ఆంధ్రులకు కాంగ్రెస్ పై కోపం తగ్గినట్లేనా?
x

ఆంధ్రులకు కాంగ్రెస్ పై కోపం తగ్గినట్లేనా?

పాడి ఆవులాంటి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ వారు చేజేతులా నాశనం చేశారు. విభజన తరువాత ఆంధ్రులు కాంగ్రెస్ ను విసిరి పారేశారు. ఇప్పటికైనా కోపం తగ్గిందా? ఆదరిస్తారా?


సోమవారం ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచార హోరు శనివారం రాత్రితో ముగించారు. శనివారం సాయంత్రం రాహుల్ గాంధీ కడప ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో కాంగ్రెస్ పార్టీకి పాడి ఆవు లాంటిదని చెప్పొచ్చు. 42 పార్లమెంట్ సీట్లు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ మెజారిటీ వచ్చేది. అటువంటిది రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కారణాలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు దాదాపు అమలు కాలేదని చెప్పొచ్చు.

గాంధీ కుటుంబానికి విడదీయ రాని బంధం..

ఇందిరా కాంగ్రెస్ ఏర్పడక ముందు నుంచి కాంగ్రెస్ కు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంచి మెజారిటీతో పార్టీని గెలిపిస్తూ వచ్చారు. విశాలాంధ్ర ఏర్పడిన తరువాత హైదరాబాద్ పెద్ద నగరంగా ఆవిర్భవించింది. పెట్టుబడి దారులు కూడా ఇక్కడ ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఐటీ రంగం కూడా ఇక్కడ విస్తరించింది. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ నగరం తెలంగాణలో కలవడం, అక్కడ ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువ మంది స్థిరపడి ఉండటం వల్ల కాంగ్రెస్ నిర్ణయాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోయారు. ఇందుకు ప్రధానంగా అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ కారణంగానూ, సోనియాగాంధీ నిర్ణయం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని ప్రజలు నమ్మారు. అందువల్ల గాంధీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు. కనీసం ఒక్క ఓటు వేసేందుకు కూడా అంగీకరించలేదు. పదేళ్ల పాటు ఆంధ్రపదేశ్ లో అడుగు పెట్టాలంటేనే గాంధీ కుటుంబీకులు భయపడ్డారు. వైఎస్సార్ ఉన్నప్పుడు సోనియాగాంధీ ఏపీలో జరిగిన ప్రచార సభల్లో సగర్వంగా మాట్లాడ కలిగారు.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరట లభించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ కు అధ్యక్షురాలు అయ్యారు. ఆ బాధ్యతలు స్వీకరించగానే సమావేశాలు, సభలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి రాగలిగారు. వైఎస్ షర్మిల కావడం వల్ల ఆమె ఏమి చెప్పదలుచుకున్నారో వినేందుకు కాంగ్రెస్ అభిమానులు క్యూ కట్టారు. రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్రలో భాగంగా రాయలసీమ జిల్లాల్లో యాత్ర సాగించారు. మంచి ఆదరణ లభించింది. కొంతవరకు గాంధీ కుటుంబంపై ఉన్న కోపం తగ్గిందని చెప్పొచ్చు. దీంతో ఎన్నిక రగంలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి నిలిపింది. నేడు జగరనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల తన పార్టీ తరపున ఓట్లు రాబట్టకునే అవకాశం ఉంది.

ఆంధ్ర విభజనలో తప్పులపై తప్పులు

ఆంధ్ర ప్రదేశ్ ను విభజించేందుకు కాంగ్రెస్ పూనుకున్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నిర్ణయాలను తీసుకుంది. ప్రధానంగా అపోజిషన్ పార్టీల అభిప్రాయాల్లో ప్రధానమైనది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ వారు కూడా తెలంగాణ విభజన మాకు అభ్యంతరం లేదని లెటర్ ఇచ్చారు. రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా విభజనకు అనుకూలంగా లెటర్లు ఇచ్చాయి. ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్ లో ఉన్న ఎన్డీఎ కూటమి కూడా అంగీకరిస్తూ లెటర్ ఇచ్చింది. అన్ని పార్టీల వారు లెటర్లు ఇచ్చినా రాష్ట్ర కాంగ్రెస్ వారు మాత్రం లెటర్ ఇవ్వలేదు. రాష్ట్ర విభజన మంచిది కాదని సూచించారు. అయితే నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుంది కాబట్టి విభజన వైపు మొగ్గుచూపి విభజించింది.

విభజన హామీల అమలులో విఫలం

విభజన సమయంలో తీసుకున్న నిర్ణయాల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరగలేదు. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుల కారణంగా పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ ను రెండేళ్ల తరువాత వదిలేసి చంద్రబాబు ఆంధ్రలో అడుగు పెట్టారు. అప్పుడు సీఎం కార్యాలయం ఎక్కడో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నేటికీ కోలుకోలేదు. అప్పులపాలైంది. పాలకుల నిర్ణయాలు రాష్ట్రాన్ని మరింత కుంగదీశాయి. విభజన అనంతరం అధికారం చేపట్టిన ఎన్డఎ కూటమి కూడా ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకోలేదు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదు. విభజన చట్టంలో ఉన్న ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు జరపలేదు. హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కొంత డబ్బు తీసుకున్న చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో మట్టిపాలు చేశారు. ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్ జగన్ కూడా అమరావతి ప్రాంతంలో ఉన్న నిర్మాణ మెటీరియల్ ను చెదలు పట్టేలా చేశారు. చివరకు ఆంధ్రుల ఆశలు అడియాశలయ్యాయి.

షర్మిల రాకతో కొత్త ఉత్తేజం

కాంగ్రెస్ పార్టీని ఏపీలో నామరూపాలు లేకుండా ఎవరైతే చేశారో ఆయనను మట్టికరిపించాలని వ్యూహం పన్నిన కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ బిడ్డ వైఎస్ షర్మిలను ఎపిసిసి అధ్యక్షురాలును చేసింది. 2024 ఎన్నికల్లో పోటీకి దిగింది. పార్టీ సీట్లు సాధించలేక పోయినా గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయికి వెళ్లింది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ అంటే అభిమానంతో ఉన్న వారు ఒక్కరొక్కరుగా పార్టీవైపు వస్తున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలను ఎంపిక చేసే బాధ్యతను కూడా షర్మిల తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చాలా మంది కాంగ్రెస్ నాయకులను దేశ స్థాయిలో ఆదరిస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో వారికి ఆదరణ ఇప్పటి వరకు లేదు. అయితే ఈ ఎన్నికల్లో జెడి శీలం, కొప్పుల రాజు వంటి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ కు కాస్త ఆదరణ పెరిగిందనే చెప్పాలి. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుతం పోటీ చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశాలుగానే చెప్పొచ్చు.

కడపలో షర్మిల ప్రభావం ఎంత?

కడప నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీకి దిగారు. శనివారం సాయంత్రం షర్మిల గెలుపుకోసం ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేశారు. షర్మిలను గెలిపించాల్సిందిగా పిలుపు నిచ్చారు. వైఎస్సార్, రాజీవ్ గాంధీ అన్నా తమ్ముళ్ల వంటి వారని, నా చెల్లి షర్మిలను గెలిపించాలని కోరటం పలువురిని ఆకర్షించింది. వైఎస్సార్ తమ్ముడు వివేకానందరెడ్డి హత్య కడప ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. కడప వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి వివేకా హంతకులకు సహకరించారని, కుట్రదారని షర్మిల ఆరోపిస్తున్నారు. నేను చేస్తున్న ఆరోపణలు సీబిఐ చార్జ్ షీట్లో ఉన్నవేనని చెబుతున్నారు. అక్కడక్కడా షర్మిలకు ప్రచారంలో చుక్కెదురైంది. అభిమానులు ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఈ ఎన్నికల్లోనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని నిలదీశారు. వారి ఆవేశానికి, ఆక్రోశానికి సరైన సమాధానాలు చెబుతూ వారిని శాంతింపజేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు.

తల్లి మద్దతు కూడా షర్మిలకే..

ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న వైఎస్సార్ భార్య వైఎస్ విజయమ్మ కడపలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలమ్మను ఓటర్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కు ఎంత మంచి మనసు ఉందో అదే మనస్సు షర్మిలకు ఉందని, మంచి పాలన అందించగలుగుతుందని ప్రజలను కోరారు. ఆమె శనివారం అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి అందులో షర్మిలను గెలిపించాలని కోరారు.

ఏపీ విషయంలో కాంగ్రెస్ మళ్లీ తప్పులు చేయకుండా ఉంటుందా?

జరిగిందేదో జరిగిపోయింది. విభజన హామీల అమలు గురించి పట్టించుకోని బిజెపిని కట్టడి చేసి ఆంధ్ర ప్రజల మేలు కోసం చేసే పోరాటంలో ముందుంటుందా? ఉండదా? అనేది చర్చగా మారింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఇప్పటికే హామీలు ఇచ్చారు. షర్మిలకు కూడా పార్టీలో పూర్తి స్వేచ్ఛ నిచ్చారు.

Read More
Next Story