
గుజరాత్ మోడల్లో తెలంగాణ కాంగ్రెస్ బలోపేతం సాద్యమేనా ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్ధాయి నుండి బలోపేతంచేయటానికి పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కంకణం కట్టుకున్నట్లున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్ధాయి నుండి బలోపేతంచేయటానికి పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కంకణం కట్టుకున్నట్లున్నారు. ఇన్చార్జిగా నియమితులైన తర్వాత రాష్ట్రంలోని అనేక పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమీక్షచేశారు. సమీక్షల్లో పార్టీ బలాలు ఏమిటి ? బలహీనతలు ఏమిటి ? గ్రామీణస్ధాయి నుండి హైదరాబాద్ వరకు పార్టీ పరిస్ధితి ఏమిటనే విషయమై సమాచారం సేకరించారు. పార్టీ ఆఫీసు గాంధీభవన్లో గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు పార్టీని గుజరాత్ మోడల్లో బలోపేతంచేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.
గుజరాత్(Gujarat) లో బీజేపీ గ్రామస్ధాయి నుండి బలంగాఉన్న విషయాన్ని గుర్తుచేశారు. గుజరాత్ కాంగ్రెస్(Gujarat Congress) తరహాలో తెలంగాణ(Telangana)ను పార్టీ బలోపేతంచేయటానికి ప్రత్యేకంగా ఏమీలేదు. ఎందుకంటే గుజరాత్ లో దాదాపు పాతికేళ్ళుగా కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతంచేయటం బీజేపీ తరహాలోనే అని అర్ధమవుతోంది. గుజరాత్ లో బీజేపీ గ్రామస్ధాయి నుండి చాలాబలంగా ఉంది. గ్రామ, మండల, జిల్లాస్ధాయిలో కష్టపడి పనిచేసే నేతలను గుర్తించి అలాంటి వారికి పార్టీతో పాటు ప్రభుత్వ పధవుల్లో టాప్ ప్రయారిటి ఇస్తోంది. కష్టపడినవారికి పార్టీ, ప్రభుత్వంలో గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం ఉండటంతోనే కమలంపార్టీ నేతలు పార్టీ కోసం కష్టపడుతున్నారు. అందుకనే అప్రతిహతంగా బీజేపీ ఎన్నికల్లో గెలవగలుగుతోంది.
అదేపద్దతిలో తెలంగాణ కాంగ్రెస్ ను కూడా బలోపేతంచేయాలని మీనాక్షి(Meenakshi Natarajan) చెప్పారు. అందుకనే ప్రతిజిల్లాకు ఒక పరిశీలకుడిని నియమించబోతున్నట్లు చెప్పారు. ఈపరిశీలకుడు జిల్లా అంతా తిరిగి నేతలు, క్యాడర్ ను కలిసి పార్టీ పరిస్ధితి, ప్రభుత్వ పథకాల అమలుపై అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని చెప్పారు. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు, ఓటమిలో కీలకపాత్ర పోషించిన అంశాలు ఏమిటి ? గెలుపుకు పనిచేసిన నేతలెవరు ? ఓడిన నియోజకవర్గాల్లో నేతలపాత్ర ఏమిటనే విషయాలపై ఇఫ్పటికే మీనాక్షి కొంత సమాచారాన్ని సేకరించారు. పరిశీలకులు కూడా పైఅంశాలపై పూర్తిస్ధాయి సమాచారాన్ని సేకరించబోతున్నట్లు తెలిపారు. పరిశీలకులు తీసుకున్న ఫీడ్ బ్యాక్ ను మీనాక్షి తీసుకుని రేవంత్ రెడ్డి(Revanth), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh) తో చర్చిస్తారు.
ఆ తర్వాత పార్టీ, ప్రభుత్వంలో పదవులను పంపిణీ చేయబోతున్నారు. ఇందులో గ్రామ, మండల, జిల్లాస్ధాయిలో బాగా పనిచేసిన నేతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ఇన్చార్జి చెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలకన్నా కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని మీనాక్షి గట్టిగా నమ్ముతున్నారు. కార్యకర్తలు, మండల, జిల్లానేతలు కష్టపడి పనిచేయకపోతే ఎంఎల్ఏలు, ఎంపీల గెలుపుతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చుండేదికాదన్నది మీనాక్షి అభిప్రాయం. అందుకనే పదవుల పంపిణీలో మొదటి ప్రాధాన్యత కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలకే ఉండాలని మీనాక్షి గట్టిగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో కూడా చెప్పారు. కార్యకర్తలు కమిటెడ్ గా, బలంగా ఉన్నపుడే పార్టీకి విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. అందుకనే గుజరాత్ లో బీజేపీ మోడల్ నే తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి అప్లై చేయబోతున్నట్లు మీనాక్షి నటరాజన్ చెప్పారు. మరి తనప్రయత్నంలో మీనాక్షి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.