పులస.. పుస్తెలమ్మినా దొరికేలా లేదే..!
x

పులస.. పుస్తెలమ్మినా దొరికేలా లేదే..!

ఈ చేప ఖరీదు రూ.20 వేల పైనే. దీని వంటకమూ అంతే స్పెషల్. ఏటా తగ్గిపోతున్న ఈ చేపల లభ్యత. మున్ముందు పుస్తెలమ్మినా పులస దొరకని పరిస్థితి.


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

పులస.. ఈ పేరు వింటేనే ‘చేపాహార ప్రియుల ఒళ్లు పులకించిపోతుంది. ఆ పులస పులుసు రుచి కోసం జిహ్వ తహతహలాడుతుంది. చేపల్లో రారాణిగా పేరు తెచ్చుకున్న ఈ క్వీన్ ఆఫ్ ద ఫిష్.. ప్రపంచంలో అరుదైన చేపగా వెలుగొందుతోంది. ఇతర చేపలన్నిటికంటే రుచిలోనే కాదు.. ధరలోనూ దీనిదే పైచేయి. అందుకే ఈ పులసకు ఎక్కడా లేనంత గిరాకీ. అలాంటి పులస కోసం ఎంతోమంది పరితపించి పోతుంటారు. గోదావరి జిల్లాల వారైతే పుస్తెలమ్మైనా సరే పులస పులుసు తినాల్సిందేనంటారు. ఆ జిల్లాల్లో పులస కొనడం అన్నా, తినడం అన్నా, ఓ స్టేటస్ సింబల్గా భావిస్తుంటారు. ఏడాదంతా మళ్లీ పులసల సీజనెప్పుడొస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇతర ప్రాంతాల వారూ జీవితంలో ఒక్కసారైనా పులస రుచి చూడాలని పరితపిస్తుంటారు. ఎప్పుడూ సామాన్యులకు అందనంత ఎత్తులో ఉండే ఈ చేప ఇప్పుడు సంపన్నులకూ దొరకనంటోంది. ఆ పులస విలాసం గురించి తెలుసుకుంటారా?

ఏమిటీ పులస? ఏమా కథ?

పసిఫిక్ మహా సముద్రంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సముద్ర జలాల గుండా హిందూ మహాసముద్రంలోకి, అక్కడ నుంచి బంగాళాఖాతంలోకి పునరుత్పత్తి కోసం వస్తాయి 'వి(ఇ) లసలు' ప్రపంచంలోకెల్లా బంగ్లాదేశ్ (హిల్సగా పిలుస్తారు) లోని పద్మా నది, పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిల్లో మాత్రమే ఇవి లభిస్తాయి. ఖండాలు దాటి దాదాపు 11 వేల నాటికల్ మైళ్ల దూరం 30-40 రోజుల పాటు ఏకధాటిగా ప్రయాణిస్తాయి. ఇలా ఏటా జులై నుంచి సెప్టెంబర్ వరకు ఇవి అక్కడ నుంచి గోదావరికి వరద నీరు వచ్చే సమయానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. గోదావరిలో గులకరాళ్లు, ఇసుక ఉన్న ప్రాంతాల్లో మగ, ఆడ విలసలు సంగమించి గుడ్లు పెడతాయి. రెండు రోజుల్లోనే ఈ గుడ్లు పిల్లలవుతాయి. ఇవి సముద్రం నుంచి గోదావరిలోకి 100 కి.మీల వేగంతో ఎదురీదుతాయి. అంత వేగంతో ఎదురీదడంతో ఈ చేపల్లో కెమికల్ రియాక్షన్ జరిగి, కొవ్వు కరిగి వాటి శరీరాకృతి స్మార్ట్ గా తయారై ఎరుపు, గుధుమ రంగులోకి మారుతుంది. ఈ ప్రక్రియలో వాటి కండరాల్లో ప్రొటీన్లు ఉత్పత్తవుతాయి. అప్పటివరకు ఉన్న వి(ఇ)లస రూపాంతరం చెందాక పులసగా మారుతుంది. ఈ పులసలు కేవలం కిలో నుంచి మూడు కిలోల బరువు, 60 సెం.మీల పొడవు మాత్రమే ఉంటాయి. మగ వాటికంటే ఆడ పులసలే పెద్దవిగా ఉంటాయి. సంతానోత్పత్తి జరిగాక ఈ పులసలు ఎక్కడ నుంచి వచ్చాయో తిరిగి అక్కడకే పయనమవుతాయి.

మన పులస లభ్యత ఎక్కడ?

గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో మూడు చోట్ల మాత్రమే పులసలు లభ్యమవుతాయి. నదీ పాయలు సముద్రంలో కలిసే ఉభయ గోదావరి జిల్లాల్లోని అంతర్వేది, ఓడలరేవు, కొత్తపాలెం, సముద్ర మొగ ప్రాంతాల నుంచి గోదావరిలోకి ప్రవేశిస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతం, నర్సాపురం ప్రాంతాల్లో ఇవి దొరుకుతాయి.

పులస ధర రూ. వేలల్లోనే..

ఇక పులస ధర వింటే గుండె ఆగినంత పనవుతుంది. దీని రేటు ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుంది. ఒక్కో పులస ఖరీదు గతంలో రూ.5 నుంచి 10 వేల వరకు ఉండేది. రానురాను పులసల లభ్యత తగ్గిపోతుండడం, డిమాండ్ పెరిగి పోతుండడంతో వీటి ధర కొండెక్కి కూర్చుంటోంది. ఇలా ఇప్పుడు అరకిలో బరువున్న పులసే రూ.ఐదారు వేలు పలుకుతోంది. ఇక రెండు మూడు కిలోల పులస గరిష్టంగా రూ.20-30 వేల వరకు పలుకుతోందంటే దీనికున్న ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వేలకు వేలు పోసి గోదారోళ్లు పులస చేపను కొనుక్కుని లొట్టలేసుకుంటూ తింటారు. ఆ జిల్లాల్లో పులసను తినడమంటే ఓ స్టేటస్ సింబల్గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.. 'ఫలానా సుబ్బారావు రూ.10 వేలకు పులస కొన్నాడంట! అని తెలియగానే మరో పుల్లారావు అంతకు మించి కొనుగోలు చేసి తన స్టేటస్‌ను చాటుకుంటాడు. గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ, ఎప్పటికీ ఈ పరిస్థితి కొనసాగిస్తూ పులస తన ఆధిక్యాన్ని చాటుకుంటోంది. పులసల సీజను వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాల్లో వీటి ముచ్చట్లే జోరుగా సాగుతాయి.

దీని వంటకమూ ప్రత్యేకమే..

పులస లభ్యత, ధర ఒకెత్తయితే.. దాని వంటకం మరొక ఎత్తు! ఈ పులసలను పులుసుగానే వండుతారు. దీన్ని వండటం అంటే అంత ఆషామాషీ కాదు.. ఎవరుబడితే వారు వండితే దాని రుచి రాదు. గోదావరి జిల్లాల్లో ఈ తరం వారికంటే పాత తరం మహిళలు వండితేనే వండితేనే పులసకు అసలైన రుచి ఉంటుందంటారు. మసాలా దట్టించి, మట్టికుండలో చింతపండు పులుపుతో, చింతనిప్పులు లేదా కట్టెల పొయ్యి/ పిడకల మంటపై వండుతారు. పులుసు మరిగే టప్పుడు బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి కోయకుండా వేస్తారు. ఆవకాయలో తేరిన ఎర్రటి నూనెను, కొత్తిమీరను కూడా వాటికి జోడిస్తారు.

పులస పులుసు వండిన 24 గంటల తర్వాత తింటే దాని రుచే వేరని ఆ రుచి ఎరిగిన వారు చెబుతారు. ఘుమఘుమలాడే పులస పులుసును తమకు అత్యంత ఆత్మీయులకు, ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు పంపిస్తుంటారు. ఇలా పులస పులుసు తిన్నామని కొందరు, ఫలానా వారు మాకు పంపించారని మరికొందరు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. 'ఏటా సీజనులో కనీసం మూడు నాలుగు పులసలను కొంటాం. గతేడాది కిలోన్నర బరువుండే రెండు పులసలను రూ.8, 9 వేల చొప్పున కొన్నాను. ఈ ఏడాది ఇంకా దొరకలేదు. వాటి కోసమే చూస్తున్నాను' అని కాకినాడకు చెందిన పండ్ల వ్యాపారి ఈతా సతీష్ కుమార్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

ఇక పులస పులుసు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతారు. ముఖ్యంగా గర్భిణులకు అవసరమయ్యే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, గుండె జబ్బుల నివారణకు, చర్మ సౌందర్యానికి దోహదపడతాయని వీరు పేర్కొంటున్నారు.

నకిలీ పులసల బెడద..

ఇక అన్నిటికీ ఉన్నట్టే ఖరీదైన ఈ పులసలకూ నకిలీ బెడద ఉంది. పులసలను పోలిన ఇలసలను సిసలైన పులసలుగా విక్రయిస్తుంటారు. వాస్తవానికి పులస, ఇలస ఒకే జాతికి చెందినవి. గోదారిలో పుట్టిన పులస పిల్లలే సముద్రంలోకి వెళ్లి ఇలసలుగా వృద్ధి చెందుతాయి. ఇలసకు కొవ్వు పట్టి రుచిగా ఉండదు. పులసకున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా దొరికే ఇలసలతో పాటు ఒడిశా, మహారాష్ట్రల నుంచి ఇలసలను దిగుమతి చేసుకుని గోదావరి జిల్లాల్లో పులసలుగా అమ్మకాలు జరుపుతున్నారు. వీటిని కిలో రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. పులసను పోలి ఉండడంతో మోసపోతున్న వారు కొందరైతే.. పులసను కొనుగోలు చేయలేని వారు

ఇలసనే పులసగా తృప్తి చెందుతున్నారు. ఇలసను కోస్తే మాంసం ఎరుపు రంగులోను, పులస ముక్కలు గోధుమ వర్ణంలోను, పులస చేప పొలుసు వెండి రంగుతోను, ఇలస పై భాగం ఎరుపు జార ఉంటుందని, ఈ వ్యత్యాసాన్ని గుర్తించి కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారి చిట్టూరి గోపాలకృష్ణ సూచించారు. 'పులస రుచి మరే చేపలోనూ ఉండదనిపిస్తుంది. ఈ పులస ఏడాదిలో మూడు నెలలు మాత్రమే దొరుకుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే దీనికి అంత డిమాండ్. గోదావరి జిల్లాల్లో పులసకున్న గిరాకీ చెప్పలేమ'ని భీమవరానికి చెందిన సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ ఇర్రింకి సూర్యారావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

తగ్గిపోతున్న పులసల లభ్యత..

ఇంతటి విశిష్టతలున్న పులస చేపల లభ్యత ఏటికేడాది తగ్గిపోతోంది. ఈ ఏడాది మరింత క్షీణించింది. గత పదేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో గోదావరిలో పులసలు రాక తగ్గిపోలేదని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో జులై నుంచి సెప్టెంబర్ వరకు పెద్ద సంఖ్యలో లభ్యమయ్యేవి. కానీ ఇప్పుడు వేళ్లపై లెక్క పెట్టే స్థాయికి తగ్గిపోయాయి. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్లో చమురు కార్యకలాపాలల్లో భాగంగా నదీ ముఖద్వారం వద్ద డ్రెడ్జింగ్ తదితర పనులతో ధ్వని కాలుష్యం, ఇసుక మేటలు పెరిగి పోతోంది. ఇంకా గోదారి తీర ప్రాంతాల్లో పారిశ్రామిక రసాయన, చేపల చెరువుల వ్యర్థాలు గోదావరి నదిలో కలిసిపోతున్నాయి. దీంతో పులసలు సముద్రం నుంచి గోదావరిలోకి రాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బంగ్లాదేశ్ల వైపు తరలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పుస్తెలమ్మి కొందామన్నా పులస దొరకని పరిస్థితి ఏర్పడింది.

పులస మనుగడకు 'సిఫ్రీ' కృషి..

పులస చేప జాతి పరిరక్షణ, వృద్ధి కోసం కోల్కతాలోని సిఫ్రీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఒకింత కృషి సల్పుతోంది. పులస సీడ్ను వృద్ధి చేసి బంగాళాఖాతంలో విడిచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది కూడా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పులసల లభ్యతకు ఓ కారణమని చెబుతున్నారు. అయితే మన గోదావరిలో లభించే పులసలకున్నంత రుచి ఆ ప్రాంతంలో దొరికే పులసలకు ఉండక పోవడం విశేషం!

Read More
Next Story