ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కు ఇబ్బందేనా ?
x

ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కు ఇబ్బందేనా ?

తెలంగాణాకు ఎందుకు అన్వయించుకోవాలంటే కేసీఆర్ సమస్యల్లో మరింతగా కూరుకుపోతున్నారన్న విషయం అర్ధమవుతోంది కాబట్టే.


తాజాగా వెల్లడవుతున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒకచోట స్పష్టమైన క్లారిటి వచ్చేసింది. మరో చోట మ్యూజికల్ ఛైర్ లాగ ఒక్కో రౌండులో ఒక్కో పార్టీకి ఆధిక్యత కనబడుతోంది. పై రెండు రాష్ట్రాల ఫలితాలు ఎలాగున్నా వాటిని తెలంగాణాకు అన్వయించుకోక తప్పేట్లు లేదు. తెలంగాణాకు ఎందుకు అన్వయించుకోవాలంటే కేసీఆర్ సమస్యల్లో మరింతగా కూరుకుపోతున్నారన్న విషయం అర్ధమవుతోంది కాబట్టే. ఎలాగంటే చివరగా అందిన వార్తల ప్రకారం జమ్మూ-కాశ్మీర్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలోకి రావటం ఖాయమని తేలింది. అలాగే హైర్యానాలో బీజేపీ ఒకసారి కాంగ్రెస్ మరోసారి ముందంజలో ఉంటున్నాయి. ఇప్పటికైతే రెండు రాష్ట్రాల్లోను ఏ పార్టీ మందంజలో ఉన్నాయని మాత్రమే తెలుస్తోంది. కాకపోతే హర్యానాకు బాగా మెజారిటి కనబడుతోంది. ఇంకా అంతిమ ఫలితం తేలాలంటే మరింత సమయం పట్టేట్లుంది.

ఏ కోణంలో చూసుకున్నా పై రెండు రాష్ట్రాల ఎన్నికల్లో జమ్మూ-కాశ్మీర్ ఫలితం కాంగ్రెస్ కు ఊపునిచ్చేది అయితే మరో రాష్ట్రం హర్యానాలో బీజేపీ పట్టునిలుపుకుంటేదేమో చూడాలి. అంటే కాంగ్రెస్ పుంజుకుంటోందంటే ఇండియా కూటమి పుంజుకుంటున్నట్లే లెక్క. ఎలాగంటే ఇండియాకూటమికి కాంగ్రెస్ పార్టీయే నాయకత్వం వహిస్తోంది కాబట్టి. కాంగ్రెస్ ఖాతాలో కొత్తగా ఒక రాష్ట్రం చేరిందంటే ఆ మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకి నష్టమన్న విషయం అర్ధమవుతోంది. ఇపుడు పై ఫలితాలతో బీఆర్ఎస్ కు వచ్చిన సమస్య ఏమిటంటే భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఏదో కూటమిలో చేరక తప్పదు. జమిలి ఎన్నికలు 2029లో జరుగుతాయని కాదు కాదు 2026లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జమిలి ఎన్నికలు జరగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే.

కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా అయితే ఇండియా కూటమి లేదంటే ఎన్డీయేలో కేసీఆర్ తప్పకుండా చేరాల్సిందే. లేకపోతే రెండు కూటముల మధ్య పార్టీ మరింతగా దెబ్బతినటం ఖాయమనే సంకేతాలు కనబడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి సమర్ధవంతమైన నాయకత్వం లేకుండా పోయింది. కేసీఆర్ పేరుకు అధిపతే అయినా యాక్టివ్ గా లేరు. కొడుకు కేటీఆర్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా పార్టీ మీద పెద్దగా పట్టు సాధించలేదు. అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే 10 మంది ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు పార్టీని వదిలేశారు. చాలామంది ద్వితీయశ్రేణి నేతలు పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్న నేతలంతా అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీలో చేరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా గెలవకపోయేసరికి కేసీఆర్ నాయకత్వం మీద నేతల్లో నమ్మకం తగ్గిపోతోంది.

రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడైనా గెలిచినా కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒకటి లాగేసుకుంటాయనటంలో సందేహంలేదు. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ జవసత్వాలు కూడదీసుకోవాలంటే ఇండియా లేదా ఎన్డీయే కూటముల్లో ఏదో ఒకదానిలో చేరక తప్పదు. ఎందులోను చేరనంటే నష్టపోయేది పార్టీనే. అధికారంలో ఉన్నపుడు జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ చాలామాటలు చెప్పారు. ఢిల్లీలో చక్రంతిప్పేది తానే అని, రెండు కూటముల్లో ఎందులోను చేరకుండా మూడో కూటమిని ఏర్పాటు చేస్తానని, ప్రధానమంత్రి అయ్యేది తానే అని ఇలా చాలా చాలా చెప్పారు. చివరకు ఏమైంది ? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంటు ఎన్నికల్లో బొక్కబోర్లాపడ్డారు.

తొందరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియాకూటమి గెలుపు ఖాయమని జోస్యాలు పెరిగిపోతున్నాయి. జమ్మూ-కాశ్మీర్ ఎన్నిక కచ్చితంగా కాంగ్రెస్ కు బూస్టప్ గా పనిచేస్తుంది అనటంలో సందేహంలేదు. కాబట్టి ఇండియా కూటమిపైన కాంగ్రెస్ పట్టు పెరుగుతుంది అనటంలో సందేహంలేదు. మెల్లిగా ఒక్కో రాష్ట్రంలో గెలుస్తున్న ఇండియా కూటమిలో చేరటమా ? ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్నా ఇపుడు అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరటమా అన్నది కేసీఆర్ తేల్చుకోవాలి. ఇప్పటి పరిస్ధితిలో నిర్ణయం తీసుకోవటం కేసీఆర్ కు అంత ఈజీ అయితే కాదు. కష్టమే అయినా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పనిస్ధితి.

ఇపుడు సమస్య ఏమిటంటే ఇండియా కూటమిలో చేరితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ మంత్రివర్గంలో చేరితే కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త సంకీర్ణ ప్రభుత్వం అవుతుంది. అప్పుడు ఈ ప్రభుత్వంపై ధ్వజమెత్తేందుకు బీజేపీకి మంచి అవకాశం. ఒకవేళ ఎన్డీయేలో చేరితే బీఆర్ఎస్+బీజేపీలను ఏకకాలంలో ఎండగట్టడానికి కాంగ్రెస్ కు మంచి అవకాశం దక్కినట్లవుతుంది. తాము ఎప్పటినుండో చెబుతున్న విషయం నిజమైందని కాంగ్రెస్ పై రెండుపార్టీలపైన ధ్వజమెత్తుతుంది. రెండు కూటముల్లో ఎందులో చేరినా మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్నికల నాటికి కాస్త పుంజుకునే అవకాశమైతే ఉంది. మరి తాజా ఎన్నికల ఫలితాల నేపధ్యంలో కేసీఆర్ ఏమి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తిగా మారింది.

Read More
Next Story