హైడ్రాకు ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా ?
x

హైడ్రాకు ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా ?

ఆనంద్ మాట్లాడుతు ఏ కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యం, మద్దతు లేకుండా సక్సెస్ కాదన్న విషయాన్ని నొక్కిచెప్పారు.


మొత్తానికి హైడ్రాకు ఇప్పటికి జ్ఞానోదయం అయినట్లుంది. ఏ కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యం లేకుండా, మద్దతులేకుండా సక్సెస్ చేయటం కష్టమన్న విషయం ఇప్పటికి హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ కు అర్ధమైనట్లుంది. అందుకనే చెరువులు, కాల్వలు, కుంటల పరిరక్షణపై తొందరలోనే జనాల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. జలవనరులను రక్షించటం అంటే ప్రకృతిని రక్షించుకోవటమే అన్న విషయాన్ని జనాలందరికీ తెలియజేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించేపని మొదలుపెట్టారు. ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా పాపులరైన ఆనంద్ మల్లిగవాడ్ తో వర్చువల్ గా తన ఆపీసు నుండి రంగనాధ్ చాలసేపు మాట్లాడారు. జలవనరులను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ఆనంద్ నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతు ఏ కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యం, మద్దతు లేకుండా సక్సెస్ కాదన్న విషయాన్ని నొక్కిచెప్పారు.

జలవనరుల పరిరక్షణకు తానుచేస్తున్న కృషిని ఆనంద్ వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే తాను కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. చెరువులు, కుంటలు, కాల్వల ఆక్రమణలను తొలగించాల్సిన అవసరం, భవిష్యత్తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, జలవనరులను కాపాడుకుంటే ఏ విధంగా లాభం జరుగుతుందన్న విషయాలను తాను జనాలందరికీ వివరించి చెప్పే విధానాన్ని ఆనంద్ కమీషనర్ కు వివరించారు. ఈ క్రమంలో తనకు ఎదురైన సమస్యలను వాటిని అధిగమించిన విధానాలను కూడా ఉదాహరణలతో ఆనంద్ వివరించారు. దాంతో కమీషనర్ ఆలోచనలో మార్పు వచ్చినట్లు సమాచారం. ఎలాగంటే ఇప్పటివరకు జలవనరుల ఆక్రమణల తొలగింపులో హైడ్రా చాల దూకుడుమీద వెళుతోంది. చెరువులు, కాల్వలు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ అని సర్వేల్లో నిర్ధారించుకున్న నిర్మాణాల్లో కొన్నింటిని కూలగొట్టేసింది.

దుర్గంచెరువు, నల్లచెరువు, తుమ్మిడిచెరువు లాంటి అనేక చెరువులను ఆక్రమించి కట్టుకున్న విల్లాలు, రో హౌసులు, విలావవంతమైన భవనాల జోలికి మాత్రం వెళ్ళలేదు. హైడ్రా ఇప్పటివరకు కూలగొట్టిన ఇళ్ళు, విల్లాలన్నీ బ్యాంకులు, ఆర్ధికసంస్ధల్లో అప్పులు తీసుకుని కొనుక్కున్న మధ్య, ఎగువమధ్య తరగతి జనాలవి మాత్రమే. వందలాది ఫాంహౌసులు చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించినట్లు ఆధారాలున్నా వాటిజోలికి హైడ్రా ఇప్పటివరకు వెళ్ళలేదు. ఎందుకంటే అవన్నీ జీవో 111 పరిధిలోకి వస్తుందని, జీవో 111 ప్రాంతంలోని నిర్మాణాలు తమ పరిధిలోకి రావని రంగనాధ్ విచిత్రమైన సమాధానం చెబుతున్నారు. కళ్ళెదుటే బడాబాబుల ఆక్రమ కట్టడాలు కనబడుతున్నా ఏమీ చేయని హైడ్రా తమ ఇళ్ళని మాత్రం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరుతో కూల్చేస్తుండటంతో బాధితుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైపోయింది.

వందలమంది రాజకీయనేతలు, సెలబ్రిటీలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తల్లో చాలమంది జలవనరులను ఆక్రమించుకునే ఫాంహౌసులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరెవరికి ఫాంహౌసులు ఎక్కడున్నాయి, జలవనరుల ఆక్రమించి చేసిన నిర్మాణాలంటు రాజకీయనేతలు ఒకళ్ళని మరొకళ్ళు సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీటిజోలికి వెళ్ళని హైడ్రా దుర్గంచెరువును ఆక్రమించుకుని లేఅవుట్లు వేసి కాలసీలు ఏర్పాటుచేసి విల్లాలు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన అపార్ట్ మెంట్ల యజమనాలకు నోటీసులు జారీచేసింది. అమర్ సొసైటీలో రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు జారీచేసింది. అయితే ఆ నోటీసును చాలెంజ్ చేస్తు కోర్టులో కేసువేసి కొండల్ రెడ్డి స్టే తెచ్చుకున్నారు. దాంతో ఈ వ్యవహారం మొత్తాన్ని జనాలు డ్రామాగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరుడితో పాలు బడాబాబులకు ఒక రూలు, తమకు మాత్రం ఇంకో రూలా అంటు జనాలు హైడ్రాపై మండిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూసిన తర్వాత బాధితుల్లో చాలామంది హైడ్రా పక్షపాతంతో వ్యవహరిస్తోందనే అభిప్రాయానికి వచ్చేశారు.

కూల్చివేతలకు సంబంధించి హైడ్రా ముందుగా బడాబాబుల నిర్మాణాలను కూల్చేసి, జీవో 111లోని ఫాంహౌసుల పనిపట్టుంటే తమ ఇళ్ళ కూల్చివేతలు తప్పవని మామూలు జనాలు మానసికంగా ప్రిపేర్ అయ్యుండేవారు. కాని అలాచేయకుండా హైడ్రా రివర్సులో మొదలుపెట్టడంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో కోర్టు స్టేలో ఉన్న ఒకటి రెండు భవనాలను కూడా హైడ్రా కూల్చేయటంతో హైకోర్టు మండిపోయింది. ఓవర్ యాక్షన్ చేస్తే హైడ్రా ఏర్పాటుపైనే స్టే ఇస్తామన్న హైకోర్టు హెచ్చరికతో కమీషనర్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. అందుకనే హైడ్రా కార్యక్రమాలకు కమీషనర్ విరామం ఇచ్చి పరిస్ధితిని సమీక్షస్తున్నారు. ఇందులో భాగంగానే లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ తో మాట్లాడింది. ఆనంద్ చేసిన సూచనలు, ఇచ్చిన సలహాలు కమీషనర్ కు జ్ఞానోదయం అయినట్లుంది.

అందుకనే తొందరలోనే బాధితులతో పాటు జలవనరులను ఆక్రమించుకుని చేసిన నిర్మాణాల్లో ఉంటున్న యజమానులతో సమావేశాలు, చర్చలు జరపాలని అనుకుంటున్నట్లు సమాచారం. జనాలకు పరిస్ధితిని వివరించి, కన్వీన్స్ చేయాలి. ఇదే సమయంలో బాధితుల సమస్యలకు హైడ్రా పరిష్కారం కూడా చూపించాలి. అప్పుడే హైడ్రాకు జనాలు సహకరిస్తారు లేకపోతే ఇప్పటి వ్యతిరేకతలే చివరకు తిరుగుబాటుగా మారుతాయని ప్రభుత్వం గుర్తించాలి. లేకపోతే హైడ్రా మీద వ్యతిరేకతకు రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని గమనించాలి.

Read More
Next Story