనని, కొనుగోలు చేస్తున్న వారికి మిల్లర్లు సాయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువలా వస్తున్నా ప్రభుత్వం అరికట్టడంలో విఫలమవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వేల టన్నుల రేషన్ బియ్యం దొంగల పాలవుతున్నాయి. ఈ దొంగలు సామాన్యులు కాదు. ఏకంగా విదేశాల్లో వ్యాపారం చేసే వారు కావడం విశేషం.

పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న బియ్యం. ఒక్క పూట కూడా గడవని వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబ సభ్యులు 4.13 కోట్ల మంది ఉన్నారు. జనాభాలో ఒక వంతు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ బియ్యానికి అర్హులు కారు. మిగిలిన వారంతా రేషన్ బియ్యం కొనుగోలు చేసే వారే. అయితే ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సుద్దగానూ, పురుగులతోనూ, తుట్టెలు కట్టి ఉండటం వల్ల సామాన్యులు కూడా తినే పరిస్థితి లేదు. అందుకే బియ్యం తీసుకునే టప్పుడు వారి బియ్యం ఎన్ని కేజీలు ఉంటాయో అన్ని కేజీలకు లెక్కకట్టి డీలర్లే డబ్బులు ఇస్తున్నారు.

ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం కేజీ 42 రూపాయలు పడుతోందని చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం పూర్తి సబ్సిడీతో పేదలకు ఇస్తోంది. సాధారణంగా తినేందుకు ఎటువంటి ఇబ్బంది లేని మంచి బియ్యం కేజీ రూ. 50లకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం ఎనిమిది రూపాయలు అదనంగా చెల్లిస్తే ప్రతి ఇంట్లో వండుకుని తినేందుకు వీలున్న బియ్యం అందుబాటులో ఉన్నా ముక్కిపోయిన బియ్యాన్ని మాత్రమే ఇస్తూ తాము ప్రతి ఇంటికీ రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నామని చెప్పకునేందుకు మాత్రం నేతలు తహతహలాడుతున్నారు. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం ఇలాగే ఇవ్వాలి. బియ్యం దందాలు చేసే వారు అలాగే చేస్తూ పాలకులకు మామూళ్లు ఇస్తూ ఉండాలి. ఇదీ నేటి ప్రభుత్వంలో జరుగుతున్న రేషన్ మాఫియా వ్యవహారం.

రేషన్ బియ్యం దొంగతనంగా ఎగుమతికి ఏపీలోని పోర్టులు వేదిక లయ్యాయి. ఈ పోర్టుల నుంచి వేల టన్నులు ప్రతి రోజూ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఏపీ సివిల్ సప్లైస్ అధికారులు భాగస్వాములైతే చెక్ పోస్టుల వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇదే విధంగా దోచుకుంటున్నారు. అందుకే వెచ్చల విడిగా దోపిడీ జరుగుతోంది. కాకినాడ పోర్టు నుంచి నిత్యం వేల టన్నులు దొంగ బియ్యం రవాణా జరుగుతున్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోర్టులో తనిఖీలు చేశారు. తనిఖీ సమయంలో నానా హంగామా సృష్టించారు. దేశ వ్యాప్తంగా దేశమంతా పవన్ కల్యాణ్ వైపు చూసే విధంగా చేయగలిగారు. మూడు రోజుల పాటు మీడియాకు మంచి మేత అందించారు.

కాకినాడ పోర్టు నుంచి దొంగ రవాణా జరుగుతున్న విషయం నాకు మూడు నెలల ముందు నుంచే తెలుసు నని, అక్కడికి వెళ్లాలంటే అందరూ వద్దని చెబుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. నిజానికి దొంగ రవాణా జరుగుతున్న విషయం మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఎప్పటి నుంచో తెలుసు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రైస్ మిల్లులు, రేషన్ షాపులు, దొంగ గోడౌన్ లు, ప్రభుత్వ సివిల్ సప్లైస్ గోడౌన్ లు పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. నిల్వలను పరిశీలించారు. ఉండాల్సిన స్టాకు ఉండక పోవడం, ఒక్కో చోట ఉండాల్సిన స్టాకు కంటే ఎక్కువగా ఉండటం, కొన్ని మిల్లుల్లో అక్రమంగా తరలించేందుకు నిల్వ ఉంచిన బియ్యం కనిపించడం వంటివి జరిగాయి. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో సుమారు 50వేల టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఇంత జరిగినా రేషన్ బియ్యం దొంగ రవాణా మాఫియా ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. ఒక వైపు కాకినాడ పోర్టులో కలెక్టర్, ఎస్పీలతో పాటు మరి కొందరు అధికారులు అక్రమ బియ్యంపై విచారణ జరుపుతూ తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు వేరే పోర్టుల నుంచి బియ్యం దొంగ రవాణా జరుగుతూనే ఉంది.

గురువారం ఉదయం బద్వేలు వద్ద రూ. 15 లక్షల విలువైన ఒక లారీ లోడ్ సివిల్ సప్లైస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఆ లోడ్ లో 600 బియ్యం బస్తాలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. లారీ లోడ్ ను స్వాధీనం చేసుకుని డ్రైవర్ గంగిపోగు చిన్న ఓబులేసు ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ బియ్యం ఎక్కడికి తీసుకు పోతున్నావని డ్రైవర్ ను ప్రశ్నిస్తే కృష్ణపట్నం పోర్టులో దించాల్సిందిగా లారీ లోడు ఎత్తిన వాళ్లు చెప్పారని తెలిపారు. అంటే విశాఖపట్నం, నిజాంపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం రోజూ ఎగుమతి అవుతూనే ఉన్నాయి. పైగా కాకినాడలో ప్రత్యేకించి కొన్ని మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రీ పాలిష్ చేసి సాధారణ బియ్యంలో కలిపి బస్తాలు నింపుతున్నారు. వీటిని అక్కడి నుంచి పోర్టుకు తరలిస్తున్నారు. పవన్ కల్యాణ్ తనిఖీకి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న బియ్యం కల్తీ కలిసిన బియ్యంగా అధికారులు గుర్తించారు. అంతకు ముందు రోజే కాకినాడ కలెక్టర్ తనిఖీ చేసి పట్టుకున్నందున కల్తీ బియ్య మనేది స్పష్టమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నివేల టన్నుల రేషన్ బియ్యం రోజుకు తరలి పోతున్నాయి. ఈ దొంగ వ్యాపారం, దోపిడీ దారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ఎన్ ఓసీ ఇచ్చిన తరువాతనే ఎస్పీఎఫ్ సిబ్బంది బియ్యాన్ని పోర్టులోకి అనుమతిస్తారు. బియ్యం షిప్పింగ్ బిల్లు, ఇన్ వాయిస్, ప్యాకింగ్ వివరాలు, కాంట్రాక్ట్ కాపీ వంటివి పరిశీలించిన తరువాతనే కష్టమ్స్ సిబ్బంది రైస్ ను బార్జిలు, నౌకల్లోకి లోడ్ చేయిస్తారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు సద్దుమనిగేంత వరకు ఎగుమతులు ఆపివేస్తామని ది రైస్ ఎక్స్ పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బివి రావు చెప్పిన 24 గంటల్లోపే బద్వేలు నుంచి వస్తున్న లారీ కృష్ణపట్నం పోర్టు కని చెప్పడం విశేషం. తమ పని పోర్టులో మాత్రమేనని, పోర్టు బయట జరిగే వ్యవహారాలకు తమకు సంబంధం లేదని కస్టమ్స్ కమిషనర్ సాదు నరసింహారెడ్డి చెప్పారు.

Read More
Next Story