గెలిచే తొలి తెలుగుదేశం సీటు అదేనా?
తెలుగుదేశం పార్టీ గెలిచే తొలి సీటుపైన ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ. ఆ సీటే గెలుస్తుందని అంచనా వేస్తోన్న టీడీపీ వర్గాలు.
త్వరలో జరగనున్న 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా, లేదా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అవుతారా అనే అంశాలతో పాటు మరో అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచే తొలి సీటు ఏది అనే దానిపైనా అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి అసెంబ్లీ సీటు తొలి స్థానంగా నిలవనుందని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి తొలి స్థానంగా నమోదు కానుందని చర్చించుకుంటున్నారు. అయితే మెజారిటీ అంశం పక్కన పెడితే టీడీపీ డ్యామ్ ష్యూర్‌గా గెలిచే స్థానంగా టీడీపీ శ్రేణులు మంగళగిరిని పరిగణిస్తున్నారు.
2019 ఎన్నికల్లో తొలి సారి లోకేష్ మంగళగిరి నుంచి బరిలో దిగారు. చంద్రబాబు నాయడు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన లోకేష్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తన కుమారుడినే గెలిపించుకోలేని చంద్రబాబు ఇక పార్టీని ఏలా గెలిపిస్తారనే విమర్శలు నాడు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎక్కువయ్యాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు, లోకేష్‌లు గ్రౌండ్ లెవల్ నుంచి మంగళగిరిలో వర్క్‌అవుట్ చేశారు. 2019లో ఓడి పోయిన నాటి నుంచి మంగళగిరిపై లోకేష్ దృష్టి పెట్టారు. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని ప్రతి సామాజిక వర్గానికి ఆయన చేరువయ్యేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. వీరే వాస్థానికుల వద్దకు వెళ్లి స్థానికుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా యాక్షన్ ప్లాన్ చేశారు.
టీడీపీ పార్టీ నుంచి అందిస్తున్న సేవలు
స్వర్ణకారుల కోసం లక్ష్మీనరసింహస్వామి సంఘాన్ని ఏర్పాటు చేసి టీడీపీ నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మంగళగిరిలో ఎక్కడైనా పెళ్లి జరిగితే వధు, వరులకు పెళ్లి కానుక అందజేస్తున్నారు. స్వయం ఉపాధిని పొందేందుకు యువతకు కొన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టారు. పండగల సమయంలో పాస్టర్లు, పూజార్లు, ఇమామ్‌లు, మౌజన్లుకు నూతన వస్త్రాలను అందిస్తున్నారు. దివ్యాంగులను గుర్తించి వారికి ట్రై సైకిల్స్‌ను అందజేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది. మంగళగిరిలో మాత్రం టీడీపీ స్వంతంగా పేదల కోసం అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తోంది. పేద మహిళల కోసం టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. రత్నాల చెరువుకు రహదారి సౌకర్యంలేకపోతే నాలుగు రోజుల్లో సొంత నిధులతో రోడ్డు నిర్మించారు. వెద్య ఖర్చులు, మందులు కొనుగోలు చేయలేని పేద రోగులకు ఆరోగ్య రథం ప్రారంభించి ఉచిత సేవలు అందిస్తున్నారు. ఉచిత ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. యువతకు ప్రత్యేకంగా క్రీడా స్థలాలను ఏర్పాటు చేశారు. క్రికెట్, వాలీబాల్ వంటి ఆటలు ఆడుకునేందుకు టీడీపీ సౌకర్యాలు కల్పించింది. ఇలా లోకేష్ అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతూ వచ్చారు. దీంతో రానున్న ఎన్నికల్లో లోకేష్ గెలుపు ఖాయమని, టీడీపీ గెలిచే తొలిసీటు ఇదే అని ఆ పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీనికి తోడు తమ అభ్యర్థిని ఎంపికలో సీఎం జగన్ అనుసరించిన వ్యూహాలు కూడా లోకేష్‌కు అనుకూలంగా మారే చాన్స్ ఉందని, వైఎస్‌ఆర్‌సీపీ నేతల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలకు కూడా టీడీపీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Next Story