
బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఈమెచేతిలోనే ఉందా ?
శోభ ఎప్పుడైతే హైదరాబాదు(Hyderabad)కు వస్తారో అదేరోజు లేకపోతే మరుసటిరోజు అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నారు
కొద్దిరోజులుగా తెలంగాణ అధ్యక్షుడి నియామకం విషయం వార్తల్లో నానుతోంది. తెలంగాణ బీజేపీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈయనస్ధానంలో కొత్త నేతకు పార్టీపగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం చాలారోజులుగా సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా తయారైంది అధ్యక్షుడి నియామకం విషయం. కొత్త అధ్యక్షుడిగా ఒకసారి మరో కేంద్రమంత్రి బండిసంజయ్(Bandi Sanjay) పేరు ప్రచారంలోకి వస్తుంది. ఇంకోరోజు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eetala Rajendar) పేరు వార్తల్లో కనబడుతుంది. కాదు..కాదు వీళ్ళిద్దరు కాదు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్విందే(Dharmapuri Arvind) అధ్యక్షుడు అనే ప్రచారం కూడా అందరికీ తెలిసిందే. పదిరోజుల్లో అధ్యక్షుడి ప్రకటన, వారంలోపు అధ్యక్షుడి నియామకం, రెండురోజుల్లో అధ్యక్షుడిని ప్రకటించబోతున్న జాతీయ నాయకత్వం అని మీడియా, సోషల్ మీడియా ప్రచారం ఊదరగొట్టేస్తోంది.
ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేస్తే పార్టీలోని ఒక సీనియర్ నేత చెప్పింది ఏమిటంటే తెలంగాణ అధ్యక్షుడి ప్రకటన కేంద్రమంత్రి శోభాకరంద్లాజే(Shobha Karamdlaje) చేతిలో ఉందని. శోభ ఎప్పుడైతే హైదరాబాదు(Hyderabad)కు వస్తారో అదేరోజు లేకపోతే మరుసటిరోజు అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నారు. అధ్యక్షుడి ప్రకటనకు శోభ హైదరాబాదుకు రావటానికి ఏమిటి సంబంధం ? ఏమిటంటే బీజేపీ తెలంగాణ ఎన్నికల అధికారి శోభేనట. తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడి నియామకం శోభచేతిలో ఉందని ఆ సీనియర్ నేతచెప్పారు. అధ్యక్షుడిని సింపుల్ గా అలా ప్రకటన చేసేందుకు లేదు. ఎందుకంటే అధ్యక్షుడి ప్రకటన ఎన్నికద్వారా మాత్రమే ఫైనల్ చేయాలి. ఈమధ్యనే కేరళ అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖర్ నియామకం కూడా ఎన్నికపద్దతిలోనే జరిగింది.
ఇక్కడ ఎన్నికంటే అధ్యక్షపదవిమీద కన్నేసిన నేతలంతా నామినేషన్ల వేసిన తర్వాత ఓటింగ్ జరిపేయరు. ఆశావహులందరినీ కూర్చోబెట్టి అందరికి జాతీయ నాయకత్వం ఆలోచన వివరించి వాళ్ళు ఛాయిస్ పేరు వినిపిస్తారు. జాతీయ నాయకత్వం అంటే ఇక్కడ నరేంద్రమోడీ(Narendra Modi) అని మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం పార్టీలో మోడీ కత్తికి ఎదురన్నదే లేకుండా ఉంది. కాబట్టి మోడీ ఎవరిపేరు చెబితే వాళ్ళే అధ్యక్షుడు. కాబట్టి శోభ హైదరాబాదుకు వచ్చి సీనియర్లతో భేటీ అవుతారు. ఆ భేటీలో జాతీయనాయకత్వం మనసులోని నేత పేరును బయటపెడతారు. అప్పుడు జాతీయ నాయకత్వం చెప్పిన నేత మినహా మిగిలిన వారంతా పోటీనుండి బ్యాక్ స్టెప్ వేయకతప్పదు. అప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అధ్యక్ష ఎన్నికలకు పార్టీ నామినేషన్ ఫామ్ లను అందుబాటులో ఉంచుతుంది. పోటీపడదలచుకున్న వారంతా నామినేషన్లు ఫిలప్ చేసి ఎన్నికల అధికారికి ఇవ్వాల్సుంటుంది. అదేరోజు సాయంత్రం ఎన్ని నామినేషన్లు వచ్చాయో చూసుకున్న ఎన్నికల ఆఫీసర్ జాతీయ నాయకత్వంతో మాట్లాడి ఏమిచేయాలో డిసైడ్ చేస్తారు.
ఇపుడు విషయం ఏమిటంటే శోభా కరంద్లాజే ఎన్నికల అధికారి కాబట్టి ఆమె ఎప్పుడు హైదరాబాదుకు వస్తే అప్పుడే అధ్యక్షపదవికి ఎన్నిక జరుగుతుంది. అధ్యక్షుడిగా ఎవరుండాలనే విషయంలో జాతీయ నాయకత్వం మనసులోని మాట తెలిసిన తర్వాత పోటీకి ఎవరు నామినేషన్ల వేస్తారు ? కాబట్టి జాతీయ నాయకత్వం సూచించిన నేత మాత్రమే నామినేషన్ వేస్తారని అందరు అర్ధంచేసుకోవాలి. సాయంత్రానికి నామినేషన్ల గడువు ముగిసేసమయానికి పోటీగా నామినేషన్లు ఎవరూ వేయకపోతే నామినేషన్ దాఖలుచేసిన నేత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శోభ ప్రకటిస్తారు.
అంటే సదరు సీనియర్ నేత చెప్పిన ప్రకారం అధ్యక్షుడి నియామకం విషయంలో మీడియా లేదా సోషల్ మీడియా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరంలేదు. శోభ హైదరాబాదుకు ఎప్పుడు వస్తే అప్పుడే కొత్త అధ్యక్షుడి నియామకం ప్రకటన ఉంటుందన్నది గుడ్డిగుర్తు. ఇక అధ్యక్షుడిగా ఎవరుంటారని అంటే బండి సంజయ్ కే మళ్ళీ అవకాశం ఉంటుందన్నది పార్టీవర్గాల సమాచారం. ఎందుకంటే బండి గతంలో అధ్యక్షుడిగా చేసినపుడు పార్టీలో మంచిఊపు తెచ్చారని నాయకత్వం గుర్తించింది. భాగ్యలక్ష్మీ అమ్మవారనో, ఓల్డ్ సిటీ పేరుతోనో, ఎంఐఎం నేతలపైనో లేకపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్ గురించో ఏదో ఒకటి మాట్లాడుతు, చంపుతాం, నరుకుతాం అనో లేకపోతే ప్రమాణాలంటు నానా రచ్చచేశారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలన్నారు, బస్సుయాత్రలని బాగా హడావుడి చేశారు.
బండి మాటల్లో స్పష్టత లేకపోయినా, ఆరోపణలు, విమర్శల్లో లాజిక్ లేకపోయినా సరే నేతలు, కార్యకర్తల్లో జోష్ తీసుకురావటంలో మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాంటి బండిని ఎన్నికలకు ముందు జాతీయ నాయకత్వం పక్కనపెట్టి కిషన్(Kishan) చేతికి ఎందుకు పగ్గాలు అప్పగించిందో ఎవరికీ తెలీదు. బహుశా అప్పట్లో ఏదో ఒత్తిళ్ళకు లోనై తప్పుచేశామని ఇపుడు తీరిగ్గా చింతిస్తోందోమో తెలీదు. అందుకనే చేసిన తప్పు సరిదిద్దుకోవటంలో భాగంగానే పార్టీపగ్గాలు మళ్ళీ బండికే అప్పగిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. రేసులో ఉన్నారని ప్రచారంలో ఉన్న ఈటల మీద పార్టీ సీనియర్లలో మెజారిటి బాగా వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. సరే, అధ్యక్షుడిగా ఎవరుంటారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే శోభ హైదరాబాదుకు ఎప్పుడు వస్తే అప్పుడే అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నది ఫైనల్.