గుంటూరు వైసీపీకి భారీ కుదుపు తప్పదా!
x

గుంటూరు వైసీపీకి భారీ కుదుపు తప్పదా!

గుంటూరు వైసీపీకి గుడ్‌బై చెప్పడానికి డొక్కా మాణిక్యవరప్రసాదరావు సిద్దమయ్యారా? టీడీపీలో చేరడానికి రంగం కూడా సిద్ధం చేసుకున్నారా..


ఎన్నికల ముందు వైసీపీలో భారీగా కుదుపులు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. అయితే అతి త్వరలోనే గుంటూరు వైసీపీలో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి రాజకీయ వాతావరణ పరిస్థితులు చెప్తున్నాయి. గుంటూరు వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద రావు పార్టీ వీడాలని నిశ్చయించుకున్నారని విశ్వసనీయ వర్గాలు నుంచి సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు ఆయన ఇప్పటికే పూర్తి చేసేసుకున్నారని, రెండు మూడు రోజుల్లో ఆయన తన రాజీనామాను ప్రకటిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుండటంతోనే ఆయన పార్టీ వీడాలని చూస్తున్నట్లు కొన్ని రోజులుగా పార్టీ సర్కిల్స్‌లో జోరుగా చర్చలు జరిగాయి. అవి తన చెవిన పడటంతో మంత్రి అంబటి రాంబాబు.. డొక్కాతో సమావేశమయ్యారు. పార్టీ గెలుపుకోసం పాటుపడాలని, పార్టీలో ప్రాధాన్యత సంగతి తాను చూసుకుంటానని భరోసా కల్పించారు. కానీ ఇప్పుడు మళ్ళీ డొక్కా.. పార్టీని వీడనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి.

ఎందుకీ నిర్ణయం

గుంటూరు వైసీపీకి రాజీనామా చేయాలని డొక్కా ఎందుకు అనుకుంటున్నారు అన్న అనుమానాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల జాబితాలో డొక్కా పేరు లేకపోవడంతో ఆయన అసంతృప్తి చెందారని, దానికి తోడుగా పార్టీలో ప్రాధాన్యత కూడా తగ్గిపోవడం, తన సలహాలు, సూచనలను పార్టీ అధిష్టానం బేఖాతరు చేస్తుండంతో డొక్కా మనస్థాపం చెందారని, అందుకే పార్టీని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

డొక్కా.. సైకిల్ ఎక్కుతారా..

వైసీపీకి డొక్కా మాణిక్యవరప్రసాద రావు రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారన్న వార్తలు రావడంతో ఆయన తదుపరి నిర్ణయం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యాన్ కట్టేసి.. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయన టీడీపీ అధిష్టానంతో చర్చలు కూడా చేశారని, ఆయన రాకను టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఇప్పటివరకు టీడీపీ కానీ, డొక్కా మాణిక్యారావు కానీ అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై రెండు మూడు రోజుల్లో డొక్కా తన రాజీనామాతో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

వైసీపీ పెద్దల బుజ్జగింపులు ఫలించేనా

పార్టీ వీడాలని డొక్కా యోచిస్తున్నారన్న వార్తలు వినిపించిన మరుక్షణం నుంచే వైసీపీ బుజ్జగింపులు ప్రారంభించేసింది. ఎలాగైనా డొక్కాను పార్టీ నుంచి వెళ్లిపోకుండా పట్టుకోవాలని పార్టీ హైకమాండ్ శతవిధాలా ప్రయత్నిం చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రి అంబటి రాంబాబును డొక్కా నివాసానికి పంపి భరోసా కల్పించింది. అయినా ఇప్పుడు మరోసారి డొక్కా రాజీనామా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో వైసీపీ పెద్దల బుజ్జగింపులు ఫలిస్తాయా అనేది వేచి చూడాలి.


Read More
Next Story