దోపిడీ వ్యవస్థను ఓటర్లే బలపరుస్తున్నారా!
దేశమంతటా ఎన్నికల జాతర జరుగుతోంది. రేపు ఈ జాతర తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనుంది. ఎన్నికలొచ్చాయంటే సాధారణంగా నేతలు మారాలి, మన బతుకులు మారాలి..
దేశమంతటా ఎన్నికల జాతర జరుగుతోంది. రేపు ఈ జాతర తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనుంది. ఎన్నికలొచ్చాయంటే సాధారణంగా నేతలు మారాలి, మన బతుకులు మారాలి, భవిష్యత్తు మారాలి, వాటన్నింటిని మార్చాలంటే ఓటు వేయాలని చెప్పే మేధావులకు తక్కువేమీ లేదు. కానీ మనం అంటే ఓటర్లు.. ఎలా మారాం. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మారాం.. మంచిగా మారామా, దిగజారినట్లు మారామా.. ఒక్కసారి చూసేద్దామా..
అప్పుడు అలా
ఒకప్పుడు ఎన్నికలంటే నిజంగా గొప్ప నాయకులు, ప్రజాసేవే జీవిత లక్ష్యంగా ఉన్న వారి మధ్య జరిగే మహత్తర పోరుగా ఉండేది. ప్రత్యర్థులను తిట్టుకోవడం కాకుండా.. తాము ప్రజలకు ఏం చేస్తాం.. ఎంత చేస్తాం అని వివరించి ఓట్లు అడిగేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం అంటే తిట్లు, ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలే ఎక్కువ ఉంటున్నాయి. ప్రత్యర్థిని తిట్టి ప్రజలను ఓట్లు అడుగుతున్న నాయకులకే రాజకీయ రంగంలో మైలేజీ కూడా అధికంగా ఉంటుంది. సిద్ధాంతాలు చెప్పుకోవడానికే తప్ప పాటించడానికి పనికిరావని ప్రస్తుత రాజకీయాలు చెప్పకనే చెప్తున్నాయి. అలాగని ఓటర్లు మారలేదా అంటే చాలా మారి పోయారు.
1980ల వరకు కూడా తమ ఇంటికి ఏ నాయకుడు అయితే మొదట వచ్చి ఓటు వేయమని కోరతాడో అతడికి అభయ హస్తం చూపి.. నీకు విజయం తథ్యమని ఆశీర్వదించి పంపేవారు. చెప్పినట్లుగానే వారికే ఓటు వేసేవారు. అప్పట్లో ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రాబల్యం అధికంగానే ఉండేది. ప్రాంతీయ పార్టీలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో టీడీపీ ఆవిర్భావంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా మారాయి. రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా చక్రం తిప్పడం ప్రారంభించాయి. నేతలు, ఓటర్ల తీరుతెన్నుల్లో కూడా కాస్త మార్పులు వచ్చాయి. కానీ ఓటర్లు.. ఎవరు వచ్చి ఓటు అడిగినా.. పోటీలో ఉన్న నాయకుల లక్షణాలు, ఎవరు గెలిస్తే సమాజానికి మేలు జరుగుతుంది అన్న అంశాలను బేరీజు వేసుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే వారు. ఒకవేళ నాయకులు డబ్బులు ఇవ్వడానికి యత్నించినా తీసుకోవడానికి ఓటర్లు ముందుకు వచ్చేవారు కాదు. సున్నితంగా తిరస్కరించేవారు.
ఎవరు డబ్బిస్తే వారికే ఓటు
ఆ తర్వాత ముందుగా ఎవరు డబ్బు ఇస్తే వారికే ఓటు అన్న సంప్రదాయాన్ని ఓటరు అందిపుచ్చుకున్నాడు. ముందు డబ్బు ఇచ్చిన వ్యక్తికే ఓటు వేయాలన్న కట్టుబాటుతో ముందుకు సాగాడు. రెండో సారి డబ్బు ఇస్తున్న వ్యక్తి ఎక్కువ నగదు ఇస్తున్నా అక్కర్లేదు.. తొలుత ఇచ్చిన వ్యక్తికే తమ ఓటు అనేవారు. కాల క్రమేణా సమాజంలో అవినీతి, అనైతికతతో పాటు ఓటర్ల సంప్రదాయం కూడా మారింది. అందులో భాగంగానే డబ్బులు ఇస్తున్న ప్రతి నేత దగ్గరా డబ్బు తీసుకుని, ఇంట్లో ఉన్న ఓట్లను నేతలకు సరిపడేలా సర్దుకునే వారు. ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయి. ఇద్దరు డబ్బులిస్తే ఒక్కో నేతకు ఒక్కో ఓటు అన్నమాట. ఆ తర్వాత డబ్బు ఇచ్చిన వారికే ఓటు.. ఇవ్వని వారిని నిలదీయడం కూడా ప్రారంభించారు ఓటర్లు. పైగా ప్రత్యర్థులు ఇద్దరి దగ్గరా డబ్బు తీసుకుని ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ఓటు అన్న కట్టుబాటును కూడా అలవర్చుకున్నారు. తాజాగా ప్రస్తుతం ఎన్ని పార్టీలు డబ్బులు ఇస్తే అన్ని పార్టీల దగ్గర మొహమాటం లేకుండా డబ్బులు తీసుకుని జేబుల్లో పెట్టుకుని.. తీరా పోలింగ్ రోజున తమకు నచ్చిన వ్యక్తికి ఓటు సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడట్లేదు.
ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల్లో అయితే కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చిన నేతలు డబ్బులు పుచ్చుకున్న ఓటర్ల చేత ప్రమాణాలు కూడా చేయిస్తున్నారు. ఇలాంటి తతంగాన్ని తిరుపతిలో వైసీపీ నేత చేయించారు. ‘‘దేవుడి సాక్షిగా మా ఓట్లు, మా కుటుంబ ఓట్లు, బంధు వర్గం ఓట్లు అన్నీ కూడా ఫ్యాన్ గుర్తుకే వేస్తాం. మాకు రుణం తీర్చుకునే అవకాశం దక్కింది’’ అంటూ ప్రమాణం చేయిస్తున్నారు. ఈ ప్రమాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓటు వేయమని డబ్బులు ఇవ్వడమే ఒక అనైతిక, అవినీతి పని.. తీసుకోవడం కూడా.. అలాంటి పని చేస్తూ అందులనూ మాటపై నిలబడతానని ప్రమాణం చేయించడం, దానికి దేవుడిని సాక్షిగా నిలబెట్టడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ తతంగం తిరుపతిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో దీనిపై స్పందించిన ఎన్డీఏ కూటమి.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తున్న కేతం జయచంద్రారెడ్డిపైనా, ప్రమాణం చేసిన ఓటర్లపైనా చర్యలు తీసుకునేలా చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఎందుకీ పరిస్థితి
ఒకప్పుడు ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవడాన్ని మహాపాపంగా, సిగ్గుగా భావించిన ఓటర్లు ఇప్పుడు డబ్బులిస్తేనే ఓటు అనే దుస్థితికి ఎందుకు దిగజారిపోయారు? అంటే ఈ ప్రశ్నకు వారి ఆర్థిక స్థితిగతులే కారణమని అంటున్నారు విశ్లేషకులు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓటర్లు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో డబ్బులు తీసుకుంటుంటే.. ఫ్రీగా వచ్చే సొమ్మును ఎందుకు వదులు కోవాలని మిగిలిన వారు తీసుకుంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. పైగా ఇప్పుడు ఓటుకు ఇస్తున్న డబ్బులు తీసుకోని వ్యక్తిని బాధ్యత ఉన్న వారిలా కాకుండా చేతకాని వాడిలా సమాజం చూడటం కూడా ఇందుకు ప్రధాన కారణమని, ప్రస్తుత సమాజంలో తప్పు చేయని వాడిని చేతకాని వాడిగా చూస్తున్నారని, అందుకే ప్రతి ఒక్కడూ తప్పు చేయడమే సరైన మార్గమనుకుని అటుగా ప్రయాణిస్తున్నాడని నిపుణులు భావిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది ప్రజలు కాదా!
రాజకీయ నాయకులు మాట్లాడే సమయంలో అనేకసార్లు తమ ప్రత్యర్థులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శిస్తుంటారు. కానీ అసలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది.. అవినీతి పరులైన నాయకులా? లేకుంటే వారిని చక్కదిద్దడం మానేసి అవినీతికి అలవాటు పడుతున్న ఓటర్లా? ఓటుకు డబ్బులు తీసుకోవడం తప్పని, అది అనైతికమని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా వారు ఆ రెండుమూడు నోట్ల కోసం ఎందుకు అంత తాపత్రయ పడుతున్నారు. సమాజం ఐక్యత, ఉమ్మడి ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు, సామాజికాభివృద్ధి ఇవేమీ పట్టించుకోలేని దుస్థితికి సదరు ఓటరు దిగజారి పోయాడు. ఇలా డబ్బులు తీసుకుని నచ్చిన వారికి ఓటేయడం. నచ్చిన వారికి అంటే ఎవరి కొలమానం వారికి ఉంటుంది. ఒకరికి కులమయితే మరొకరికి ప్రాంతం అంతే తేడా. ఇలా చేయడం వల్ల ఓటర్లలో చైతన్యం పెరిగినట్లా? సమాజంలో అవినీతి రోజురోజుకు తన బలాన్ని పెంచుకుంటున్నట్లా? సమాజంలో ఈ అవలక్షణాలు బలపడ్డాయంటే ప్రజాస్వామ్యం బలహీనపడినట్లు కాదా? డబ్బులు తీసుకుని ఓటు వేయడం అంటే దోపిడీ వ్యవస్థకు పట్టం కడుతున్నట్లు కాదా? ఎవరు గెలిచినా దోపిడీ శక్తి గెలిచినట్లే కదా?
ఇలాంటి సమయంలో ప్రజాస్వామ్యం, ప్రగతిశీల శక్తులు కూడా ఏం చేయలేని దుర్భర స్థితిలో చేతులు కట్టుకుని మౌనంగా దూరంగా నిలుచుని ఉండిపోతున్నాయి. ఎందుకంటే తెలియక తప్పు చేస్తుంటే.. మార్చవచ్చు. కానీ తెలిసి కూడా తప్పే చేస్తాం అనే వాళ్లని మార్చలేం. అందుకే డబ్బులు తీసుకుని ఓటు వేస్తూ దోపిడీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ తన శరీరం నిండా తూట్లు పడేలా పొడుస్తున్నా సమాజం, ప్రజాస్వామ్యం మౌనంగా నిల్చుని చూస్తున్నాయి. ఇది మారాలంటే ఓటరు నిజంగా మేల్కోవాలి. నిజమైన చైతన్యాన్ని పొందాల్సిందే. ఐదేళ్ల పదవుల కోసం రెండు నోట్లు ఇచ్చే వారి దగ్గర నోట్లు తీసుకోకుండా.. రెండు పూటలా ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేలా చేసే నిజమైన నాయకులను ఎన్నుకోవాలి. ఏది జరగాలన్నా ఓటరు మేల్కోవాలి.