
తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి సంస్కరణలు సాధ్యమేనా ?
పార్టీ బలోపేతానికి మీనాక్షి ప్రకటించిన విధానాలు చాలామంది సీనియర్ నేతలకు మింగుడుపడటంలేదు
దేశంలోని అన్నీ రాజకీయపార్టీల్లోకి కాంగ్రెస్ పార్టీ రూటే సపరేటు. ఎందుకంటే ఈ పార్టీ నూరుశాతం ప్రజాస్వామ్యంతో నడుస్తుంది. తమపార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తాయని ఆయాపార్టీల నేతలు చెప్పుకోవటమే కాని నడవవు. కాని కాంగ్రెస్ లో మాత్రం గ్రామస్ధాయి నుండి ఏఐసీసీ వరకు పూర్తి ప్రజాస్వామ్యంతో నడుస్తుంటుంది. అందుకనే ఈ పార్టీలోకి ఎవరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను, అధినేతలను తిట్టినవారు కూడా తర్వాత పార్టీలో చేరి పదవులు అనుభవించవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే(Revanth). టీడీపీలో ఉన్నపుడు సోనియాగాంధీ(Sonia Gandhi)ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన సంగతి అందరికీ తెలుసు. అలాంటి రేవంత్ టీడీపీ(TDP)కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగానే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత పీసీసీ అధ్యక్షుడై ఇపుడు ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు.
ఇపుడు ఇదంతా ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కు ఇన్చార్జిగా మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) వచ్చారు. ఇన్చార్జిగా మీనాక్షిని వేసినపుడు అందరు హర్షించారు. ఆమె చాలా సింపుల్ గా ఉంటారని, పార్టీ బలోపేతం తప్ప ఆమెకు వేరే అజెండా ఏమీలేదని కూడా అన్నారు. సమావేశాల్లో ఆమె వైఖరి, వ్యక్తిత్వం చాలామంది నేతలను ఆకట్టుకుంది. అయితే ఎప్పుడైతే ఆమె పార్టీ బలోపేతానికి సంస్కరణలు మొదలుపెట్టారో చాలామంది నేతలు పెదవి విరుస్తున్నారు. కారణం ఏమిటంటే పార్టీ బలోపేతానికి మీనాక్షి ప్రకటించిన విధానాలు చాలామంది సీనియర్ నేతలకు మింగుడుపడటంలేదు. ఇంతకీ ఆమె చెప్పిన సంస్కరణలు ఏమిటి ?
ఏమిటంటే గ్రామ, మండల, బ్లాక్, జిల్లా స్ధాయిలో పార్టీ అధ్యక్షపదవులు అందుకునే నేతల వయసు 65 ఏళ్ళ లోపుండాలి. 2017 నుండి పార్టీలో ఉన్న నేతలకే పదవుల్లో టాప్ ప్రయారిటి అన్నారు. పార్టీ బలోపేతానికి, పార్టీనే నమ్ముకున్న నేతలకు మాత్రమే పదవుల పంపిణీలో ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నేతలంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నేతలు పనిచేసినట్లుగా గ్రాస్ రూట్లో పనిచేయాలని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కిందస్ధాయి నుండి బలపడాలంటే గుజరాత్ బీజేపీ(Gujarat BJP) తరహాలో సంస్కరణలు అమలుచేయాల్సిందే అని గట్టిగా చెప్పారు. పార్టీ బలోపేతానికి మీనాక్షి చెప్పిన విధానాల్లో ఎలాంటి తప్పులేదు. అయితే కష్టపడి పనిచేసే లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఎంతముందున్నారు ? పార్టీబలోపేతానికి 24 గంటలూ, 365 రోజులు గ్రామాల్లో తిరుగుతు కష్టపడటానికి కాంగ్రెస్ నేతలకు ఏమన్నా పిచ్చా ? పార్టీబలోపేతానికి కష్టపడిపనిచేసిన నేతలకే పదవులు, భవిష్యత్తులో టికెట్లని మీనాక్షి చెప్పేస్తే సరిపోతుందా ?
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మీనాక్షితో సంబంధంలేకుండానే అధిష్టానంతో మాట్లాడుకుని పదవులు, టికెట్లు తెచ్చుకోగలిగిన నేతలు చాలామందున్నారు. ఇప్పటివరకు సీనియర్ నేతల్లో చాలామంది పదవులు, టికెట్లను అలా తెచ్చుకున్న వాళ్ళే. ఇందుకు తాజా ఉదాహరణ విజయశాంతే. పార్టీబలోపేతానికి విజయశాంతి పడిన కష్టమేమీలేదు. ఈమెకు సినీనటి అనే గుర్తింపుతప్పితే రాజకీయనేతగా ఉన్న గుర్తింపు చాలాతక్కువ. పార్టీ కోసం పడిన కష్టమేమీలేదు సరికదా అసలు పార్టీలో పనిచేసింది కూడా చాలా తక్కువనే చెప్పాలి. పార్టీకోసం కష్టపడిన చాలామంది సీనియర్లను కాదని ఈమధ్యనే ఎంఎల్ఏ కోటాలో భర్తీ అయిన ఎంఎల్సీల్లో విజయశాంతికి(Vijaya Santi) అవకాశం ఎలాగ దక్కింది ? ఈమె పేరును పీసీసీ స్క్రీనింగ్ కమిటి సిఫారసుచేయలేదు. పోనీ రేవంత్ ఏమన్నా రికమెండ్ చేశారా అంటే అదీలేదు. ఎవరూ రికమెండ్ చేయకుండానే, పార్టీకోసం కష్టపడకుండానే విజయశాంతికి ఎంఎల్సీ పదవి ఎలాగవచ్చింది ? అదే కాంగ్రెస్ పార్టీలోని బ్యూటి. ఈ విషయం మీనాక్షికి తెలియందికాదు.
ఇపుడు విషయం ఏమిటంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు చాలా కారణాలున్నాయి. మొదటిది బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)ల్లో నుండి కొందరు గట్టినేతలు హస్తంపార్టీలో చేరారు. వాళ్ళు చేరినపుడు పీసీసీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ కొన్ని హామీలిచ్చాడు. ఇపుడా హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ మీదుంది. కొందరికి మంత్రిపదవులు, మరికొందరికి పార్టీ పదవులు, ఇంకొందరికి కాంట్రాక్టులు, ఇంకా కొందరికి అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపేసిన కోట్లాదిరూపాయల బిల్లుల మంజూరు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఇతరపార్టీల నుండి చివరినిముషంలో చేరిన చాలామంది నేతల కృషిని కాదనలేరు. అలాగే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలన్న రేవంత్ వ్యూహంలో భాగంగా 10 మంది ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఫిరాయింపులో భాగంగా వారందరికీ రేవంత్ ఎన్నో హామీలిచ్చాడు. ఇపుడా హామీలను నెరవేర్చాల్సిన అవసరం సీఎం మీదుంది.
సడెన్ గా పార్టీ ఇన్చార్జి హోదాలో మీనాక్షి ఏవేవో సంస్కరణలు, విధానాలను ప్రవేశపెడుతుంటే ఇలాంటి సీనియర్ నేతలు, ఫిరాయింపు ఎంఎల్ఏలు చూస్తూ ఊరుకోరు. తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ మీద బాగా ఒత్తిడి తేవటం ఖాయం. ఇలాంటి వారంతా మీనాక్షి సంస్కరణలు అమలుచేస్తామంటే అంగీకరించరు. ముందు తమకిచ్చిన హామీలను నెరవేర్చి తర్వాత సంస్కరణలు అమలుచేసుకోమంటారు. ఇతర పార్టీల నుండి వచ్చిన సీనియర్ నేతలు, ఫిరాయింపు ఎంఎల్ఏలు, ఎంఎల్సీల మద్దతుదారులకు ప్రభుత్వంలో పదవులు, పార్టీపదవులు, కాంట్రాక్టుల్లో ప్రయారిటి ఇవ్వక రేవంత్ కు వేరేదారిలేదు. పార్టీ బలోపేతం, సంస్కరణలని మీనాక్షి చెబితే రేవంత్ కు కూడా నచ్చదు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చినపుడు మీనాక్షి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. ఇపుడు మీనాక్షి చెబుతున్న సంస్కరణలు, బలోపేతానికి విధానాలు ఏవీ లేకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీనాక్షి సంస్కరణలగురించి మాట్లాడుతుంటే చాలామందికి నచ్చటంలేదు. అందుకనే మీనాక్షి వ్యవహారశైలిపైన కొందరు సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
పార్టీలో సంస్కరణలు, బలోపేతం పేరుతో సీనియర్లను, ఇతర పార్టీలనుండి వచ్చిన బలమైననేతలను పక్కనపెట్టేస్తామంటే కుదరదు. పట్టువిడుపు లేకుండా పిడుగుకు, బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా గట్టిగా పట్టుబడితే చివరకు అందరు సీనియర్లు కలిసి మీనాక్షిని మార్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి మీనాక్షి నటరాజన్ మార్క్ సంస్కరణలు కాంగ్రెస్ పార్టీలో ఏమేరకు వర్కవుటవుతాయో చూడాల్సిందే.