మదనపల్లె జిల్లా కానుందా?
x
పుంగనూరు నియోజకవర్గ మ్యాప్

మదనపల్లె జిల్లా కానుందా?

పుంగనూరులోని ఐదు మండలాలను అన్నమయ్య జిల్లాలో చేరుస్తున్నారు. ఒక మండలం చిత్తూరు జిల్లాలో ఉంటుంది. రాజకీయంగా ఇది ఎవరికి లాభం?


మదనపల్లె ను జిల్లా కేంద్రం చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. మదనపల్లెను జిల్లాగా మారుస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో మార్పులు చేపట్టినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విభజన నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో రెండు విధాలైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని స్థానిక అవసరాలకు అనుగుణంగా స్వాగతిస్తుండగా, మరికొందరు దీనిని మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేసే దిశగా ఒక రాజకీయ వ్యూహంగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మదనపల్లెలో మరింత పట్టు పెంచుకోవచ్చనే ఆలోచనలో ఉంది. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది.

ఎన్నికల వాగ్దానం నెరవేర్చేందుకేనా...

తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మహ్మద్ షాజహాన్ బాషా ను రంగంలోకి దించి గెలిపించుకుంది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన పట్టు ఉంది. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయడం వల్ల ఈ ప్రాంతంలో టీడీపీ ప్రజాదరణ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ నిర్ణయం టీడీపీకి రాజకీయంగా లాభం చేకూర్చవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నెరవేర్చినందున స్థానికులు టీడీపీ వైపు మొగ్గు చూపుతారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో గతంలో బలమైన స్థానం ఉన్నప్పటికీ, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వారి ప్రభావం తగ్గింది. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయడం వల్ల ప్రజలు అధికారంలో ఉన్న టీడీపీ, ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలపడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వైఎస్సార్సీపీకి ఈ నిర్ణయం వల్ల పెద్దగా రాజకీయ లాభం ఉండకపోవచ్చు. బీజేపీ, జనసేన, టీడీపీతో కూటమిలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయం వల్ల వారికి కూడా కొంత పరోక్ష లాభం కలగవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేదు. కాబట్టి వారికి ఈ నిర్ణయం వల్ల ఏ లాభమూ ఉండదు.

టీడీపీలో అంతర్గత విభేదాలు సమసే విధంగా...

మదనపల్లె టీడీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మదనపల్లె జిల్లా కేంద్రం అయితే ఈ విభేదాలను పరిష్కరించడానికి టీడీపీ అధిష్టానం కృషి చేయవచ్చు. ఇది పార్టీని మరింత బలోపేతం చేయవచ్చు. మదనపల్లెలో టీడీపీకి బలమైన స్థానిక నాయకత్వం ఉంది. జిల్లా కేంద్రం స్థాపన వల్ల స్థానిక నాయకులు ప్రజల్లో మరింత గుర్తింపు పొందవచ్చు. ఇది టీడీపీకి లాభదాయకంగా ఉంటుంది.

ఎప్పటి నుంచో మదనల్లెను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్..

మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. జిల్లా కేంద్రం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు (మార్కెట్ యార్డ్, వ్యవసాయం, వాణిజ్యం) సామాజిక సౌకర్యాలు (విద్య, ఆరోగ్యం) మెరుగుపడతాయి. ఈ అభివృద్ధి ఫలితాలను అధికార పార్టీ తమ ఖాతాలో వేసుకుంటుంది.

మదనపల్లె చారిత్రకంగా, సాంస్కృతికంగా ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడ బెసెంట్ థియోసాఫికల్ కాలేజీ, జిడ్డు కృష్ణమూర్తి వంటి ప్రముఖుల సమాజం ఉంది. జిల్లా కేంద్రం కావడం వల్ల ఈ ప్రాంతం యొక్క గుర్తింపు మరింత పెరుగుతుంది. ఇది అధికార పార్టీకి రాజకీయ కీర్తిని తెచ్చిపెడుతుంది.

బౌగోళికంగా చిన్నది కానున్న చిత్తూరు జిల్లా..

పుంగనూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను అన్నమయ్య జిల్లాలోకి మార్చడం వల్ల చిత్తూరు జిల్లా భౌగోళికంగా మరింత చిన్నదిగా మారుతుంది. గతంలోనూ చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల చిత్తూరు జిల్లా ఇప్పటికే కొంత భౌగోళిక విస్తీర్ణాన్ని కోల్పోయింది. 2022 పునర్విభజన తర్వాత, చిత్తూరు జిల్లా భౌగోళిక విస్తీర్ణం 6,855 చదరపు కిలోమీటర్లు. పునర్విభజనకు ముందు (2011 సెన్సస్ ప్రకారం), చిత్తూరు జిల్లా విస్తీర్ణం 15,359 చదరపు కిలోమీటర్లు ఉండేది. కానీ అన్నమయ్య, తిరుపతి జిల్లాల ఏర్పాటు తర్వాత విస్తీర్ణం తగ్గింది.

పుంగనూరు నియోజకవర్గంలో మండలాలు

పుంగనూరు నియోజకవర్గం ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిధిలో ఉంది. దీనిలో ఆరు మండలాలు ఉన్నాయి. పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు. పులిచెర్ల మండలాన్ని చిత్తూరులోనే ఉంచి మిగిలిన మండలాలు అన్నమయ్య జిల్లాకు మారుస్తారు.

పులిచెర్ల మండలాన్ని ఏ నియోజకవర్గంలో కలుపుతారు?

చిత్తూరుకు సమీపంలో ఉన్న పులిచెర్ల మండలం ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. అయితే మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఐదు మండలాలు మాత్రమే అన్నయమ్య జిల్లాలోకి తీసుకుంటున్నారు. పులిచెర్ల మండలాన్ని చిత్తూరు జిల్లాలోనే ఉంచుతున్నారు. ఈ మండలాన్ని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలపాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆరు మండలాలుగా ఇప్పటి వరకు ఉన్న పుంగనూరు నియోజకవర్గం ఐదు మండలాలకు పరిమితం అవుతుంది. ఇకపై చిత్తూరు జిల్లా కేంద్రానికి పోవాల్సిన అవసరం ఉండదు. పుంగనూరు నియోజకవర్గ వాసులు అన్నమయ్య జిల్లా కేంద్రానికి వెళతారు.

అన్నమయ్య జిల్లాకు మార్పు

అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఈ ఆరు మండలాలను అన్నమయ్య జిల్లా లోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా కేంద్రానికి దూరంగా (సుమారు 80-100 కి.మీ.) ఉంది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి మదనపల్లె రెవెన్యూ సబ్‌డివిజన్ కార్యాలయానికి దగ్గరగా ఉంది. దీని వల్ల ప్రజలకు పరిపాలనా సేవలను సులభంగా అందించేందుకు వీలు ఉంటుందని పాలకులు భావించారు.

ప్రిలిమినరీ నోటిఫికేషన్

గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనల మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి జారీ చేశారు. పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలు ప్రస్తుతం పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. రొంపిచెర్ల మండలం చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ లో ఈ మండలాలు చేరుస్తారు.

పులిచెర్ల మండలం మినహా (ఇది చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది చిత్తూరు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంది) మిగిలిన ఐదు మండలాలను మదనపల్లె డివిజన్‌లో కలపాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రజలను కోరింది.

Read More
Next Story