చంద్రబాబు మెడకు నిమ్మగడ్డ ఫిర్యాదు..
x

చంద్రబాబు మెడకు నిమ్మగడ్డ ఫిర్యాదు..

వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేష్ చేసిన ఫిర్యాదు చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది. నిమ్మగడ్డ ఫిర్యాదును అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ సక్సెస్. తర్వాత పరిస్థితి ఏంటో..


కొన్ని రోజులుగా ఆంధ్ర రాజకీయాలు మొత్తం పెన్షన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య ఈ అంశంపై మినీ వార్ నడుస్తోంది. మాటల తూటాలతో ప్రత్యర్థులపై నిరంతరం దాడులు చేసుకుంటున్నారు. పెన్షన్లు ఆపించి అవ్వాతాతలను హింసిస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అని జగన్ అంటే.. నిధులు లేక పెన్షన్లు ఆపి తమపై నిందులు మోపుతున్నారని, వాలంటీర్లను తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే వాలంటీర్లు లేకుంటే పిన్షన్లు ఇవ్వలేమని సీఎం జగన్ చేతులెత్తేస్తున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అయితే ప్రభుత్వ పథకాల అమలుకు వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ. ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు చెందినది.

ఎవరీ నిమ్మగడ్డ రమేష్

2016లో చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికయ్యారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. జగన్ ప్రభుత్వంలో కూడా కొన్నాళ్లపాటు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన టీడీపీ అనుకూల వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు తీవ్రతరం కావడంతో ఆయనను కమిషనర్ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి వైసీపీ, నిమ్మగడ్డ మధ్య నిశ్శబ్ద యుద్ధం జరుగుతూనే ఉంది. సీఎం జగన్ కూడా ప్రెస్‌మీట్ పెట్టి నిమ్మగడ్డపై విమర్శలు చేశారు. చంద్రబాబు, నిమ్మగడ్డది ఒకే సామాజిక వర్గమని, నిమ్మగడ్డ కూతురు శరణ్యకు చంద్రబాబే.. ఆర్థిక అభివృద్ధి మండలిలో స్థానం కల్పించారని జగన్ ఆరోపించారు. సీఎం అయిన తర్వాత జగన్ నిర్వహించిన ఒకే ఒక మీడియా సమావేశం కూడా అదే.

అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి

అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రరాష్ట్రం మరోసారి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న వేళ వాలంటీర్లపై నిమ్మగడ్డ.. ఈసీకి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల మాదిరిగా ప్రచారం చేసే అవకాశం ఉందని, తద్వారా ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తుందని, అందుకని ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల విధులతో పాటు ప్రభుత్వ పథకాల అమలుకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఆ ఫిర్యాదుతో పాటు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. వాలంటీర్లను ప్రభుత్వ పథకాల అమలుకు దూరంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. దాంతో పిన్షన్లు ఆగిపోయాయి. అది పెద్ద సమస్యగా మారింది. ఆ తర్వాత పిన్షన్ల పంపిణీ పూర్తి చేయడానికి ఈసీ కొంత గడువును ఇచ్చింది. ఆ గడువు ముగియవస్తున్నా ప్రభుత్వంలో పెద్దగా చలనం లేదు. వాలంటీర్లు లేకుంటే ఇంటింటికీ పిన్షన్ ఎలా పంపిణీ చేస్తాం అని సీఎం జగన్ కూడా ప్రశ్నించారు. వృద్ధులు సచివాలయానికి వచ్చి పిన్షన్ తీసుకెళ్లాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సచివాలయానికి రాలేని వృద్ధులు, వికలాంగులకు ఇంటికి తీసుకెళ్లి పిన్షన్ ఇవ్వాలని ఈసీ వెల్లడించింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.

అయితే జగన్ నిధులు విడుదల చేయకపోవడం వల్లే పిన్షన్లు ఆలస్యం అవుతున్నాయని, నిధులను కాంట్రాక్టర్లను దోచిపెట్టి జగన్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పిన్షన్లపై వైసీపీ రాజకీయాలు చేస్తోందని, తమపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో తమపై చేసిన ఫిర్యాదును వైసీపీ తమకు అనుగుణంగా మార్చుకుంది. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఇంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, వాలంటీర్లపై ఫిర్యాదులు చేసి పిన్షన్లు ఆపించి అవ్వాతాతలను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతలో కొందరు పెన్షన్ దారులు మరణించారు. దానిపైన కూడా ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. శవరాజకీయాలు చేయొద్దంటూ ఆరోపించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘‘శవరాజకీయాలు జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తొలుత తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారు. ఆ తర్వాత బాబాయిని చంపించి రాజకీయం చేసి సీఎం అయ్యారు. అయినోళ్లనే పట్టించుకోని నీకు ఈ పెన్షన్ దారులు ఓ లెక్క’’అని చంద్రబాబు డైరెక్ట్ అటాక్ చేశారు.

ఎటు పోయి ఎటు వస్తుందో

వైసీపీని దెబ్బతీయాలని నిమ్మగడ్డ చేసిన ఫిర్యాదు ఇప్పుడు చంద్రబాబు మెడకే చుట్టుకుంటున్నట్లు పరిస్థితులను చూస్తే కనిపిస్తుంది. తమపై చేసిన ఫిర్యాదును తిప్పి ప్రత్యర్థిపైకే అస్త్రంలా మలచడంలో వైసీపీ అద్భుతమైన చతురతను కనబరిచింది. దాన్ని తిప్పికొట్టడానికే టీడీపీ ప్రయత్నాలు సరిపోతున్నాయి. దీంతో నిమ్మగడ్డ రమేష్.. టీడీపీకి ఫేవర్ చేయడానికి ఫిర్యాదు చేశారా? లేదంటే ఇరకాటంలో పడేయడానికా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి ఇది ఎటు పోయి ఎటు వస్తుందో చూడాలి.




Read More
Next Story