Revanth and AlluArjun|రేవంత్-పుష్ప మధ్య నిప్పు రాజుకుందా ?
x

Revanth and AlluArjun|రేవంత్-పుష్ప మధ్య నిప్పు రాజుకుందా ?

ఘటనకు దారితీసిన కారణాలను, తర్వాత పరిణామాలపై సీఎం పాయింట్ బై పాయింట్ వివరించారు. ఘటనకు కారకుడైన అల్లుఅర్జున్ తో పాటు సినిమా సెలబ్రిటీలందరినీ ఓ వరస వాయించుకున్నారు.


అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, మీడియా సమావేశంలో పుష్ప సమాధానంతో ఇద్దరిమధ్యా నిప్పురాజుకుంది. పుష్ప2(Pushpa2 Movie) సినిమా విడుదల సందర్భంగా సంధ్యథియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజా కోమాలోకి వెళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఘటనకు దారితీసిన కారణం, ఘటన తర్వాత జరిగిన డెవలప్మెంట్లపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి(Revanthreddy) సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్(AlluArjun) పై రేవంత్ పెద్దఎత్తున ధ్వజమెత్తారు. ఘటనకు దారితీసిన కారణాలను, తర్వాత పరిణామాలపై సీఎం పాయింట్ బై పాయింట్ వివరించారు. పనిలోపనిగా ఘటనకు కారకుడైన అల్లుఅర్జున్ తో పాటు సినిమా సెలబ్రిటీలందరినీ ఓ వరస వాయించుకున్నారు. బాధితుడిని, బాధిత కుటుంబాన్ని పరామర్శించని సినీసెలబ్రిటీలు ఘటనకు కారకుడైన అల్లుఅర్జున్ను వరసబెట్టి పరామర్శించటంపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. సినీపరిశ్రమలోని పెద్దలకు మానవత్వంలేదని తేల్చేశారు.

అల్లుఅర్జున్ తో పాటు యూనిట్ సినిమా చూడటానికి వస్తారని థియేటర్ యాజమాన్యం లేఖలో పోలీసుల బందోబస్తు కావాలని అడిగితే పోలీసులు తిరస్కరించినట్లు రేవంత్ చెప్పాడు. అయినాసరే అల్లుఅర్జున్ థియేటర్ కు రావటాన్ని రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఘటనకు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లుఅర్జునే కారణమని రేవంత్ గట్టిగా చెప్పాడు. ఘటనలో చనిపోయిన బాధితకుటుంబాన్ని వదిలేసి కారకుడైన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు పరామర్శించటాన్ని రేవంత్ తప్పుపట్టాడు. అల్లు అర్జున్ కు ఏమన్నా కాలు పోయిందా, కన్నుపోయిందా, కిడ్నీపోయిందా ? ఏమైందని పుష్పాను అంతమంది వరసబెట్టి పారమర్శించారని రేవంత్ ఎద్దేవాచేశారు. మానవత్వం లేకుండా వ్యవహరించిన సినీపెద్దలకు ఇకనుండి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతులు ఉండవని రేవంత్ అసెంబ్లీలో చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

రేవంత్ అసెంబ్లీలో అలా ఆరోపణలతో రెచ్చిపోయారో లేదో అదేరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అల్లుఅర్జున్ మీడియా ముందుకొచ్చేశాడు. జరిగిన ఘటన దురదృష్టమంటూనే ఘటనతో తనకు ఏమాత్రం సంబంధంలేదన్నాడు. పోలీసులు అనుమతి ఇస్తేనే తాను థియేటర్ కు వెళ్ళినట్లు చెప్పాడు. థియేటర్ దగ్గరకు వెళ్ళినపుడు పోలీసులే తనకు రోడ్డు ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు పుష్ప చెప్పాడు. తనకోసం పోలీసులు రోడ్డు క్లియర్ చేశారు కాబట్టి తాను థియేటర్ కు రావటానికి పోలీసుల అనుమతి ఉన్నట్లే అని పుష్ప లాజిక్ వినిపించారు. తొక్కిసలాట జరిగిన విషయం తనకు అప్పుడు తెలీదన్నాడు. తొక్కిసలాట జరిగినట్లు, మహిళ చనిపోయినట్లు తనకు తెలిసినా తాను సినిమా చూడకుండా కదిలేదిలేదని పోలీసులతో చెప్పినట్లు చేసిన ఆరోపణలు వాస్తవంకాదన్నారు.

థియేటర్ దగ్గరకు వచ్చేటపుడు, తిరిగి వెళ్ళేటపుడు రోడ్డుషో చేసినట్లు జరుగుతున్న ప్రచారం కూడా అంతా అబద్ధమే అన్నాడు. తన సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటిరోజు తెలిసి షాక్ కు గురైనట్లు అల్లుఅర్జున్ చెప్పాడు. తనమీద ప్రచారం జరుగుతున్నట్లుగా అమానవీయంగా ఉండనని వివరణ ఇచ్చుకున్నాడు. లాయర్ సలహా ప్రకారమే తాను ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న పిల్లాడిని, బాధిత కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్ళలేదంతే అని చెప్పుకున్నాడు. పోలీసులు అనుమతిస్తే ఇఫ్పటికిప్పుడు పరామర్శకు వెళతానని కూడా అన్నాడు. తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి ప్రయత్నం జరుగుతున్నట్లు భగ్గుమన్నాడు. 22 ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని ఒక్కరాత్రిలో పోగొట్టారని వాపోయాడు. దురదృష్టకర సంఘటన కారణంగా తాను పుష్ప2 సినిమా సక్సెస్ ను కూడా ఆస్వాధించలేకపోతున్నట్లు బాధపడుతు బన్నీ చెప్పాడు.

అసెంబ్లీలో రేవంత్, మీడియా సమావేశంలో అల్లుఅర్జున్ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, సమాధానాలు చూసిన తర్వాత ఇద్దరి మధ్య నిప్పు బాగా రాజుకుందని అర్ధమైపోతోంది. ఇద్దరిమధ్య ఈస్ధాయిలో నిప్పు రాజుకోవటానికి కారణం ఏమిటో తెలీటంలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. యూనిట్ తో పాటు తాను సినిమా చూడటానికి థియేటర్ దగ్గరకు వెళ్ళినపుడు పోలీసులే రోడ్డు క్లియర్ చేసినట్లు అల్లుఅర్జున్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. థియేటర్ యాజమాన్యం అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారు. పోలీసులు అనుమతి అడిగింది వాస్తవమే పోలీసులు అనుమతి నిరాకరించిందీ వాస్తవమే. అనుమతి కావాలని అడిగిన రిక్వెస్టు లేఖను థియేటర్ యాజమాన్యం ఘటన జరిగిన రెండోరోజు లీక్ చేసింది. అనుమతి అడిగుతూ థియేటర్ యాజమాన్య పోలీసులకు రాసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మరుసటిరోజు తాము అనుమతి నిరాకరిస్తు థియేటర్ యాజమాన్యానికి రాసిన లేఖను పోలీసులు కూడా లీక్ చేశారు. దాంతో అనుమతి నిరాకరణ లేఖ కూడా వైరల్ అయ్యింది.

అంటే ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే బందోబస్తుకు తాము పోలీసులు రాసిన లేఖ విషయాన్ని మాత్రమే ధియేటర్ యాజమాన్యం అల్లుఅర్జున్ కు చెప్పింది. అనుమతి నిరాకరిస్తు పోలీసులు ఇచ్చిన సమాధానాన్ని దాచిపెట్టినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాంతో ముందుగా అనుకున్నట్లుగా అల్లుఅర్జున్ తన యూనిట్ తో సినిమా చూడటానికి థియేటర్ కు వచ్చేశాడు. థియేటర్ దగ్గరకు అల్లుఅర్జున్ వచ్చేశాడు కాబట్టి లోపలకు వెళ్ళటానికి పోలీసులు రోడ్డు క్లియర్ చేశారంతే. తనకారుకు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారంటే ముందుగా అనుమతి తీసుకున్నట్లు కాదని అర్జున్ గ్రహించాలి. థియేటర్లలో బౌన్సర్లు జనాలపట్ల దురుసుగా ప్రవర్తించారని తొక్కిసలాట జరిగినపుడే బాగా ఆరోపణలొచ్చాయి. కాబట్టి జరిగిన ఘటనలో తనకు సంబంధంలేదని చెప్పి అల్లుఅర్జున్ సింపుల్ గా తప్పించుకోలేడు. అసెంబ్లీలో మాట్లాడేటపుడు రేవంత్ డైరెక్టుగా అల్లుఅర్జున్ పేరుపెట్టి ఆరోపణలు చేస్తే మీడియా సమావేశంలో మాట్లాడిన అల్లుఅర్జున్ ఎక్కడకూడా రేవంత్ పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఏ రంగంలో అయినా అల్టిమేట్ గా రాజకీయానిదే పై చేయని. ఎవరెంత పవర్ ఫుల్ అని అనుకున్నా చివరగా రాజకీయ అధికారంముందు తలొంచక తప్పదని అల్లుఅర్జున్ కు ఇప్పుడు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే రేవంత్ పేరును ప్రస్తావించటానికి అల్లుఅర్జున్ వెనకాడినట్లు అర్ధమవుతోంది. ఇద్దరి మధ్యా నిప్పయితే రాజుకుంది ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.

Read More
Next Story