రేవంత్ కొరియన్ మ్యాజిక్ నేర్చుకోగలడా?
x

రేవంత్ కొరియన్ మ్యాజిక్ నేర్చుకోగలడా?

చంగ్ యే చున్ నది సుందరీకరణకు మూసీనది పునరుజ్జీవనానికి మధ్య తేడాలు, రాజకీయ ప్రతిబంధకాలు, పాలకుల చిత్తశుద్ది, ఆర్ధిక పరిస్ధితి తదితరాలపై చర్చలు జరుగుతున్నాయి.


దక్షిణ కొరియా సియోల్ నగరంలోని చంగ్ యే చున్ నదిలాగ మూసీనది పునరుజ్జీవనం సాద్యమేనా ? ఇపుడీ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతోంది. దీనికి కారణం ఏమిటంటే సియోల్ లోని చంగ్ యే చున్ నది సుందీరకరణను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇద్దరు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీ, ఉన్నతాధికారులు, మీడియా బృందం అక్కడ పర్యటిస్తోంది కాబట్టే. అక్కడ పర్యటిస్తున్న మీడియా బృందం చంగ్ యే చున్ నది సుందరీకరణపై ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందుకనే సియోల్ లోని చంగ్ యే చున్ నది సుందరీకరణకు మూసీనది పునరుజ్జీవనానికి మధ్య తేడాలు, రాజకీయ ప్రతిబంధకాలు, పాలకుల చిత్తశుద్ది, ఆర్ధిక పరిస్ధితి తదితరాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.



ముందుగా చంగ్ యే చున్ నదిని పరిశీలిస్తే సియోల్ ప్రజలకు ఒకపుడు మంచినీటిని అందించిన చంగ్ యే చున్ తర్వాత్తర్వాత మురికినదిగా మారిపోయింది. ఏ స్ధాయిలో మురికినదిగా మారిందంటే దానికన్నా మూసీనే నయం అన్నట్లుగా. అలాంటి చంగ్ యే చున్ నదిని అక్కడి పాలకులు మళ్ళీ మంచినీటి నదిగా ఎలా మార్చగలిగారు ? అందుకు వాళ్ళుపడిన కష్టమేంటి ? ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? చంగ్ యే చున్ నది హ్యాన్ నదికి ఉపనది. చంగ్ యే చున్ కూడా సియోల్ నగరం మధ్యలోనే ప్రవహిస్తుంది. 493 కిలోమీటర్ల పొడవున్న హ్యాన్ నదిలో సియోల్ లో ప్రవహిస్తున్న చంగ్ యే చున్ నది పొడవు సుమారు 11 కిలోమీటర్లు మాత్రమే.



ఈ నదిని ప్రక్షాళన చేయటానికి అక్కడి పాలకులు చాలా కష్టాలే పడ్డారు. అక్కడి నదికి రెండువైపులా ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించేముందు జనాల నుండి పెద్దఎత్తున వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయితే స్ధానికులతో అధికారులు ఒకటికి పదిసార్లు సమవేశమై కౌన్సిలింగ్ చేశారు. చంగ్ యే చున్ నది ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళబోయేవారికి ఇంతకన్నా మెరుగైనా పునరవాసం కల్పిస్తామని అధికారులు హామీలిచ్చారు. పాలకులు హామీలివ్వటమే కాకుండా ఆచరణలో చూపించారు. అయిష్టంగానే బాధితులు చంగ్ యే చున్ నది దగ్గరనుండి వెళ్ళిపోయినా రెండేళ్ళ తర్వాత మారిపోయిన నది రూపురేఖలను చూసిన తర్వాత ముందు ఆశ్చర్యపోయి తర్వాత పాలకులను అభినందించారు. 2003 అక్టోటర్ 1వ తేదీన ప్రారంభమైన ప్రక్షాళన కార్యక్రమం 2005 అక్టోబర్ 1వ తేదీతో పూర్తయ్యింది.



బాధితులను ఖాళీచేయించిన పాలకులు ముందు నదిలోని నీటిలోకి బయట నుండి మురికినీరు, వ్యర్ధాలు, రశాయనాలు రాకుండా అడ్డుకున్నారు. నదిపైన సూవేట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేశారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. కొన్ని నెలలపాటు 24 గంటలు మురికినీటిని శుద్ధి చేస్తునే ఉన్నారు. ఒకవైపు చంగ్ యే చున్ నీటిని శుద్దిచేస్తునే మరోవైపు హ్యాన్ నదిలోని నీటిని చంగ్ యే చున్ నదిలోకి విడిచిపెట్టారు. కొద్ది నెలల పాటు హ్యాన్ నదినుండి చంగ్ యే చున్ నదిలోకి మంచినీరు మాత్రమే పారింది. పొల్యూషన్ కంట్రోల్ అధికారులు రెగ్యులర్ గా నీటిని పరిశీలించి నీటిశుద్దిని గమనించారు. చంగ్ యే చున్ నదిలో కలుషితాలు, రశయనాలు ఏవీలేవని నిర్ధారించుకున్నారు. తర్వాత కూడా రెండు మూడునెలలు మంచినీటిని వదులుతునే ఉన్నారు. మళ్ళీ, మళ్ళీ నీటి నాణ్యతను పరిశీలించి పూర్తిగా సంతృప్తి పడిన తర్వాతే సుందరీకరణ పనులు మొదలుపెట్టారు. అన్నీ దశలను పూర్తిచేసి చంగ్ యే చున్ నదిని అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దటానికి పాలకులకు సుమారు 20 ఏళ్ళు పట్టింది. నది ప్రక్షాళనకు మాత్రమే పాలకులకు రెండేళ్ళు పట్టడంతో పాటు సుమారు రు. 2500 కోట్లు ఖర్చయ్యింది.



నదిలోని నీరంతా మంచి నాణ్యతతో ఉన్నట్లు సర్టిఫై చేసుకున్న తర్వాత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పాలకులు పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్(పీపీపీ) పద్దతిని పాటించారు. పాలకుల కష్టానికి, స్ధానికుల సహకారం తోడవ్వటంతో ఇపుడు చంగ్ యే చున్ నది ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా రికార్డయ్యింది. ఈ నదిని చూడటానికి ఏడాదికి 2 కోట్లమంది వస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నదికి రెండువైపులా ఉన్న నిర్వాసితులను ఖాళీ చేయించటానికి బాధితులు-పాలకులు-అధికారులు మధ్య మాత్రమే చర్చలు జరిగాయి. ప్రతిపక్షాల పాత్ర ఏమీలేదు. ఇన్ని వేల కోట్లతో నదిని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రాజెక్టులో రూపాయి అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎక్కడా వినబడలేదు. స్ధానికుల సహకారం, పాలకులు, యంత్రాంగం చిత్తుశుద్దికి ఈ ప్రాజెక్టు నిదర్శనం.



ఇక మూసీనది గురించి ఆలోచిద్దాం. వికారాబాద్ లో మొదలయ్యే మూసీనది నల్గొండ జిల్లాలో అంతమైపోతుంది. మధ్యలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నది 57 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మూసీ కూడా ఒకపుడు మంచినీటి నదిగానే ఉన్నా తర్వాత పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా మురికికూపంగా మారిపోయింది. దశాబ్దాలుగా మూసీనది మురికినదిగానే ఉంది. బీఆర్ఎస్ హయాంలో నదిని ప్రక్షాళనచేయటానికి మూసీనది రివర్ ఫ్రంట్ బోర్డును ఏర్పాటు చేసి కొంత పనులు జరిపారు. అయితే పాలకులపై అన్నీవైపుల నుండి వచ్చిన ఒత్తిళ్ళ కారణంగా పనులను నిలిపేశారు. దాంతో మూసీ ప్రక్షాళన పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవటమే కాకుండా ఆక్రమణలు మరింత పెరిగాయి.



2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మూసీనది ప్రక్షాళన కార్యక్రమం మళ్ళీ తెరపైకి వచ్చింది. రేవంత్ ప్రకటన రాగానే నదికి రెండువైపులా ఇళ్ళల్లో ఉంటున్న వారు, ఆక్రమణదారులు, వ్యాపారస్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరికి ప్రతిపక్షాలు మద్దతుగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింతగా రెచ్చగొడుతున్నాయి. ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చగొడుతున్నా, బాధితులు ఎంత గోలచేస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం మూసీనది పునరుజ్జీవనానికి గట్టిగా నిలబడ్డారు. ఇందులో భాగంగానే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీ, ఉన్నతాధికారులు, మీడియా బృందాన్ని నాలుగురోజుల సియోల్ పర్యటనకు పంపించారు. ఈ బృందం సియోల్ కు వెళ్ళి సాధించేది ఏముంటుంది ?




నిజానికి ఈ బృందం సియోల్ కు వెళ్ళి చేసేది ఏమీలేదని అందరికీ తెలిసిందే. అయినా సరే ప్రతిపక్షాల ఎంఎల్ఏలను కలిపి పెద్ద బృందాన్ని సియోల్ కు పంపాలని అనుకున్నారు పంపించారంతే. కాకపోతే ప్రతిపక్షాల ఎంఎల్ఏలు లేకుండానే బృందం సియోల్ వెళ్ళింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంగ్ యే చున్ నదిని సుందరీకరించినట్లుగా మూసీ పునరుజ్జీవనం చేయటం సాధ్యమేనా ? ఎందుకంటే సియోల్ లో రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలకు మన దగ్గర వ్యవహారాలకు చాలా తేడా ఉంటుంది. దక్షిణకొరియాలోని పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ది, అంకితభావం, పారదర్శకత మన పాలకులు, యంత్రంగం నుండి ఊహించగలమా ? అలాగే ప్రతిపక్షాల సహకారం ఆశించగలమా ?



మనదగ్గర ఏదైనా ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రకటన చేయగానే ముందుగా వినిపించేది అవినీతి ఆరోపణలే. ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయటమే కాకుండా బాధితులను వ్యతిరేకంగా రెచ్చగొడతాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపైన ప్రభుత్వం-ప్రతిపక్షాలు-బాధితుల మధ్య ఏమి జరుగుతోందో అందరం చూస్తున్నదే. ప్రాజెక్టును రేవంత్ అలా ప్రకటించారో లేదో వెంటనే రు. 25 వేల కోట్ల అవినీతంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలతో రెచ్చిపోయారు. దీనికి కారణం రేవంతే అని చెప్పకతప్పదు. ప్రాజెక్టు గురించి ఉన్నతాధికారులతో మార్చి 9వ తేదీన సమీక్షలో మాట్లాడుతు మూసీ ప్రాజెక్టును లక్షన్నర కోట్లతో చేపడుతున్నట్లు చెప్పారు. రేవంత్ చెప్పిన లక్షన్నర కోట్లను పట్టుకుని కేటీఆర్ రు. 25 వేల కోట్ల అవినీతంటు నానా గోల చేస్తున్నారు.



తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రతిపక్షాలు పోటీపడి మరీ బాధితులను ప్రభుత్వంపైకి రెచ్చగొడుతున్నాయి. దీంతో ప్రాజెక్టు ఎంత కంపవుతోందో అంతగా అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఒకపుడు ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని చెప్పిన రేవంత్ ఇపుడు తాను లక్షన్నర కోట్లని చెప్పలేదని బుకాయిస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేయటానికి ప్రతిపక్షాలకు రేవంతే అవకాశం ఇచ్చినట్లయ్యింది. ఈ గందరగోళంలోనే సుమార 100 మంది బాధితులు కోర్టుకెళ్ళి తమ ఇళ్ళను కూల్చకుండా స్టే తెచ్చుకున్నారు. మూసీ ప్రక్షాళన పనులు మొదలవ్వాలంటే నదికి రెండువైపులా 50 మీటర్ల విస్తరించాలి. ఇది జరగాలంటే సుమారు 15 వేల నిర్మాణాలను తొలగించాల్సుంటుంది.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంగ్ యే చున్ నది ప్రక్షాళన ప్రాజెక్టును మూసీకి అన్వయిస్తు చేయాల్సిన ఖర్చు, పట్టే సమయం, బాధితుల సంఖ్య తదితరాలపై అధ్యయనం చేసి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ఇవ్వటానికే ప్రభుత్వం ఐదు కంపెనీల కన్సార్షియంకు రు. 143 కోట్లు చెల్లిస్తోంది. ఈ కన్సార్షియంకు అన్ని కోట్లు చెల్లించేబదులు చంగ్ యే చున్ నది ప్రక్షాళన ప్రాజెక్టు రిపోర్టును అధ్యయనం చేసి ఇక్కడ ఏ విధంగా అన్వయించవచ్చో సూచనలు చేయమని మన ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాల్లోని నిపుణులతో ఒక కమిటిని నియమించుంటే తక్కువ ఖర్చుతో పని అయిపోయేది. ప్రభుత్వం కూడా బాధితులను ఖాళీచేయించటంలో ఒక పద్దతి పాడు లేకుండా వ్యవహరిస్తోంది కాబట్టే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలతో రెచ్చిపోతున్నాయి. దక్షిణకొరియాలో అవినీతి లేదని చెప్పలేంకాని పట్టుబడితే శిక్షలు చాలా కఠినంగా ఉంటుంది. అవినీతి ఆరోపణలు రుజువైన అధ్యక్షులకు కూడా కఠిన శిక్షలు విధించిన ఘటనలు కొరియాలో ఉన్నాయి. అందుకనే పాలకులు, ఉన్నతాధికారులు భయంతో ఒళ్ళుదగ్గర పెట్టుకుని పనిచేస్తారు. మరి మనదగ్గర అవినీతి, పట్టుబడటం, విచారణలు, శిక్షలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే.

ప్రాజెక్టు ముందుకు జరుగుతుందా ?



రేవంత్ చెప్పిన ప్రకారమే డీపీఆర్ రావటానికి 18 నెలలు పడుతుంది. అంటే సుమారు 2026 జూన్ కు డీపీఆర్ అందుతుందని అనుకోవచ్చు. ఇపుడు విషయం ఏమిటంటే 2026-27 మధ్య జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ప్రచారం నిజమే అయితే 2026-27లో డీపీఆర్ అందినా పనులైతే మొదలయ్యే అవకాశాలు తక్కువనే అనుకోవాలి. ఎందుకంటే సరిగ్గా ఎన్నికల ముందు ఏ అధికారపార్టీ కూడా లక్షలమంది జనాలను ఇబ్బందిపెట్టే కార్యక్రమాన్ని చేపట్టదు. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరిగేట్లయితే ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన పనులు మొదలుపెట్టేస్తుంది అనటంలో సందేహంలేదు. ఎందుకంటే పునరుజ్జీవన పనులు స్పీడుగా మొదలుపెట్టి 2028 ఎన్నికలకు ప్రోగ్రెస్ చూపించి రేవంత్ జనాలను ఓట్లడిగే అవకాశముంది. అలాకాకుండా జమిలి ఎన్నికలు ఖాయమైతే రేవంత్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story