పవన్‌ కళ్యాణ్‌ దక్షిణాది మోదీ కావాలనుకుంటున్నాడా?
x

పవన్‌ కళ్యాణ్‌ దక్షిణాది మోదీ కావాలనుకుంటున్నాడా?

మానవత్వమే నా మతమని చెప్పుకున్న పవన్‌ కళ్యాణ్‌ నేడు సనాతన ధర్మాన్ని మించింది లేదని సెలవిచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ మాటలకు ప్రస్తుతం అర్థాలు వేరుగా ఉంటున్నాయి. పచ్చి రాజకీయ అవకాశవాదం తప్ప పవన్‌ కళ్యాణ్‌లో ఏ బావజాలం లేదని జనసేన పార్టీ ఫౌండర్‌ ప్రధాన కార్యదర్శి రాజా రవితేజ ‘ది వైర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ కోసం ‘ఇజం’ పుస్తకాన్ని తెచ్చింది కూడా ఆయనే. పవన్‌లో ఏ భావజాలం లేదని, మాటలతో ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ పార్టీ పెట్టిన కొత్తలో చెగువేరా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకున్నారు. చెగువేరా ఫొటో ఒకవైపు, పవన్‌ కళ్యాణ్‌ ఫొటో ఇంకో వైపు పెట్టి సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు. అప్పట్లో చెగువేరా అంతటి వాడు పవన్‌ కళ్యాణ్‌ అనేంతగా ప్రచారం చేయించారు.

చెగువేరా క్యూబా దేశానికి మంత్రి అయ్యాక బొలివియాలో అణచివేత ఉందని, అక్కడి వారిని కాపాడాలని దేశాన్ని, కుటుంబాన్ని, చివరకు మంత్రి పదవిని వదులుకుని గెరిల్లా యుద్ధం చేస్తూ అమెరికా సైన్యం చేతిలో అమరుడైన వ్యక్తి చెగువేరా. ఏర్నెస్టో చెగువేరా ఒక అర్జెంటినా మార్క్సిస్ట్‌ విప్లవకారుడు. మంచి వైద్యుడు. గొప్ప రచయిత. అన్నింటికి మించి మంచి మేధావి. గెరిల్లా నాయకుడు. సైనిక సిద్ధాంతకుడు. క్యూబన్‌ విప్లవంలో ప్రముఖ వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరును వాడుకుని యువతను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాదించారు పవన్‌.

తాను స్వతహాగా రాజకీయ యుద్ధంలో గెలవలేనని ముందుగానే తెలుసుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఏదో ఒక పార్టీతోనో, సమాజంలో మంచి పేరున్న వ్యక్తులతోనో కలిసి అడుగులు వేస్తూ తాను ఉన్నత శిఖరాలు అందుకోవాలని చూస్తున్న వారిలో ఒకరిగా చెప్పుకోవచ్చనే విమర్శ ఉంది. తాను పార్టీ పెట్టి నడిచిన పదేళ్లలో మొదట 2014లో మాయావతిని కలిసి ఆమె కాళ్లకు మొక్కారు. బిఎస్‌పీనే ఈ దేశానికి దిక్కని, మాయావతిని ప్రధాన మంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. నీలి కండువా వేసుకున్నారు.
అంబేద్కర్, పెరియార్‌ రామస్వామి కలిసి సంభాషించుకునే ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి వీరి వారసునిగా ఎదగాలని ఉందని చెప్పారు. వీరిద్దరూ కుల వివక్షను వ్యతిరేకించిన వారు. మత సామరస్యాన్ని కాపాడిన వారు. మానవత్వాన్ని మించిన మతం లేదని చాటిచెప్పిన వారు. వారి చివరి శ్వాస దాకా సామాజిక న్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వారు. వీరంటే నాకు ఇష్టం. లండన్‌ వెళ్లినప్పుడు హౌస్‌లో నేనే ఈ ఫొటో తీశానని 2017లో ట్వీట్‌ చేశారు. పెరియార్, అంబేద్కర్‌ భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానంటున్న పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు సనాతన ధర్మంపై ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ మొదలైంది. ఖమ్మంలో జరిగిన ఒక సభలో పవన్‌ మాట్లాడుతూ నాకు కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. మానవత్వమే నా మతం అని చాటి చెప్పారు. అవన్నీ ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు చోటు చేసుకున్నాయి.
ముస్లిమ్‌లను ఆకట్టుకునేందుకు మైనార్టీ టోపీ పెట్టకున్నారు. ముస్లిమ్‌లు నమాజ్‌ సమయంలో పైన వేసుకునే తువ్వాల, టోపీ అంటే నాకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తరువాత కమ్యూనిస్టులతో కలిసి కొంత కాలం ప్రయాణం చేశారు. ఎన్నికల్లో వారితో కలిసి పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. దీంతో పంథా మార్చారు. కమ్యూనిస్టులను వదిలేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు.
వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తానని ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబునాయుడు అరెస్ట్‌ అయిన సమయంలో జైలుకు వెళ్లి మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత పార్టీ క్యాడర్‌తో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎవరు వ్యతిరేకించినా పార్టీ నుంచి బయటకు పోవచ్చని, చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా మారు మాట్లాడకుండా పోటీ చేయాల్సి ఉంటుందని క్యాడర్‌ను ఒప్పించి ఎన్నికల్లో బీజేపీని కూడా కలుపుకుని వెల్లడంలో సక్సెస్‌ అయ్యారు. అప్పటికే ఆయన బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు ముందుకు రాకపోయినా టీడీపీతో కలిసి పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయాలనే ధృఢ నిశ్చయానికి పవన్‌ కళ్యాణ్‌ వచ్చారు.
ఎన్‌డీఏ కూటమి ఏపీలో గెలవడం, పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కావడం జరిగాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి ఒక్కటి కూడా పవన్‌ కళ్యాణ్‌ పరిష్కరించలేదు. సుగాలీ ప్రీతి గురించి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను పరిష్కరించే ఫస్ట్‌ కేస్‌ బాలికపై అత్యాచారం, హత్య కేసు అని చెప్పారు. అదేమైందో ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రీతి కేసు గురించి కనీసం గుర్తు కూడా ఉన్నట్లు లేదు. ఇంకా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం పెరిగి పోతూ ఉంది. ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడిచినా ఏపీపీఎస్సీకి చైర్మన్‌ను నియమించలేదు. ఇలా ఒకటేమిటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎంతో మంది వరద బాధితులకు పరిహారం, సాయం అందలేదు. వీటి గురించి మాట్లాడకుండా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడటంపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది.
తిరుపతి లడ్డూలో కల్తీనెయ్యి వాడారనే ఆరోపణలు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం, దానిని అంది పుచ్చుకున్న పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ వేషాలు మార్చి తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుని తిరుపతిలో వారాహి సభ పెట్టి డిక్లరేషన్‌ ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో ఆయన ప్రకటించింది ఒక్కటే. హిందూ మతానికి మించింది లేదని, సనాతన ధర్మం లేకుండా భారత దేశమే లేదని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇప్పటి వరకు దేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నది ప్రధాన మంత్రి మోదీ మాత్రమేనని, ఆయనను అనుసరిస్తూ దక్షిణ భారత దేశంలో మరో మోదీ కావాలని పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది. పైగా ఈ సభలో హిందూ మతం గురించి హిందువుగా పుట్టిన వారు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని, తాను పక్కాగా సనాతనీ అని చెప్పటం పలువురిని ఆశ్చర్య పరిచింది. పైగా ఆయన నాలుగు భాషల్లో మాట్లాడారు. ఈ భాషల్లో మాట్లాడితేనే దేశ ప్రజలకు అర్థమవుతుందన్నారు. తమిళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగుల్లో మాట్లాడుతూ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయగిరి స్టాలిన్‌పై విమర్శలు చేశారు. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం అనేది దేశానికి అరిష్టమని చెప్పటాన్ని పవన్‌ కళ్యాణ్‌ జీర్ణించుకోలేకపోయారు.
ఉన్నట్లుండి ఎంజీఆర్‌పై విపరీతమైన ప్రేమను చూపించారు. ఆయన ఫొటోను ట్వటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఎంజీఆర్‌ అంటే నాకు ఎంతో అభిమానమని, అలాగే పురుచ్చి తలైవీ అంటూ మాజీ సీఎం జయలలిత గురించి కూడా ప్రస్తావించారు. పైగా పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగానే తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. అంటే పక్కా వ్యూహంతోనే తాను అడుగులు వేస్తున్నారని, దేశ రాజకీయాల్లో కీ రోల్‌ పోషించాలంటే ఇదొక్కటే మార్గమని ఎంచుకున్నారనే చర్చ మొదలైంది. దేశంలో మెజారిటీ ఓటర్లు హిందువులే కాబట్టి వారి మనో భావాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వారి ఓట్లతో అధికారంలోకి రావొచ్చనే ఆలోచనతో పవన్‌ ఉన్నారనే చర్చ మొదలైంది. మావో ఆలోచనల నుంచి హిందూ మతం, సనాతన ధర్మం వరకు వచ్చారంటే పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ కోసం దేనికైనా వెనుకాడ బోడని అర్థమవుతోందని మేధావి వర్గం భావిస్తోంది.
Read More
Next Story