సీఎం రమేశ్ అభ్యర్థిత్వంపై పవన్‌కు అసంతృప్తి ఉందా..?
బీజేపీ-జనసేన మధ్య అనకాపల్లి సీటు చిచ్చు చల్లారలేదా.. సీఎం రమేష్ అభ్యర్థిత్వంపై పవన్ కూడా అసంతృప్తి ఉన్నారా? అనకాపల్లి సభలో పవన్ ఏమన్నారంటే..
టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరినా సయోధ్య కుదరలేదా? ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయా? అభ్యర్థుల విషయంలో పార్టీల్లో రేగిన చిచ్చు చల్లారలేదా? పార్టీ అధినేతలు కూడా అభ్యర్థుల విషయంలో అసంతృప్తిగా ఉన్నారా? అంటే అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమనే చెప్తున్నాయి. ‘వారాహి విజయభేరి’ సభలో భాగంగా పవన్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అనకాపల్లి స్థానం జనసేనదే అయినప్పటికీ బీజేపీ అధిష్టానం అభ్యర్థన మేరకు ఇక్కడ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌ను బలపరుస్తాం. ఆయన గెలుపుకు సహకరిస్తాం’’ అని జనసేన అన్నారు. దీంతో అనకాపల్లిలో సీఎం రమేష్ అభ్యర్థిత్వంపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. దాంతో పాటుగా అనకాపల్లి సీటు జనసేనదే అని మరోసారి ఆయన ప్రత్యేకంగా గుర్తు చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా అనకాపల్లి సీటు విషయంలో జనసేన, బీజేపీ మధ్య ఏకాభిప్రాయం లేదా? బీజేపీ గెలుపుకు జనసైనికులు సహకరించబోరా? అన్న సరికొత్త అనుమానాలకు పవన్ వ్యాఖ్యలు తావిస్తున్నాయి.
అనకాపల్లి సీటుపై రచ్చ
అనకాపల్లి సీటు మొదటి నుంచి కూడా హాట్‌సీట్‌గా ఉంది. జనసేన, బీజేపీ మధ్య ఈ సీటు విషయంలో అంతర్గతంగా మినీ వార్ నడిచింది. ఆ తర్వాత ఈ సీటు విషయంలో ఇరు పార్టీల అధిష్టానాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, అనకాపల్లి ఎంపీ సీటును బీజేపీకే కేటాయించడానికి జనసేన ఓకే చెప్పిందని పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ అప్పుడు చెలరేగిన చిచ్చు ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. సీఎం రమేష్ అభ్యర్థిత్వాన్ని జనసేన క్యాడర్ ఇప్పటికీ వ్యతిరేకిస్తోందని, దీంతో ఈ సీటు విషయంలో బీజేపీ, జనసేన కేటర్ల మధ్య ఇంకా అంతర్యుద్దం జరుగుతుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కానీ ఒక్కసారి ఓకే చెప్పాక సీటును వెక్కు తీసుకోలేనందునే సీఎం రమేష్‌కు మద్దతు ఇవ్వడానికి పవన్ అంగీకరించారని, ఇప్పటికి కూడా జనసేన కేడర్ మాత్రం సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా ఉందని అక్కడ వాతావరణం చెప్తోంది. అందుకే సీఎం రమేష్ ప్రచారాలకు కూడా జనసైనికులు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలో కేడర్‌ను కాదనలేక, పోత్తు ధర్మాన్ని వీడలేక పవన్ సతమతమవుతున్నారని, అందుకే అనకాపల్లి ప్రసంగంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
పవన్ పాటకు క్యాడెర్ అంగీకరిస్తుందా..
సీఎం రమేష్ అభ్యర్థిత్వంపై జనసేన అనకాపల్లి క్యాడర్ గుర్రుగా ఉందని సమాచారం. మరి అనకాపల్లి సభలో రమేష్‌ను బలపరుస్తామని, గెలుపుకు సహకరిస్తామని జనసేన అధినేత పవన్ ప్రకటించారు. ఇప్పుడు పార్టీ క్యాడర్ ఏం చేస్తుంది. పార్టీ అధినేత పవన్ మాటకు తలొగ్గుతుందా? లేదంటే అధినాయకుడిని ఎదిరిస్తుందా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అవేమీ క్యాడర్ చేయదని, తమకు తెలియనట్లు స్తబ్దుగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి క్యాడర్ ఆలోచన ఎలా ఉందో.
సీఎం రమేష్‌కు జనసేన ఓట్లు పడేనా..
ఈ నేపథ్యంలోనే త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు ఎవరి ఓట్లు పడినా జనసేన ఓట్లు పడతాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సీఎం రమేష్‌కు జనసేన ఓట్లు పడటం చాలా కష్టమని, వాళ్ల ఓట్లు పడాలి అంటే సీఎం రమేష్ చాలా తెలివిగా వ్యవహరిస్తూ ప్రచారంలో ముందుకు సాగాలని, జనసైనికులను కలుపుకుంటూ పోవడమే దారని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ సీఎం రమేష్ ఎంత చేసినా ఓ పది శాతం జనసైనికుల ఓట్లు పడతాయే తప్ప పూర్తిగా పడటం జరిగే పని కాదని, అందుకు పొత్తుపై మొదటి నుంచి ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత కూడా కారణాలవుతాయని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రమేష్‌కు టీడీపీ ఓట్లు కూడా డౌటే అని.. ఈ సీటు విషయంలో ఇరు పార్టీల మధ్య కూడా రచ్చ జరిగిన కారణంగా అక్కడ టీడీపీ అభ్యర్థులు, క్యాడెర్‌ను సీఎం రమేష్‌కు బాయ్ కాట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ మేధావులు. మరి రానున్న ఎన్నికల్లో మూడు పార్టీల పొత్తు అనకాపల్లిలో సీఎం రమేష్‌కు కలిస్తోందో.. రాదో చూడాలి.