ప్రభుత్వాన్ని జగన్ పరుగెత్తిస్తున్నాడా?
x
రాయలసీమలో హర్టీకల్చర్ పై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం

ప్రభుత్వాన్ని జగన్ పరుగెత్తిస్తున్నాడా?

రైతుల సమస్యలపై ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. మంగళవారం సీఎం చంద్రబాబు రాయలసీమ హార్టీకల్చర్ రైతులపై సమీక్ష, పల్నాడులో పత్తి రైతుతో అచ్చెన్నాడు మాటా మంతీ.


ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధిపై రూ.40 వేల కోట్ల ప్యాకేజీతో ఘనంగా సమీక్ష నిర్వహించగా అదే రోజు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పత్తి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులకు తక్షణ హామీలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బుధవారం వైఎస్ జగన్ కడప జిల్లాలో అరటి, పత్తి రైతుల సమస్యలను రాజకీయంగా ఆయుధంగా మలచి ప్రభుత్వాన్ని వీధుల్లో నిలబెట్టే పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు ముందస్తు రక్షణాత్మక వ్యూహంతో అడుగు వేసింది. రెండు ముఖ్య పంటల సమస్యలను ఒక్క రోజులోనే అధికారికంగా స్వయంగా పరిశీలించి జగన్ దాడికి ముందే రాజకీయ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించింది.

గుంటూరు పల్నాడు జిల్లాల్లో పత్తి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం పేరేచెర్ల, సత్తెనపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అకస్మాత్తు వర్షాలతో నాణ్యత దెబ్బతిన్న పత్తిని కొనుగోలు చేయడంలో సీసీఐ కఠిన నిబంధనలు అడ్డంకిగా నిలిచాయనే ఫిర్యాదులు రైతుల నుంచి వచ్చాయి. తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని తిరస్కరించడం L1 నుంచి L4 వరకు కొత్త గ్రేడింగ్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


పత్తి రైతుతో మాట్లాడి తేమశాతం ఉన్న పత్తిని పరిశీలిస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

ఈ సమస్యలను పరిశీలించిన మంత్రి ప్రతి కిలో పత్తి కొనుగోలు అయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు. కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి రామ్మోహన్ నాయుడు సీసీఐ అధికారులతో నేరుగా మాట్లాడి నిబంధనల సడలింపుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అదనపు మిల్లులు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని సీసీఐ ఎండీ హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. 12 శాతం నుంచి 18 శాతం వరకు తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ఉద్యానవన రంగ అభివృద్ధిపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నిజానికి మంగళవారం షెడ్యూల్ లో రాయలసీమ ఉద్యాన పంటలపై సమీక్ష లేదు. అయినా పూర్వోదయ నిధులతో రూ. 40 వేల కోట్ల వ్యయంతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 92 క్లస్టర్ల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. మైక్రో ఇరిగేషన్ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ ఎయిర్ కార్గో సౌకర్యాలతో దుబాయ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు సీమ ఉత్పత్తులను అందించే అవకాశం ఉంటుందని సీఎం చెప్పటం విశేషం.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రభుత్వం రెండు ముఖ్య పంటల సమస్యలపై ఒక్కరోజులోనే చురుకైన చర్యలు చూపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొహన్ రెడ్డి బుధవారం కడప జిల్లాలో అరటి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ధరల పతనం, పత్తి కొనుగోలు ఆంక్షలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న నేపథ్యంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ముందస్తుగానే స్పందించినట్లు స్పష్టమవుతోంది. రైతుల సమస్యలను రాజకీయ ఆయుధంగా మారనీయకుండా వెంటనే పరిష్కార మార్గాలు చూపడం ద్వారా ప్రభుత్వం తన సత్వర స్పందనను రైతులు చూసేలా చేసింది.

Read More
Next Story