అసెంబ్లీలో పవన్ కల్యాణ్ వర్సెస్ బోండా! అసలేం జరిగిందీ?
x

అసెంబ్లీలో పవన్ కల్యాణ్ వర్సెస్ బోండా! అసలేం జరిగిందీ?

పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య ఎవరి మాటా వినడం లేదా?


ఆంధ్రప్రదేశ్ లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఉందా? ఉంటే ఎవరి మాట వింటుందీ? ఈ అంశంపై శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆసక్తికర చర్చ సాగింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ అంశంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అడిగిన ప్రశ్నకు డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుబంధ ప్రశ్న వేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న పీసీబీ అధికారులు ఎవరి మాటా వినడం లేదని, పార్లమెంటు సభ్యుడు అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి ఎందుకో వెనుకాడుతున్నారని, అదేమని ప్రశ్నిస్తే సంబంధిత శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను అడగమని చెబుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్యపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వజమెత్తారు. ‘‘ఏదైనా పనిపై ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే 30, 40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలను చాలా మందిని చూశామని కృష్ణయ్య అంటున్నారు. కానీ, ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యారని గుర్తు పెట్టుకోవాలి. కృష్ణయ్య దగ్గరకు వెళ్తే.. పవన్ కల్యాణ్‌కు చెప్పాలి.. కానీ ఆయన కలవడం లేదని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వాళ్లను సరిదిద్దాలి అని అన్నారు.
దీనిపై పవన్ కల్యాణ్ సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ)లో ఎవరినీ నియమించలేదు. మేము వచ్చాక కృష్ణయ్యను నియమించాం. నేను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో కంటే పరిశ్రమలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుంది. కానీ కృష్ణయ్య చైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. పారిశ్రామిక వేత్తలను భయపెట్టే విధంగా చర్యలు ఉండకూడదు. పర్యావరణాన్ని పరిరక్షించే నిధులు కూడా ప్రభుత్వం వద్ద లేవు. అందరం కలిసి కలెక్టివ్‌గా చేయాల్సిన బాధ్యతలు ఇవి అన్నారు. కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థలతో సంబంధమున్న అంశం. పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులు లేరు. రాంకీ సంస్థకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నాం. వెంటనే చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. కాలుష్య నియంత్రణ బాధ్యత పరిశ్రమలదే కాదు.. ప్రజలు, అధికారులది కూడా. రాంకీపై నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంలా కక్ష సాధింపు అనే ప్రచారం జరిగే ప్రమాదముంది. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం మా ఉద్దేశం కాదు.. కూర్చోబెట్టి సమస్యను చెబుతాం. గతం ప్రభుత్వంలా ఇప్పుడు జరగదు’’ అని అన్నారు.

శాసనసభ్యులు కూడా సమస్యను అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంత అనర్థం జరుగుతుందో ఉదాహరణలతో సహా వివరించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం ఉందని.. క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు.
‘‘ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది. అసెంబ్లీలో కూడా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం అమలు జరగడం లేదు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి. కానీ.. చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నాం. బయోడీగ్రేడబుల్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం. ప్లాస్టిక్‌ నిషేధంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాలి’ అని పవన్‌ అన్నారు.
ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు ఓ సలహా ఇస్తూ కేరళలో ప్లాస్టిక్ మద్యం బాటిళ్లను రీ యూజ్ చేసేందుకు చేస్తున్న కసరత్తును ఉదహరించారు. ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ ద్వారా ఈ ముప్పును కొంతమేర నివారించవచ్చునని చెప్పారు. పవన్ కల్యాణ్ లాంటి ప్రముఖ నటులు ప్లాస్టిక్ యూజ్ పై ప్రకటనలు ఇస్తే ప్రజలు బాగా వంటబట్టించుకుంటారని సూచించారు. దీనికి పవన్ కల్యాణ్ స్పందిస్తూ టీటీడీలో కూడా ఈ విధానం ఉందని చెప్పారు.
ఈ చర్చ సాగుతున్న సమయంలో అధికారుల గ్యాలరీలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్య కూడా ఉన్నారు
Read More
Next Story