రాజ్ పాకాల విషయంలో పోలీసులది ఓవర్ యాక్షనేనా ?
x

రాజ్ పాకాల విషయంలో పోలీసులది ఓవర్ యాక్షనేనా ?

రాజ్ పాకాల(Raj Pakala) అంటే చాలామందికి తెలియకపోవచ్చు కాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) బావమరిది అంటే విషయం అర్ధమైపోతుంది.


రాజ్ పాకాల విషయంలో పోలీసులది ఓవర్ యాక్షనేనా ? ఇపుడీ ప్రశ్న తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. రాజ్ పాకాల(Raj Pakala) అంటే చాలామందికి తెలియకపోవచ్చు కాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) బావమరిది అంటే అందరికీ సులభంగా విషయం అర్ధమైపోతుంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే జన్వాడ ఫాంహౌస్ లో నాలుగురోజుల క్రితం రాజ్ పాకాల అర్ధరాత్రి పార్టీ ఇస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇలాంటి సమాచారం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా వెంటనే పోలీసులు(Police)లు, ఎక్సైజ్ పోలీసులు కలిసి ఫాంహౌస్ మీద దాడిచేశారు. పోలీసులు దాడిచేసినపుడు పార్టీలో ఆడ, మగ కలిపి సుమారుగా 40 మంది ఉన్నారు. పార్టీ జరుగుతున్న హాలు, గదులన్నింటినీ పోలీసులు తనిఖీలు చేశారు. అయితే అక్కడ విదేశీమద్యం(Foreign Liquor), గేమింట్ యూనిట్లు తప్ప ఇంకేమీ దొరకలేదని సమాచారం.

పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పోలీసులు చెక్ చేశారు. ఎవరి దగ్గరా ఎలాంటి అనుమానాస్పదమైన విషయాలు బయటపడలేదు. అయితే రాజ్ పాకాల మిత్రుడు విజయ్ మద్దూరి(Vijay Madduri) వ్యవహారం మాత్రం అనుమానంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. తర్వాత బ్లడ్ శాంపుల్ టెస్టు చేయిస్తే నార్కొటిక్స్(Narcotics) తీసుకున్నట్లు బయటపడింది. దాంతో మద్దూరిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే విధంగా రాజ్ పాకాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవాలని అనుకున్నా అప్పటికే ఆయన మాయమైపోయాడు. దాంతో రాజ్ కోసం వెతికన పోలీసులు కోర్టుకు విషయాన్ని చెప్పారు. ఇదే సమయంలో అరెస్టు చేయకుండా కోర్టులో రాజ్ కూడా పిటీషన్ వేశాడు. కోర్టు విచారణ జరిపిన తర్వాత 48 గంటల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారమే రాజ్ పోలీసులకు లొంగిపోయాడు.

విచారణలో పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు రాజ్ గట్టిగానే సమాధానం ఇచ్చాడని సమాచారం. విజయ్ మద్దూరి నార్కొటిక్స్ తీసుకున్న విషయాన్ని అడిగినపుడు ఆ విషయం తనకు తెలీదని రాజ్ చెప్పాడు. విజయ్ ఎక్కడో డ్రగ్ తీసుకుని తన పార్టీకి హాజరైతే అది తన బాధ్యత ఎలాగవుతుందని గట్టిగానే పోలీసులను తగులుకున్నట్లు తెలిసింది. రాజ్ ఎదురు ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. తనింట్లో ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే తాను సమాధానం చెబుతాను కాని ఎక్కడో డ్రగ్స్ తీసుకుని తనింట్లో పార్టీకి హాజరయ్యే వాళ్ళ విషయంలో తానేమీ చెప్పలేనని రాజ్ గట్టిగానే చెప్పాడు. దాంతో రాజ్ ను ప్రశ్నించి లాభంలేదని అర్ధమైన పోలీసులు వెంటనే ఆయన ఇంటిమీద దాడిచేశారు. ఇంట్లో ఎంత వెతికినా పోలీసులకు ఏమీ దొరకలేదని సమాచారం. దాంతో ఏమిచేయాలో అర్ధంకాని పోలీసులు ఫోన్ ఇవ్వమని అడగగానే రాజ్ ఇచ్చేశాడు. దాన్ని పూర్తిగా చెక్ చేసిన పోలీసులు తిరిగి మొబైల్ ఇచ్చేశారు.

ఓవర్ యాక్షన్ ఎక్కడ జరిగింది ?

డబ్బులున్న వాళ్ళు తమిళ్ళల్లో లిక్కర్ పార్టీ చేసుకోవటం చాలా మామూలైపోయింది. ఇలాంటి పార్టీలకు ఆడ, మగ తేడా లేకుండా అందరు హాజరవుతున్నారు. డ్రింక్ చేయటం చాలామందికి ఇపుడు సోషల్ స్టేటస్ అయిపోయింది. ఇళ్ళు, ఫాంహౌసులు ఎక్కడపడితే అక్కడ పార్టీలు చేసుకుంటున్నారు. చాలా చోట్ల డ్రింక్స్ తో పాటు డ్రగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ విషయం ఏమిటంటే రాజ్ పాకాల డ్రగ్స్ తీసుకుంటాడో లేదో తెలీదుకాని పోలీసులు దాడిచేసిన రోజు మాత్రం డ్రింక్స్ తప్ప పార్టీలో ఎవరి దగ్గరా డ్రగ్స్ దొరకలేదు. ఫాంహౌసులోనే కాకుండా ఇంట్లో కూడా డ్రగ్స్ దొరకలేదు. దీన్నిబట్టి చూస్తే పోలీసుల దాడులను ముందే రాజ్ ఊహించి దొరక్కుండా జాగ్రత్తపడ్డాడా ? లేకపోతే అసలు డ్రగ్స్ అలవాటే లేదా అన్నది తెలీదు. పార్టీలో డ్రగ్స్ కూడా ఉంటాయని అనుమానించి భారీ సంఖ్యలో దాడులు చేసిన పోలీసులకు మాత్రం పెద్ద నిరాశే ఎదురయ్యింది.

పోలీసులు అక్కడితో ఆగకుండా డ్రగ్స్ తీసుకున్న విజయ్ గురించి రాజ్ ను ప్రశ్నించటమే ఓవర్ యాక్షన్ లాగ అయిపోయింది. అందుకనే విజయ్ డ్రగ్స్ తీసుకుంటే తనకేమి సంబంధం అని రాజ్ ఎదురు తిరగటంతో పోలీసులకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాలేదు. ఏదేదో ఊహించేసుకుని దాడులుచేసిన పోలీసులు చివరకు ఫాంహౌసులో చిన్న ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు. పదిరోజుల క్రితం దక్షిణకొరియా పర్యటనలో మంత్రి పొంగులేటి మాట్లాడుతు తొందరలోనే బాంబులు పేలబోతున్నాయని చేసిన ప్రకటనకు రాజ్ పాకాల ఫాంహౌస్ పైన పోలీసులు దాడిచేయటాన్ని చాలామంది లింకు పెట్టారు. ఇంకేముంది కేటీఆర్ బావమరిది డ్రగ్స్ తో పోలీసులకు దొరికిపోయాడని కాంగ్రెస్ నేతలు నానా రచ్చచేశారు. తీరాచూస్తే పోలీసుల దాడులు పేలని దీపావళి టపాకాయలాగ అయిపోయింది. దాంతో చేసేదిలేక రాజ్ పాకాలను విడిచిపెట్టి విజయ్ మద్దూరి డ్రగ్స్ ఎవరిదగ్గర కొన్నాడు ? ఎంతకాలంగా వాడుతున్నాడు ? అమ్మింది ఎవరు ? అనే విషయాలను విచారిస్తున్నారు.

Read More
Next Story