పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ తప్పుదోవ పడుతోందా?
x

పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ తప్పుదోవ పడుతోందా?

కొందరి కుట్రకు బలైన డాక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ కుటుంబం కేసు అడుగు ముందుకు పడటం లేదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ తప్పుదోవ పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి


విజయవాడలో శ్రీజ హాస్పిటల్‌ యజమాని డాక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ కుటుంబం కొందరు వ్యక్తుల కారణంగా బలైంది. దీనిపై కేసు నమోదైంది. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ శ్రీనివాస్‌ కొందరు ఆదిపత్య కులానికి చెందిన వారు మోసం చేసినందునే ఈ స్థితికి వచ్చారనే కోణంలో పోలీస్‌ దర్యాప్తు సాగటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకుని దర్జాగా కుర్చీల్లో కూర్చున్నారనేది ఆరోపణ. వారు ఎంత డబ్బు ఇచ్చారు? ఏ విధమైన షరతులతో ఇచ్చారు? అప్పుగా ఇచ్చిన డబ్బలు సకాలంలో చెల్లించలేదనే దాంట్లో నిజం ఎంత? ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకుని ఆస్పత్రి పెట్టిన వైద్యుడిని బికారిని చేశారంటే అప్పు ఇచ్చిన వారు, తీసుకున్న డాక్టర్‌ మధ్య ఏ విధమైన సంభాషణ జరిగింది అనే కోణంలో దర్యాప్తు సాగటం లేదనే విమర్శలు పోలీసులను చుట్టుముడుతున్నాయి.

ఆస్పత్రిని రాయించుకున్న వారి బ్యాగ్రవుండ్‌ ఏమిటి?
వైద్యుని కుటుంబం బలై ఐదు రోజులైంది. ఇచ్చిన అప్పులు తీర్చనందునే తాము ఆస్పత్రిలో 90 శాతం వాటా తీసుకున్నామని చెబుతున్న వ్యక్తుల క్యారెక్టర్‌ ఏమిటి? వారు ఏయే ఆస్పత్రుల్లో ఏ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత మంది వైద్యులకు ఇలా అప్పులు ఇచ్చారు. బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించారు. అనేకోణంలో దర్యాప్తు ఇంతవరకు ముందుకు సాగలేదనేది మృతుని బంధువుల ఆరోపణ. డాక్టర్‌ శ్రీనివాస్‌ సోదరుడు హైదరాబాద్‌లో ఉండటం, ఇంటి వద్ద ఉండే వారంతా పట్టణ వాతావరణంపై పెద్దగా అవగాహన లేని వారు కావడంతో ఈ కేసు నీరుగారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని శ్రీనివాస్‌ స్నేహితులు చెబుతున్నారు.
కులం కోణాన్ని టచ్‌ చేయని పోలీసులు
ఆదిపత్య కులం పెట్టిన ఇబ్బందుల వల్లే కుటుంబం బలైందనే కోణంలో పోలీసులు కేసును టచ్‌ కూడా చేయలేదు. చనిపోయింది ఎస్టీ కులానికి చెందిన వాడు. ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్న వారు ఆదిపత్య కులానికి చెందిన వారు. పైగా వారు వేరే ఆస్పత్రులు నడుపుతున్న వారు. ఈ కోణంలో ఎందుకు పోలీసులు అడుగులు వేయటం లేదనే విమర్శ కూడా ఉంది. విజయవాడలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారు ఆస్పత్రులు పెట్టి పెద్దగా సక్సెస్‌ అయిన వారు లేరు. శ్రీనివాస్‌ నాయక్‌ ధైర్యం చేసి ఆస్పత్రిని పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని ఆదిపత్య కులానికి చెందిన వారు కొందరు పధకం ప్రకారం డాక్టర్‌ను దెబ్బతీసి ఆస్పత్రిని వారికి రాసి ఇచ్చేలా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా విచారణ ముందుకు సాగటం లేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
చర్చ జరగకుండానే ఆస్పత్రి రాసి ఇస్తాడా..
అప్పులు ఇచ్చిన వారు అడగ్గానే ఆస్పత్రిని వారికి ఏ డాక్టరైనా దారాదత్తం చేస్తాడా? ఎటువంటి చర్చ జరిగింది? ఫోన్‌లలో ఏ విధంగా మాట్లాడుకున్నారు. రాసి ఇచ్చే ముందుకు డాక్టర్‌ శ్రీనివాస్‌ ఏమి చెప్పాడు. మాకు ఆస్పత్రి రాసి ఇచ్చి మావద్దనే డాక్టర్‌గా జీతానికి పనిచేయాలని వారు శ్రీనివాస్‌పై ఎందుకు వత్తిడి తెచ్చారు. మూడు నెలలుగా శ్రీనివాస్‌ ఆస్పత్రికి వెళ్లకుంటే ఇంటికి వచ్చి తప్పకుండా ఆస్పత్రికి రావాలని ఎందుకు పిలిచారు? వంటి అంశాలపై పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేదనేది పెద్ద చర్చగా మారింది.
విచారించిన వాళ్లను వేళ్లపై లెక్కించాల్సిందే..
ఇప్పటి వరకు ఈ కేసులో ఎంత మందిని విచారించారంటే వేళ్లమీద లెక్క పెట్టాల్సిందే. శుక్రవారం బ్యాంకు స్టేట్‌మెంట్స్‌ పోలీసులు తీసుకున్నట్లు సమాచారం. అప్పులకు సంబంధించి బ్యాంకు స్టేట్‌ మెంట్‌ తీసుకోడానికి ఎంత సమయం కావాలనే అంశంపైనా చర్చ జరుగుతోంది. కావాలనే పోలీసులు కేసును నీరు గారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫోన్‌ ద్వారా జరిగిన సంభాషణ ఏమిటనే కోణంలో దర్యాప్తు జరిగితే ఏదైనా క్లూ వచ్చే అవకాశం ఉందనేది బంధుల వాదన. తన స్నేహితుల వాట్సాప్‌ గ్రూపులు, డాక్టర్స్‌ ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపుల్లో నుంచి ఎగ్జిట్‌ అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. పోన్‌ కాల్స్‌ లిస్ట్‌ తీసుకున్నామని, ఆయన స్నేహితుల్లో ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడుతున్నామని చెబుతున్నారు. కానీ కేసులో ఇప్పటి వరకు పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎవరు అడిగినా పోలీసులు చెబుతున్నది ఒక్కటే మాట. ఆర్థిక బాధలు భరించలేక కుటుంబ సభ్యులను చంపి ఆత్మ హత్యకు పాల్పడ్డారని అంటున్నారు. అందుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసుల దర్యాప్తు సాగటం లేదనే విమర్శలు ఉన్నాయి.
అనుమానితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి
విజయవాడలో ఆదిపత్య కులం వారు తోటి వైద్యులను బతకనివ్వడం లేదు. ప్లాన్‌ ప్రకారం వారి ఆస్తులు కొల్లగొట్టి ఒంటరిని చేసి వారంతకు వారు బలయ్యేలా చేస్తున్నారు. వైద్యాన్ని వ్యాపారం చేశారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వైద్యుడు శ్రీనివాస్‌ నాయక్‌ కుటుంబం బలవడంపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే కాని నిజాలు బయటకు రావు. తూతూ మంత్రంగా పోలీసు దర్యాప్తు ఉంటే దోషులు ఎప్పటికీ దొరకరు.
Read More
Next Story