ప్రభుత్వం మీద అప్పుడే ‘బొమ్మ’ పడిందా ?
x

ప్రభుత్వం మీద అప్పుడే ‘బొమ్మ’ పడిందా ?

ఆయన చూపించిన పవర్ ఏమిటంటే ప్రతి వారం ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా గాంధీభవన్ కు రావాల్సిందేనని.


తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాలుగు రోజుల్లోనే బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ తన పవర్ ఏమిటో చూపించారు. ఇంతకీ ఆయన చూపించిన పవర్ ఏమిటంటే ప్రతి వారం ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా గాంధీభవన్ కు రావాల్సిందేనని. అలాగే నెలకొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గాంధీభవన్ కు రావాల్సిందే. మంత్రులు గాంధీభవన్ కు వచ్చేట్లుగా బొమ్మా ముఖ్యమంత్రి మాట్లాడించి ఒప్పించారు. పనిలోపనిగా నెలకొకసారి గాంధీభవన్ కు రేవంత్ వచ్చేట్లుగా కూడా ఒప్పించారు. దీంతోనే బొమ్మ తన పవర్ ఏమిటో చూపించినట్లయ్యింది. నిజానికి మంత్రులు తప్పనిసరిగా పార్టీ ఆఫీసు గాంధీభవన్ కు రావాలి. కాని ఆచరణలో ఇది సాధ్యంకాదు.

ఎంఎల్ఏలుగా ఉన్నపుడు రెగ్యులర్ గా గాందీభవన్ కు వచ్చే నేతలు మంత్రులవగానే మాత్రం పార్టీ ఆఫీసుకు రావటంలేదు. అదేమిటంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు, రాష్ట్రంలో పర్యటనలతో బిజీగా ఉన్నామని చెబుతారు. అయితే తాజాగా బొమ్మ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. రేవంత్ తో జరిగిన భేటీలో మంత్రులు పార్టీ ఆఫీసుకు రావాల్సిన అవసరం, పార్టీ క్యాడర్ను కలవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దాంతో రేవంత్ కూడా బొమ్మ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి మంత్రులందరినీ గాంధీభవన్ కు వెళ్ళేలా ఆదేశించారు. సచివాలయంలో జనాలను, పార్టీ జనాలను మంత్రులు కలుస్తునే ఉంటారు. సచివాలయంలో పార్టీ నేతలు కలవటం కష్టం కాకపోయినా మిగిలిన సందర్శకులతో పాటు వెయిట్ చేయాల్సిందే.

అదే మంత్రులు రెగ్యులర్ గా పార్టీ ఆఫీసుకు వస్తే నేతలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. పైగా మంత్రులను కలవటానికి మామూలు జనాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి గాంధీభవన్లో మంత్రులు స్పెండ్ చేసినంత సమయం పూర్తిగా పార్టీ నేతలతోనే ఉండచ్చు. పార్టీ నేతలు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను, వ్యక్తిగత అవసరాలను మంత్రులతో చెప్పుకుని వాటిని పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి విషయాలన్నింటినీ రేవంత్ తో బొమ్మ చెప్పి సానుకూలత సాధించటమే గొప్ప విజయంగా భావించాలి. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్ లో మూడు గంటలసేపు హాజరవ్వాల్సిందే అని రేవంత్ ఆదేశించారు. ఏ మంత్రి ఏ రోజు పార్టీ ఆఫీసుకు వెళ్ళాలో కూడా టైంటేబుల్ ఇచ్చేశారు. దాని ప్రకారమే గురువారం రెవిన్యు శాఖ మంత్రి పెంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పార్టీ ఆఫీసులో ఉండాలి. అయితే శుక్రవారం క్యాబినెట్ సమావేశం కారణంగా వీళ్ళు గురువారం బిజీగా ఉండటంతో గాందీభవన్ కు రాలేకపోయారు. మరి రాబోయే గురు, శుక్రవారాల్లో హాజరవ్వబోయే మంత్రులు ఎవరో చూడాల్సిందే.

మంత్రులు రెగ్యులర్ గా రేవంత్ ను కూడా గాంధీభవన్ కు నెలలో ఒకరోజు వచ్చేట్లు బొమ్మ ఒప్పించటం గొప్ప విషయమే. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో చాలామంది సచివాలయంకు మాత్రమే పరిమితమయ్యేవారు. ఎప్పుడైనా అవసరమైనపుడు మాత్రమే గాంధీభవన్లో కనబడేవారు. అదే రెగ్యులర్ గా నెలకు ఒకసారైనా పార్టీ ఆఫీసుకు ముఖ్యమంత్రి వస్తే తప్పనిసరిగా మంత్రులు కూడా వస్తారు. అప్పుడు పార్టీ నేతలు ముఖ్యమంత్రిని నేరుగా కలిసి కావాల్సినంత సేపు భేటీ అయి పార్టీతో పాటు వ్యక్తిగత, నియోజకవర్గాల సమస్యలను చెప్పుకుని పరిష్కరించుకునేందుకు అవకాశాలుంటాయి. బొమ్మ ప్లాన్ గనుక అనుకున్నది అనుకున్నట్లు సక్సెస్ అయితే మంత్రులు, సీఎంను గాంధీభవన్ కు రప్పించిన మొదటి పీసీసీ అధ్యక్షుడిగా నిలిచిపోవటం ఖాయం.

Read More
Next Story