జగన్‌కు ఈ పరిస్థితి రావడానికి ఆమే కారణమా?
x

జగన్‌కు ఈ పరిస్థితి రావడానికి ఆమే కారణమా?

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఘోరంగా ఓటమి పాలైంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ షాక్‌ నుంచి ఇంకా తేరు కోలేదు.


ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడి పోవడానికి కారణాలను రాజకీయ వర్గాలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నాయి. అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమానికే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధిక ప్రా«ధాన్యతనిచ్చిందని, చుట్టు ఉన్న కోటరీని, కొద్ది మంది నేతలను తప్ప తక్కిన ఎమ్మెల్యేలను, ఎంపీలను జగన్‌ కలసే వారు కాదని, కొద్ది మందికి తప్ప తక్కిన వారికి పనులు చేసే వారు కాదని, ఒక నియంతలా వ్యవహరించారని, క్యాడర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, లీడర్లకు జగన్‌కు గ్యాప్‌ పెరిగి పోయిందని ఇలా అనేక రకాల అంశాలకు సంబంధించిన విశ్లేషణలు చేస్తున్నారు.

అయితే తాజాగా మరో అంశం వినిపిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడి పోవడానికి ఒక కారణమనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన నాటి నుంచి అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ భారతిరెడ్డి ప్రమేయం పెరిగి పోయిందని, కీలక నిర్ణయాల్లో ఆమె మాట నెగ్గించుకునే వారని దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందినే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
ఇదే విషయాన్ని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్‌ రాజకీయ నాయకుడు ఆదినారాయణరెడ్డి బహిరంగంగానే విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వైఎస్‌ భారతిరెడ్డి చెలరేగి పోయారని, భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా భారతిరెడ్డి రాజ్యాంగం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో పాలన కొనసాగిందని, ఢిల్లీ మద్యం కుంబకోణంలో కూడా భారతిరెడ్డి ప్రమేయం ఉందని, ఇది కూడా త్వరలో బయటకు వస్తుందని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీవల బహిరంగంగానే విమర్శలు చేయడం గమనార్హం.
2019 మే 30న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. సీఎం అయిన కొన్నాళ్లు పాటు కామ్‌గా ఉన్న భారతిరెడ్డి తర్వాత అధికారంపై కన్నేశారు. మెల్లమెల్లగా అధికారానికి దగ్గరవుతూ వచ్చారు. తర్వాత మరి కొన్ని రోజుల్లోనే అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నారు. కీలక నిర్ణయాలు ఆమెకు తెలియకుండా తీసుకోవడం కష్టంగా మారింది. మంత్రి పదవుల నిర్ణయాల్లో కూడా ఆమె కీలకంగా మారారు. అప్పటి వరకు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల, వైవీ సుబ్బారెడ్డితో పాటు ఆకుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న నేతలతో సత్సంబంధాలు ఉన్న వారికి మంచి పదవులు దక్కుతాయనే టాక్‌ ఉండేది. భారతిరెడ్డి దానిని బ్రేక్‌ చేస్తూ తనకు అనుకూలంగా ఉన్న వారికి మంత్రి పదవులు దక్కేలా చక్రం తిప్పారు. ఆమె చెప్పిన వారికే మంత్రి పదవులు దక్కాయి. మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. దీంతో నేతలందరూ ఆమె గ్రూపులోకి వచ్చి చేరారనే చర్చ కూడా సాగింది.
ప్రభుత్వంలోని కీలక పోస్టుల నియామకాల్లో కూడా ఆమె హస్తం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్య కార్యదర్శుల నియామకాల నుంచి సీఎంఓలో ఐఏఎస్‌లు, ఇతర అధికారులు, సిబ్బంది వరకు ఆమె సూచనల మేరకు నియామకాలు జరిగాయి. అలా జగన్‌మోహన్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చి తన మాట ప్రకారమే జరిపించుకునే వారనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించింది. భారతిరెడ్డి ప్రెషర్‌ భరించ లేక ప్రభుత్వంలో జరిగే ప్రతి కీలక అంశాలను భారతిరెడ్డితో చర్చించాలని, తర్వాతనే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలని నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని, నాటి నుంచి భారతిరెడ్డి అటు ప్రభుత్వంలోను, ఇటు పార్టీలోను క్రియాశీలకంగా మారిపోయారని చర్చ అప్పట్లో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లోనే కాదు, అధికార వర్గాల్లోను విస్తృత సాయిలో జరిగింది.
ఇదే సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మ ప్రస్థావన తెరపైకి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కానీ, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్పప్పుడు కానీ విజయమ్మ ఒక గృహిణిగానే వ్యవహరించారే కానీ వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉండగా అటు ప్రభుత్వంలో కానీ, ఇటు పార్టీలో కానీ ఎలాంటి చొరవ తీసుకొనే వారు కాదని, వైఎస్‌ఆర్‌పైన ఒత్తిడి తెచ్చే వారు కాదని, అందువల్లే రాజశేఖరరెడ్డి రాజకీయాల్లో అన్నేళ్ల పాటు విజయవంతంగా రాణించ గలిగారని, కానీ భారతిరెడ్డి వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉందని, షాడో సీఎంగా వ్యవహరించారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో అప్పట్లో వినిపించింది. 2024 ఎన్నికల్లో కూడా కీ రోల్‌ పోషించారని, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలనే అంశాలన్నీ ఆమె కనుసన్నుల్లోనే జరిగిందనే చర్చ కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో జగన్‌మోహన్‌రెడ్డికి, ఆ పార్టీలోని ఇతర నేతలకు, కార్యకర్తలకు మధ్య గ్యాప్‌ పెరిగి పోయిందని, ఈ పరిణామాలు ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణమనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.
Read More
Next Story