Mohanbabu mental condition|మోహన్ బాబు మానసికంగా డిస్ట్రబ్ అయ్యారా ?
చిన్నకొడుకు మనోజ్ తో పాటు మీడియా మీద ఆ ఫ్రస్ట్రేషన్ను చూపించారని అర్ధమైపోతోంది.
మంచు మోహన్ బాబు మానసికంగా డిస్ట్రబ్ అయ్యాడా ? జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే సందేహం పెరిగిపోతోంది. ఫ్యామిలి సమస్యల కారణంగా మానసికంగా బాగా డిస్ట్రబ్ అయినట్లే ఉన్నారు. సినీఫీల్డులో తాను చాలా పాపులర్ నటుడే అనటంలో సందేహంలేదు. అందుకనే మోహన్ బాబు(MohanBabu)కు అభిమానులు డైలాగ్ కింగ్ అనే బిరుదు కూడా ఇచ్చుకున్నారు. కొన్ని సినిమాల్లో హీరోగా వేసిన మోహన్ బాబు చాలా సినిమాల్లో విలన్ గా నటించాడు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా విలనే అన్న విషయం ఇపుడు స్పష్టంగా అర్ధమవుతోంది. సినీఫీల్డులో మోహన్ బాబు అత్యంత వివాదాస్పద వ్యక్తుల్లో ఒకడు. అందుకనే చాలామంది ఈ వివాదాస్పద నటుడితో పెట్టుకోకుండా తప్పుకుని పోతుంటారు. ఇపుడిదంతా ఎందుకు చెప్పుకోవల్సొచ్చిందంటే మీడియా మీద దాడిచేశారు కాబట్టే.
మాట్లాడాలి రమ్మని మంగళవారం రాత్రి తనమనుషుల ద్వారా మీడియాకు కబురుపంపించారు. ఫామ్ హౌస్ బయట వెయిట్ చేస్తున్న మీడియా మాట్లాడేందుకు రెడీ అయ్యింది. దూరం నుండే అందరికీ అభివాదం చేసుకుంటు దగ్గరకు వచ్చిన మోహన్ బాబు ఒక్కసారిగా రిపోర్టర్ దగ్గరున్న మైకును లాక్కుని దాడిచేశాడు(Attack on Media). దాంతో మీడియా మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. మోహన్ బాబు ఒక టీవీ రిపోర్టర్ మీద దాడిచేసిన ఘటన రికార్డయ్యింది. దాడిలో ఆ రిపోర్టర్ కంటికి చెవికి మధ్యన సున్నిత ప్రాంతంలో జైగోమ్యాటిక్ ఎముక మూడుచోట్ల విరిగినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనతోనే మోహన్ బాబు మానసికంగా బాగా దెబ్బతిన్నట్లు అర్ధమైపోతోంది. గడచిన నాలుగురోజులుగా కొడుకు మనోజ్, కోడలు భూమా మౌనికతో పెరిగిపోయిన గొడవలతో మోహన్ బాబు బాగా డిస్ట్రబ్ అయ్యారు. తమింట్లో గొడవలు ఏమీ జరగలేదని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలని స్వయంగా ఆయనే మూడురోజుల క్రితం అప్పీల్ చేశారు. అయితే అప్పటికే కొడుకు మీద ఇంట్లో తన సమక్షంలోనే మద్దతుదారుడు వినయ్, అనుచరులు దాడిచేశారు.
కొడుకు మీద తనముందే దాడి జరిగిన విషయాన్ని దాచిపెట్టి ఏమీ జరగలేదని బుకాయించారు. తర్వాత దాడికి గురైన మనోజ్(Manchu Manoj) ఆసుపత్రికి చేరుకుని చికిత్స చేయించుకోవటంతో ఇంట్లో దాడి జరిగిన విషయం వాస్తవమే అని అందరికీ తెలిసింది. దాంతో చేసేదిలేక గొడవలు అన్నీఇళ్ళల్లో సహజమే అని, తమింట్లో గొడవలు కూడా సర్దుకుంటాయని మరో ప్రకటన చేశారు. గొడవలు జరగటం, సర్దుబాటు చేసుకోవటం చాలా ఇళ్ళల్లో జరిగేదే అనటంలో సందేహంలేదు. అయితే గొడవలు జరిగినా, దాడిచేసి కొట్టుకున్న తర్వాత తమింట్లో ఏమీ జరగలేదని ఎవరూ బుకాయించరు. నాలుగుగోడల మధ్య ఏమి జరిగినా బయటప్రపంచానికి సంబంధంలేదు. ఎప్పుడైతే గొడవలు నాలుగుగోడలు దాటి రోడ్డున పడతాయో అప్పుడే అందరికీ తెలిసిపోతుంది. అందులోను సెలబ్రిటీల కుటుంబాల్లో వివాదాలు, గొడవలు, దాడులంటే జనాలకు కచ్చితంగా ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.
ఇంట్లో గొడవజరిగినట్లు మీడియాకు చెప్పిందే మనోజ్ తరపు మనుషులు. తనపైన తనింట్లోనే దాడి జరిగిందని మనోజ్ డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతోనే వివాదం రోడ్డుమీదపడింది. దాంతో విషయం మీడియాకు చేరింది. ఆ మంటే మోహన్ బాబులో బాగా కనబడుతోంది. ఇంట్లోని రచ్చను మనోజ్ రోడ్డుమీదకు లాగాడనే కోపం బాగా కనబడుతోంది. మనోజ్ మీద ఉన్న కోపాన్ని మోహన్ బాబు మీడియా మీద చూపించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సినిమాల్లో మోహన్ బాబు బాగా సక్సెస్ ఫుల్ పర్సనాలిటీయే. అయితే ఆయన సంతానం మంచు విష్ణు(Manchu Vishnu), మంచు లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi Prasanna), మంచు మనోజ్ పెద్దగా సక్సెస్ కాలేదు. తాము కూడా ఫీల్డులో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఉంటున్నారంతే. సొంత నిర్మాణసంస్ధ ఉన్నా, కొడుకులను పెట్టి సినిమాలు తీసినా పెద్దగా ఆడలేదు. ఫీల్డులో సంతానం పెద్దగా రాణించలేదన్న బాధ బాగా ఎక్కువగా ఉన్నట్లుంది. దానికితోడు ఆస్తుల పంపిణీ, విద్యాసంస్థల మీద పెత్తనం కోసం సోదరుల మధ్య మొదలైన గొడవలు బాగా పెద్దవి అయిపోయాయి. ఆ గొడవల ప్రభావం మోహన్ బాబు మీద కూడా పడటంతో పెద్దకొడుకుకు మద్దతుగా నిలిచాడు. దాంతో చిన్నకొడుకు మనోజ్, తల్లి వ్యతిరేకం అయినట్లు తెలుస్తోంది. విష్ణు, లక్ష్మీప్రసన్న మొదటి భార్య పిల్లలు కాగా మనోజ్ రెండోభార్య నిర్మల కొడుకు అన్న విషయం తెలిసిందే.
మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు, పెద్దకొడుకు విష్ణు ఒకటిగా, చిన్న కొడుకు మనోజ్, తల్లి మరో జట్టుగాను తయారైనట్లున్నారు. వీళ్ళమధ్య తరచూ గొడవలు జరగుతుండటంతోనే మోహన్ బాబు మానసికంగా దెబ్బతిన్నారు. దీనికి అదనంగా భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకోవటం కూడా మోహన్ బాబుకు ఇష్టంలేదని ఇప్పుడు బయటపడింది. ఉన్న సమస్యలకు అదనంగా ఇష్టంలేకపోయినా మౌనిక కోడలుగా రావటాన్ని మోహన్ బాబు తట్టుకోలేకపోయినట్లున్నారు. అన్నింటి ప్రభావంతో బాగా డిస్ట్రబ్ అయిన మోహన్ బాబు చిన్నకొడుకు మనోజ్ తో పాటు మీడియా మీద ఆ ఫ్రస్ట్రేషన్ను చూపించారని అర్ధమైపోతోంది. మొదటినుండి కూడా మోహన్ బాబు తత్వమే అంత. ఎవరిమీదపడితే వాళ్ళమీద నోరుపారేసుకోవటం, చేయిచేసుకోవటంతో బాగా వివాదాస్పదమైనట్లు ప్రచారంలో ఉంది. ఒకపుడు తిరుపతిలో టీడీపీ సీనియర్ నేత శంకర్ రెడ్డి మీద కూడా సహనటుడు శ్రీహరితో కలిసి మోహన్ బాబు దాడిచేసిన విషయం పెద్ద సంచలనమైంది. తమ కుటుంబంమీద ట్రోలింగ్ చేసినా, తమ సినిమాలు బాగా లేదని రివ్యూలు వచ్చినా మంచు కుటుంబం తట్టుకోలేందు. వెంటనే మీడియాను దూషించటం, మీడియా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగులు ఇవ్వటం చాలాసార్లు జరిగింది.
ఏదేమైనా తాజా పరిణామాలతో మోహన్ బాబు వివాదాల్లో ఇరుక్కున్నట్లే అనిపిస్తోంది. మోహన్ బాబును ఈరోజు 11 గంటలకు రాచకొండ కమీషనర్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులిచ్చారు. మరి హాజరవుతారో లేదో తెలీదు. ఎందుకంటే అనారోగ్యం పేరుతో మంగళవారం రాత్రి మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. ఇదే సమయంలో తండ్రి, కొడుకుల దగ్గరున్న లైసెన్సుడు రివాల్వార్లను వెంటనే సరెండర్ చేయాలని, బౌన్సలర్లను వెంటన బైండోవర్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరీ విషయంలో మోహన్ బాబు, కొడుకులు ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది.