
ఐపీఎస్ సంజయ్ విచారణ విచిత్రమా? వినోదమా?
ప్రస్తుతం ఏపీ ఐపీఎస్ లలో 'సీనియర్' ‘జూనియర్’ డ్రామా నడుస్తోంది. అదేంటంటే ఐపీఎస్ ల అరెస్ట్ లు, విచారణలు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పులు ఎప్పుడూ ఆసక్తికరమే. కానీ ప్రస్తుతం జరుగుతున్నది మరింత ఆసక్తికరం. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి... గతంలో సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపక శాఖ డీజీగా హవా నడిపిన ఎన్ సంజయ్‌ను తనకంటే జూనియర్ అధికారులు 'ప్రశ్నల' ముందు కూర్చోబెట్టి విచారిస్తున్నారు.! వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలతో కేసు నమోదైన సంజయ్ మూడు రోజుల పోలీసు కస్టడీలోకి వెళ్లారు. మంగళవారం (2025 సెప్టెంబర్ 2) విచారణ ముగిసింది. బుధవారం, గురువారాల్లో మరిన్ని ప్రశ్నలు ఎదుర్కోవాలి. ఇది న్యాయపరమైన ప్రక్రియా? లేక రాజకీయ 'ఎంటర్‌టైన్‌మెంట్' షోనా? అనే చర్చ ప్రజల్లో ఉంది.
డిసెంబర్ 2024లో ఏసీబీ (ఆంటీ-కరప్షన్ బ్యూరో) సంజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆరోపణలు సాధారణమైనవి కావు, సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపక డీజీగా ఉన్న సమయంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, టెండర్లలో అవకతవకలు. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్టును నిర్వహించిన సీఐడీ చీఫ్‌గా సంజయ్ పేరు గుర్తుండిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టేబుల్స్ టర్న్ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆగస్టు 2025లో ఆయన అంటిసిపేటరీ బెయిల్‌ను రద్దు చేసి, మూడు వారాల్లో సరెండర్ కమాండ్ ఇచ్చింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇప్పుడు మూడు రోజుల కస్టడీలో విచారణ. ఇదంతా లీగల్ డ్రామా... కానీ సెటైర్‌కు పుష్కలమైన మెటీరియల్.
ఇక్కడే విచిత్రం మొదలైంది. సంజయ్ లాంటి సీనియర్ ఐపీఎస్‌ను ప్రశ్నించేది ఎవరు? తనకంటే జూనియర్ అధికారులు.! ఇప్పటి వరకు సంజయ్ ఎన్నో కేసులు హ్యాండిల్ చేశారు. ఎన్నో విచారణలు చేయించారు. ఇప్పుడు ఆయనే 'ఆన్సర్ షీట్' ముందు కూర్చున్నారు. న్యాయవాదులు, ఐపీఎస్, ఐఏఎస్ సర్కిల్స్‌లో ఇది హాట్ టాపిక్. "ఐపీఎస్‌లు ఒకరినొకరు ప్రశ్నించడం, సీనియర్‌ను జూనియర్ కట్టడీలో పెట్టడం? ఇది 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లా ఎంటర్‌టైన్‌మెంట్ లా ఉంది కదూ...’’ అంటూ చర్చలు సాగుతున్నాయి. సెటైరికల్‌గా చూస్తే, ఇది ఒక రకమైన ‘రోల్ రివర్సల్’ కామెడీ. గతంలో సంజయ్ లాంటి అధికారులు రాజకీయ నాయకులు, సామాన్యులను విచారించేవారు. ఇప్పుడు వారే 'ఇంటరాగేషన్ రూమ్'లో జూనియర్ అధికారి ప్రశ్న వేస్తుంటే, సంజయ్ మనసులో "ఇది నేను ఎప్పుడో చేసిన స్క్రిప్ట్ కదా!" అనుకుంటున్నారేమో.
విశ్లేషణ పరంగా చూస్తే, ఇది రాజకీయ ప్రతీకారమా? లేక నిజమైన అవినీతి దర్యాప్తా? గత ప్రభుత్వంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ చీఫ్. ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. అవినీతి కేసులు పాత ప్రభుత్వ అధికారులపై పడటం సహజమే. కానీ ఇంత స్పీడ్‌గా కస్టడీకి తీసుకోవడం ఆలోచింపజేస్తుంది. ఏసీబీ అధికారులు "దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నాం" అంటున్నారు. కానీ సంజయ్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఐపీఎస్‌కు 'ప్రశ్నల నుంచి తప్పించుకోవడం' పాత ట్రిక్. "సరైన సమాధానాలు రావని తెలిసినా కస్టడీకి అడిగి ప్రశ్నిస్తున్నారు" అనేది ఆసక్తికరం. ఇది ఫార్మాలిటీనా? లేక రాజకీయ సందేశమా? పై అధికారులకు తెలుసు. ఐపీఎస్‌లు 'సైలెంట్ మోడ్'లోకి వెళ్తారు, కానీ ప్రక్రియ పూర్తి చేయాలి.
సెటైర్ కోణంలో చూస్తే... ఇది ఒక 'పోలీసు రియాలిటీ షో'! దీనికి టైటిల్ "జూనియర్ వర్సెస్ సీనియర్, ఎవరు గెలుస్తారు?" జూనియర్ అంటాడూ... "సార్ ఆ టెండర్ ఎలా పాస్ అయింది?" సీనియర్... "అది... మర్చిపోయా, నువ్వు రిమైండ్ చెయ్!" అని సీన్ ఇమాజిన్ చేసుకుంటే నవ్వు వస్తుంది. కానీ ఇది నిజంగా విచిత్రం. పోలీసు వ్యవస్థలో హైరార్కీ ఉంటుంది. కానీ అవినీతి ముందు అంతా సమానమా? లేక రాజకీయాలు హైరార్కీని మారుస్తాయా? న్యాయవాదులు చెబుతున్నట్టు, ఇది 'ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాం'లా అనిపిస్తోంది. కానీ ఇందులో లోతైన సందేశం ఉంది. అధికారం తాత్కాలికం, అవినీతి ఆరోపణలు శాశ్వతం.
కొసమెరుపు ఏమిటంటే... ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి. కానీ ఒకటి స్పష్టం. ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడు 'జూనియర్ పవర్' హవా నడుస్తోంది. సంజయ్ లాంటి సీనియర్లు ఇప్పుడు 'లెసన్' లెర్న్ చేస్తున్నారు. అధికారం ఎప్పుడూ ఒకేలా ఉండదు!