TDP|టీడీపీలోకి తీగల..ముహూర్తం ఆరోజేనా ?
ఆ సమయంలో పార్టీఆఫీసులోనే చంద్రబాబు సమక్షంలో తీగల మళ్ళీ తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
తెలంగాణాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన. అయితే అందుకు పరిస్ధితులు పూర్తిగా అనుకూలంగా లేవు. ఏపీలో అధికారంలో ఉందన్నమాటే కాని తెలంగాణాలో పార్టీ వ్యవస్ధ దాదాపు దెబ్బ తినేసింది. మళ్ళీ మొదటినుండి పార్టీని పైకి లేపాలంటే ఇప్పట్లో సాధ్యంకాదు. పార్టీకి మద్దతుదారులున్నారు, సానుభూతిపరులున్నారు, సోషల్ మీడియా బలంగా ఉంది. అయితే నియోజకవర్గాల్లో గట్టినేతలే కరువయ్యారు. అందుకనే చంద్రబాబు ఒక మార్గం కనిపెట్టారు. అదేమిటంటే ఒకవైపు పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని చేయిస్తునే మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపటం. ఇందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణాలోని కొందరు మాజీమంత్రులు, ఎంఎల్ఏలు చంద్రబాబు(Chandrababu)తో భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలోనే జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మహేశ్వరం మాజీ ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి టీడీపీ(TDP)లో చేరబోతున్నట్లు సమాచారం. డిసెంబర్(December 3rd) 3వ తేదీన చంద్రబాబు హైదరాబాదు(Hyderqabad)కు రాబోతున్నారు. ఆ సమయంలో పార్టీఆఫీసులోనే చంద్రబాబు సమక్షంలో తీగల మళ్ళీ తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
మళ్ళీ టీడీపీలో చేరబోతున్నారని ఎందుకు అన్నదంటే 2014కి ముందు తీగల సైకిల్ పార్టీలోని రాజధాని ప్రాంత ముఖ్యనేతల్లో ఒక్కళ్ళు. పార్టీలో ఒకపుడు తీగల బాగానే వెలిగారు. తెలంగాణా ఉద్యమం, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు నేపధ్యంలో పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్(BRS) లో చేరారు. అక్కడ పడకపోవటంతో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరారు. అయితే హస్తంపార్టీలో ఆశించిన గుర్తింపు దక్కకపోవటంతో చాలాకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. మహేశ్వరం జడ్పీటీసీగా తర్వాత జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన తీగల కోడలు అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం ఉన్నా ఎలాంటి ఉపయోగం ఉండదని తీగలకు అర్ధమైపోయినట్లుంది. ఏమీచేయాలో తేల్చుకోలేని సమయంలోనే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
ఏపీలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వెంటనే చంద్రబాబు చూపు తెలంగాణా(Telangana TDP)లో పార్టీని బలోపేతంచేయటంపైన పడింది. దాంతో తీగలకు మంచి మార్గం దొరికినట్లయ్యింది. తీగలే కాకుండా ఇంకా కొందరు మాజీ తమ్ముళ్ళు టీడీపీవైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇపుడు బీఆర్ఎస్ లో ఉన్న సీనియర్లు తలసాని(Talasani) శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, ఎల్ రమణ లాంటి చాలామంది టీడీపీలో నుండి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి మాజీ తమ్ముళ్ళు ఘర్ వాపసీ..ఆపరేషన్ ఆకర్ష్..లాంటివాటి గురించి ఆలోచించాలని చంద్రబాబు బహిరంగంగా పిలుపిచ్చారు. తర్వాత ఒకసారి హైదరాబాదుకు వచ్చిన చంద్రబాబుతో చేమకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి(Arekapudi Gandhi) గాంధీ, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు విడివిడిగా కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళ భేటీలో ఏమి మాట్లాడుకున్నారన్న విషయాలు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహగానాలే.
అయితే తొందరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లు అప్పట్లోనే తీగల స్వయంగా మీడియాతో చెప్పారు. దానికి కంటిన్యుయేషన్ గానే డిసెంబర్ 3వ తేదీన టీడీపీలో చేరాలని ముహూర్తం పెట్టుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. తీగల పార్టీలో చేరిన తర్వాత పార్టీ పగ్గాలు కూడా అప్పగించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీపగ్గాలను గనుక తీగలకు అప్పగిస్తే మంచి ఊపువస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే తీగలకు అన్నీ జిల్లాల్లోని మాజీ తమ్ముళ్ళతో మంచి సంబంధాలున్నాయి. తనకున్న సంబంధాలతో మాజీ తమ్ముళ్ళను తీగల తిరిగి టీడీపీలోకి రప్పించగలరు అని అంచనా వేస్తున్నారు.
ఇపుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఉన్న చాలామంది సీనియర్ల మూలాలు టీడీపీలోనివే. రేవంత్ రెడ్డి(Revanth)తో సహా తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, వేం నరేందరరెడ్డి లాంటి చాలామంది ప్రముఖులు టీడీపీలో నుండి కాంగ్రెస్ లోకి వచ్చినవారే. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉందికాబట్టి ఇక్కడ నుండి టీడీపీలో చేరేవాళ్ళు పెద్దగా ఉండకపోవచ్చు. అందుకనే బీఆర్ఎస్ మీదే ఎక్కువ దృష్టిపెట్టినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎలాగూ ప్రతిపక్షంలోనే ఉంది, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను ఆపరేషన్ ఆకర్ష్ పథకంలో భాగంగా రేవంత్ లాగేసుకుంటున్నాడు. కాబట్టి పార్టీ బలహీనపడుతోంది. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లోకి మాజీలు టీడీపీలోకి వస్తారనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు తొలిమెట్టుగా తీగల చేరికతో శ్రీకారం చుడుతున్నట్లున్నారు. మరి డిసెంబర్ 3వ తేదీ ఏమి జరగబోతోందన్న విషయం ఆసక్తిగా మారుతోంది.