Vizag Steel Plant
x

వైజాగ్ స్టీల్ ప్లాంట్

మిట్టల్‌పై ప్రేమ.. విశాఖ ఉక్కుపై పగ!

సీఎం చంద్రబాబు నోట పదేపదే 'ఆర్సెలార్' మాట. ప్రధాని సభలోనూ వైజాగ్ స్టీల్‌పై నోరెత్తలేదు ఎందుకు? ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదన్న సంకేతాలు.


అంతా అనుమానించినట్టే అయింది. విశాఖ ఉక్కుపై కూటమి నేతల వైఖరి తేటతెల్లమైంది. ఇన్నాళ్లూ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని చెప్పిన మాటలు కల్లబొల్లివేనని తేలిపోయింది. సాక్షాత్తూ దేశ ప్రధానే విశాఖ వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్పై మౌనం దాల్చడం, పైగా పుండు మీద కారం చల్లినట్టు ఇంకా పురుడు పోసుకోని ఆర్సెలార్ మిట్టల్ కోసం తపించిపోవడం చూసి విశాఖ వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తాజా పరిణామాలతో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యమన్న భావన మరింత బలపడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయనున్నట్టు నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పట్నుంచి ఉక్కు కార్మికులతో పాటు విశాఖ వాసుల్లోనూ తీవ్ర అలజడి రేగుతూనే ఉంది. అప్పట్నుంచి 1428 రోజులుగా ఈ స్టీల్ కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన అధినేత చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ు ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను తప్పుబడుతూ వచ్చారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలను వీరు దుమ్మెత్తి పోశారు.

తాము అధికారంలోకి వస్తే ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చేస్తామని హామీలిచ్చారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం పవర్‌లోకి రావడంతో ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మంచి రోజులు వచ్చినట్టేనని అంతా భావించారు. కానీ రోజులు, నెలలు గడుస్తున్న కొద్దీ కూటమి నేతలు వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగించడానికి బదులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మధ్య మధ్యలో మంత్రి లోకేష్, ఆయన తోడల్లుడు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వంటి వారు ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నామంటూ చెబుతూ వస్తున్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు నాలుగు రోజుల ముందు మంత్రి లోకేష్ ఒకడుగు ముందుకేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అంటూ మీడియాపై అసహనాన్ని ప్రకటించారు కూడా. ప్రధాని పర్యటన నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదేమోననని కొందరిలో మళ్లీ చిన్నపాటి ఆశలు చిగురించాయి. దీనిపై ప్రధానితో అధికారికంగా ప్రకటన చేయిస్తారేమోనని, ప్లాంటు రివైవల్ ప్యాకేజీ అయినా ప్రకటిస్తారేమోనని అంతా అనుకున్నారు.

విశాఖలో మోదీ రోడ్డుషోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్

దీంతో బుధవారం నాటి ప్రధాని సభ కోసం ఆశగా ఎదురు చేశారు. కానీ ఇన్నాళ్లూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ప్రైవేటీకరణ జరగనీయబోమని చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లు ‘విశాఖ ఉక్కు' గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఉక్కు ప్రస్తావన తెస్తే ప్రధాని మోదీకి ఎక్కడ కోపం వస్తుందోనన్నంతగా వీరు ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పటికే మూడు నెలల నుంచి ఉక్కు కార్మికులు జీతాల్లేక అవస్థలు పడుతున్నారు. అయినా ఇవేమీ పట్టనట్టుగా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసలు సమస్యే కాదన్నట్టు కూటమి పాలకులు వ్యవహరించారు. పైగా సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయబోతున్న మిట్టల్ ఆర్సెలార్ ఉక్కు కర్మాగారంపై తనకున్న మమకారాన్ని ప్రధాని వేదిక సాక్షిగా మరోసారి చాటుకున్నారు. ఆర్సెలార్కు ముడి సరకు రవాణాకు పంప్డ్ పైప్ లైన్కు సహకరించినందుకు ప్రధానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఎప్పట్నుంచో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలన్న డిమాండ్ను ప్రస్తావించకుండా ప్రైవేటు స్టీల్స్టాంట్ కోసం తపించడాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. అమరావతి అభివృద్ధికి, పోలవరం ముందుకు వెళ్లడానికి మోదీ సహకరిస్తున్నారని ఆకాశానికెత్తేశారే తప్ప కనీసం విశాఖ ఉక్కు కోసం ఒక వినతి పత్రాన్ని కూడా అందజేయకపోవడంపై చంద్రబాబు వైఖరిపై మండిపడుతున్నారు. పనిలో పనిగా మనిద్దరిదీ ఒకటే స్కూలు.. ఒకేలా పయనిస్తున్నాం.. ఇంకేమి కావాలి విశాఖకు అంటూ ముక్తాయించారే గాని విశాఖకు కావలసిన స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావనకే చంద్రబాబు ఇష్టపడలేదు. ప్రధాని కూడా వ్యూహాత్మకంగానే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా సహకరిస్తున్నామని చెప్పారు గాని విశాఖ ఉక్కుపై మాట్లాడకుండా తప్పించుకున్నారు.

'మిట్టల్' కోసం బాబు తపిస్తున్నారు..

'చంద్రబాబు, పవన్ కల్యాణ్ు సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. కూటమి పార్టీలను గెలిపిస్తే ప్రైవేటీకరణ జరగనీయబోమన్నారు. అఖిలపక్ష నేతలను ఢిల్లీ తీసుకెళ్లారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ జరగదని ఈమధ్యనే మంత్రి లోకేష్ సెలవిచ్చారు. ప్రధాని సభలో చంద్రబాబు, పవన్, లోకేష్ లు ఈ స్టీల్స్టాంట్ గురించి ఒక్క మాటైనా చెప్పలేకపోయారు. విశాఖ స్టీలు గనులు అడుగుతుంటే ఆ సంగతి వదిలేసి నక్కపల్లిలో ఇంకా పుట్టని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు తాపత్రయ పడిపోతున్నారు. ఈ ముగ్గురి వైఖరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో ఆవేశాన్ని రగిలిస్తోంది. వీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. త్వరలోనే కార్యాచరణ రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామ'ని స్టీల్ ప్లాంట్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

నిరసన దీక్షలో పాల్గొన్న విశాఖ ఉక్కు కార్మికులు

ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం..

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్టీల్ ప్లాంటున్న గాజువాక నియోజకవర్గం నుంచే ఎక్కువ ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఎన్నికల ముందు కూటమి నేతల మాటలు నమ్మి నమ్మి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రాష్ట్రంలోనే అత్యంత మెజార్టీతో గెలిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే పట్టించుకోరా? ఆధికారంలో లేకుంటే ఒకలా.. ఉంటే మరోలా? ఉక్కు కర్మాగారం పరిరక్షణ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు కూటమి నేతల తీరుకు నిరసనగా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం త్వరలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తా'మని విశాఖ స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జ్యేష్ట అయోధ్యరామ్ చెప్పారు.

విశాఖ ఉక్కు గురించి ఒక్క మాటా మాట్లాడరా?

'ప్రధాని సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని చెబుతూనే మోదీ సమక్షంలో దాని గురించి నోరెత్తలేకపోవడం విడ్డూరం. విశాఖ స్టీల్స్టాంట్కు సొంత గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వమే నష్టాల్లోకి నెట్టేసింది. 1400 రోజులకు పైగా ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడు నెలలుగా జీతాలివ్వకపోయినా చలించకపోవడం దురదృష్టకరం' అని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్ వ్యాఖ్యానించారు.

ఉక్కు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నట్టే..

'వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించడానికి మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. అలా వచ్చినప్పుడల్లా ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు విశాఖ ఉక్కు కర్మాగారం గురించి వేదికపై ప్రస్తావిస్తారని, దీంతో ప్రధాని ఈ ప్లాంట్పై ఏదైనా మంచి కబురు చెబుతారని అంతా ఆశించారు. కానీ కూటమి పాలకులు అలా చేయకపోవడం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వీరు ప్రోత్సహిస్తున్నట్టుగానే భావించాలి' అని సీనియర్ జర్నలిస్టు ఎం. యుగంధరరెడ్డి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో అభిప్రాయపడ్డారు.

Read More
Next Story