భయమా..వ్యూహంలో భాగమా
x

భయమా..వ్యూహంలో భాగమా

ప్రతిపక్ష హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తోనే మాజీ సీఎం జగన్, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలనే ప్లాన్‌లో ఉన్నారు.


సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే సోమవారం నుంచి మొదలు కానున్న సమావేశాలకు ఒక ప్రాధాన్యత ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానుండటంతో వీటికి ప్రాధాన్యత సంతరించుకుంది.

2024 ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం అంసెబ్లీలో అడుగు పెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత జరిగిన సమావేశాలకు డుమ్మా కొట్టారు. తనతో పాటు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా పత్తా లేకుండా పోయారు. దీనిపైన అటు కూటమి ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వామపక్షాలు, ఇతర ప్రజాస్వామిక వాదులు జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లక పోవడాన్ని తప్పుబట్టారు. మరో వైపు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని, లేకుండా సమయం ఎక్కువ రాదని, కానీ కూటమి ప్రభుత్వం కావాలనే తమకు ప్రతిపక్ష హోదాను అడ్డుకుంటోందని, ఇక అసెంబ్లీలో సమయం కూడా ఇవ్వదని, ఇక అలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లక పోవడమే మంచిదని ఇది వరకు పలు మార్లు జగన్‌ వెల్లడించారు. అసెంబ్లీకి వెల్లడం కంటే మీడియా సమావేశాలు పెట్టి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. అప్పటి నుంచి జగన్‌తో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా బయట ప్రెస్‌ మీట్‌లతోనే కాలం వెల్లబుచ్చారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు, స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు జగన్, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై పలుమార్లు ప్రస్తావించారు. అసెంబ్లీకి రాకపోతే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే డిస్‌ క్వాలిఫై చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీకి వచ్చినట్లు హాజరు జాబితాలో దొంగ సంతకాలు పెట్టడానికి వీల్లేదని, ఖచ్చితంగా హాజరు కావలసిందేనని పలు సందర్భాలలో వెల్లడించారు. ప్రజల సమస్యలు మీడియా సమావేశాల్లో కాదని, అసెంబ్లీకి వచ్చి చెప్పాలని కూటమి నేతలు పలు సందర్భాల్లో జగన్‌ను ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వెళ్లక పోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని షర్మిల పలుమార్లు డిమాండ్‌ చేశారు. జగన్‌ అసెంబ్లీకి హాజరు కాకుండా పులివెందులకు బై ఎలక్షన్‌ తప్పదని కడప జిల్లా టీడీపీ నాయకుడు బీటెక్‌ రవి ఇది వరకే వెల్లడించారు.
ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశాలకు జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా? లేదా? అనేది నిన్నటి వరకు ప్రశ్నార్థకంగానే ఉంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తాజాగా జగన్‌తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు నిర్ణయం తీసుకోవడంతో మరో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే డిస్‌క్వాలిఫై చేస్తారనే భయంతో జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారా? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది. సంఖ్యా బలం లేక పోవడంతో ఎలాగూ తమను సభలో అవమానానికి గురి చేస్తారని, ఎంత అవమానం పడితే ప్రజల్లో అంత సానుభూతి పొందొచ్చనే ఎత్తుగడతో అసెంబ్లీకి వెళ్లాలనే వ్యూçహాన్ని రచించినట్లు సమాచారం. దీంతో పాటుగా అసెంబ్లీకి వెళ్లడం లేదనే అపవాదు నుంచి బయట పడేందుకు కూడా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరో వైపు ప్రతిపక్ష హోదా విషయమై అధికార పక్షాన్ని అసెంబ్లీలో నిలదీయాలని ప్లాన్‌ చేస్తున్నారు.
Read More
Next Story