Evidence against KTR|కేటీఆర్ కేసులో నాలుగుపాయింట్లే కీలకమా ?
x

Evidence against KTR|కేటీఆర్ కేసులో నాలుగుపాయింట్లే కీలకమా ?

రేసు పేరుతో బదిలీ అయిన నిధుల విషయంలో మాత్రం నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం జరిగిందని స్పష్టంగా అర్ధమైపోతోంది.


రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎగతాళిచేస్తు, ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను చాలా తక్కువచేసిన ‘లొట్టిపీసుకేసు’ కేటీఆర్ మెడకు చుట్టుకునేట్లుంది. ఫార్ములా కార్ రేసు(Formula E car case) కేసులో అవినీతి జరిగిందో లేదో ఇప్పటికైతే తెలియలేదు. కాని రేసు పేరుతో బదిలీ అయిన నిధుల విషయంలో మాత్రం నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం జరిగిందని స్పష్టంగా అర్ధమైపోతోంది. సుప్రింకోర్టులో వేసిన క్వాష్ పిటీషన్ను కొట్టేయటంతో వేరేదారిలేక కేటీఆర్(KTR) గురువారం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED Inquiry) విచారణకు హాజరయ్యారు. బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి కేటీఆర్ 10.50 గంటలకు విచారణకు చేరుకున్నారు. విచారణ ఎంతసేపు జరుగుతుందో చూడాలి. ఎందుకంటే నాలుగురోజుల క్రితం ఏసీబీ విచారణ(ACB Inquiry) 6 గంటలు జరిగిన విషయం తెలిసిందే.

ఇక అసలు విషయానికివస్తే ఫార్ములా కారు కేసుకు సంబంధించి నిధుల బదిలీలో నియమాలు పాటించలేదని, నిబంధనల ఉల్లంఘన జరిగిన విషయం ఇప్పటికే దర్యాప్తుసంస్ధలు ఏసీబీ, ఈడీలు గుర్తించాయి. కేటీఆర్ దాఖలుచేసిన క్వాష్ పిటీషన్లో నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వనియోగం జరిగింది అనేందుకు ఏసీబీ చూపించిన ఆధారాలతో హైకోర్టు కూడా ఏకీభవించింది. అందుకనే ఏసీబీ నమోదుచేసిన కేసును కొట్టేయాలని కేటీఆర్ దాఖలుచేసిన క్వాష్ పిటీషన్నే కోర్టు కొట్టేసింది. కేసువిచారణ సందర్భంగా నిధుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన జరిగింది అనేందుకు ఆధారాలున్నాయి కాబట్టే కేటీఆర్ వేసిన క్వాష్ పిటీషన్ను డిస్మిస్ చేసినట్లు హైకోర్టు(Telangana High court) స్పష్టంగా ప్రకటించింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ కూడా కేటీఆర్ తో పాటు సహనిందితులు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిపైన మనీల్యాండరింగ్(Money Laundering), ఫెమా(ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా)(FEMA) చట్టాలకింద కేసులునమోదుచేసి విచారిస్తోంది. ఇపుడు కేటీఆర్ ను మనీల్యాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన పైనే విచారిస్తోంది.

నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి ఏసీబీ చూపించిన సాక్ష్యాలు ఏమిటంటే బ్రిటన్లోని ఎఫ్ఈవో ( Britain )FEO) కంపెనీకి రు. 45 కోట్ల చెల్లింపులో హెచ్ఎండీఏ ఆర్ధికశాఖ, క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు. ఫార్ములా కేసుతో ఎలాంటి సంబంధంలేని హెచ్ఎండీఏ(HMDA) నుండి 45 కోట్లరూపాయలు చెల్లించటమే విచిత్రం. ఫార్ములా కార్ రేసు మొత్తంలో హెచ్ఎండీఏ ఏవిధంగా కూడా భాగస్వామికాదు. అయినా హెచ్ఎండీఏ నుండి కోట్లాది రూపాయల చెల్లింపులు జరిగిపోయాయి. బ్రిటన్ కంపెనీకి చెల్లింపులు చేసేముందు ఆర్ధికశాఖ నుండి అనుమతి తీసుకోలేదు. అలాగే చెల్లింపులకు క్యాబినెట్ ఆమోదం కూడా లేదు. అంటే ఇక్కడే మూడు ఉల్లంఘనలు కనబడుతున్నాయి.

1. సంబంధంలేని హెచ్ఎండీఏ ఖాతా నుండి రు. 45 కోట్లు చెల్లించటం.

2. ఆర్ధికశాఖ అనుమతి తీసుకోకపోవటం.

3. క్యాబినెట్ సమావేశంలో చర్చించకుండానే బ్రిటన్ కంపెనీకి కోట్లరూపాయలు చెల్లించేయటం.

పై మూడు ఉల్లంఘనలను గమనించగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)(RBI) తెలంగాణ ప్రభుత్వానికి రు. 8 కోట్లు జరిమానా విధించింది. జరిమానా ఎందుకు విధించిందంటే విదేశీకంపెనీకి విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయాలంటే ముందుగా ఆర్బీఐ నుండి అనుమతి తీసుకోవాలి. అయితే బ్రిటన్ కంపెనీకి హెచ్ఎండీఏ చేసిన చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి తీసుకోనేలేదు. విషయం తెలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ జరిమానా విధించింది. ఆర్బీఐ విధించిన జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. జరిమానా చెల్లించింది అంటేనే తప్పుజరిగిందని ఒప్పుకున్నట్లే కదా. తప్పు ఎందుకు జరిగింది ? జరిగిన తప్పుకు కారణమెవరు ? ఏ హోదాలో తప్పుచేశారన్నది గమనిస్తే కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అర్ధమైపోతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కొడుకే కాకుండా మంత్రి కూడా కాబట్టే ఏమిచేసినా చెల్లుబాటవుతుందని కేటీఆర్ అప్పట్లో అనుకుండవచ్చు. అందుకనే ఆర్ధికశాఖ అనుమతి తీసుకోకుండా, క్యాబినెట్ ఆమోదంలేకుండానే నిధుల బదిలీచేయించారు. అర్వింద్ కుమార్ చెల్లింపులు కూడా ఎలాగ చేశారంటే కేటీఆర్ మౌఖిక ఆదేశాల ద్వారా. కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతోనే తాను బ్రిటన్లోని ఎఫ్ఈవో కంపెనీకి రు. 45 కోట్లు చెల్లించినట్లు అర్వింద్ రాతమూలకంగా అంతర్గత విచారణలో కమిట్ అయ్యారు. ఇదే విషయాన్ని తర్వాత మీడియాలో కేటీఆర్ మాట్లాడుతు నిధుల బదిలీలో అధికారుల పాత్రలేదని, తానుచెబితేనే అధికారులు నిధులు బదిలీచేశారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టులో మాత్రం నిధుల బదిలీఅంతా అధికారులే చూసుకున్నారని, తనకు ఎలాంటి సంబంధంలేదని అడ్డంతిరిగారు.

పైపాయింట్లను గమనిస్తే ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో కేసీఆర్ కొడుకు హోదాలోనే కేటీఆర్ సర్వం తానేఅయి వ్యవహరించిన విషయం అర్ధమవుతోంది. కేసీఆర్ కొడుకు కాబట్టే క్యాబినెట్లో చర్చించి ఆమోదం తీసుకోకపోయినా సహచర మంత్రులెవరు నోరెత్తలేదు. ఇక్కడే కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇదేవిషయాన్ని ఏసీబీ అధికారులు కోర్టులో కూడా వాదించారు. ఏసీబీ లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు విచారణకు అనుమతించింది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story