అన్నను ఇరికించటానికేనా?
x

అన్నను ఇరికించటానికేనా?

అన్నను ఇరికించడానికి వైఎస్ షర్మిల ప్లాన్ వేసిందా? ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అదేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎత్తులకు పై ఎత్తుల్లో సాగుతున్నాయి. ఎవరికి వారు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారనేది నిజం. బయటకు కనిపించకపోయినా వాస్తవంలో రాజకీయ శత్రువును ఎక్కడో ఒకచోట ఇరికించడానికి ప్లాన్ లు వేస్తుంటారు. ఆ ప్లాన్ లు ఒక్కోసారి సక్సెస్ అవొచ్చు, కాక పోవొచ్చు. అయినా ప్లాన్లు మాత్రం ఆగవు. అటువంటి ప్లాన్ ఏమైనా వైఎస్ షర్మిల వేసిందా? తన అన్నను ఎన్నికల కమిషన్ వద్ద దోషిని చేయాలనే ఆలోచన ఏమైనా చేసిందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

కడప లోక్ సభ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఈనెల 20న ఆమె కడపలో నామినేషన్ దాఖలు చేశారు. షర్మిల ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తన అన్న, సీఎం జగన్‌కు షర్మిల రూ. 82 కోట్ల బాకీ ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై 8 కేసులున్నట్లు, వాటిల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ఉన్నట్టు షర్మిల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆమె మొత్తం ఆస్తులు రూ. 182.82 కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. వీటిలో రూ. 82,58,15,000లు తన సోదరుడు సీఎం జగన్ వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిపారు. తన వదిన వైఎస్ భారతీరెడ్డి వద్ద రూ.19,56,682లు అప్పు తీసుకున్నట్లు షర్మిల పేర్కొన్నారు. వీటిని తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. ఏడాదికి తన ఆదాయం రూ. 97,14,213గా ఉందని షర్మిల అఫిడవిట్‌లో తెలిపారు. షర్మిల భర్త అనిల్ కుమార్ ఆదాయం రూ. 3,00,261 మాత్రమేనని తెలియజేశారు.

షర్మిల తన ఆస్తుల విలువ చెబుతూ అన్నవద్ద తీసుకున్న అప్పునే భారీగా చూపించారు. అన్న ఆస్తుల రూపంలో ఇచ్చారా? దేనికోసం ఇచ్చారనేది మాత్రం లేదు. షర్మిల మాత్రం తిరిగి చెల్లించాలని అఫిడవిట్లో స్పష్టం చేశారు. జగన్ ఈనెల 25న నామినేషన్ దాఖలు చేస్తారు. అందులో షర్మిలకు ఇచ్చిన అప్పు గురించి ప్రస్తావిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంటుంది. చెల్లికి ఇచ్చిన అప్పు గురించి ప్రస్తావించకుంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎన్నికల కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. షర్మిల అప్పుగా తీసుకున్న వివరాలు ఆమె వద్ద ఉండి ఉంటాయి. ఆ వివరాలు బయటపెట్టి అన్నను ఇరికించి నామినేషన్ చెల్లకుండా చేసే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది. ఇదే అస్త్రంగా దొరికినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అన్న కూడా తప్పు చేస్తాడని చెప్పుకునేందుకు మంచి అవకాశం దొరుకుతుందని ఆమె ఆలోచన చేసి వుండొచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read More
Next Story