డొక్కా మీకిది క్షేమమా?
x

'డొక్కా' మీకిది క్షేమమా?

గుంటూరు వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాదరావు.. పార్టీని వీడాలనుకుంటున్నారట. మరి ఆయన కోసం పార్టి హైకమాండ్ దిగొస్తుందా...


ఆంధ్ర రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో అర్థం కాని పరిస్థితి ఉంది. వలస రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. కిల్లీ కృపారాణి, ఆమంచి, మహమ్మద్ ఇక్బాల్.. ఇలా వరుసగా పార్టీని వీడారు. తాజాగా ఈ జాబితాలో గుంటూరు వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డొక్కా మానిక్యవరప్రసాద్‌కు చేరనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని మాణిక్యవరప్రసాద్ చెప్పారు. ఈ విషయం తెలియడంతోనే మంత్రి అంబటి రాంబాబు.. డొక్కాతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లాలోని డొక్కా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన పార్టీ మార్పు అంశంపై కీలకంగా చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తనకు ప్రాధాన్యత లేకుండా పోతుందన్న డొక్కాకు అంబటి హామీ ఇచ్చారని, పల్నాడులో వైసీపీ విజయం కోసం కృషి చేయాలని, పార్టీలో ప్రాధాన్యత ఉండేలా తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారని సమాచారం.

ప్రాధాన్యత లేకనే అన్నిటికీ దూరం

2004లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన తాడికండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించిన ఆయన ౨౦౧౪లో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న డొక్కా.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డొక్కా వరప్రసాద్ ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లు సమయంలో ఆయన పార్టీ కండువా మార్చి వైసీపీలో చేరిపోయారు. అప్పుడే టీడీపీ తరపు ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీ తరపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశపడిన డొక్కాకు నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా తాడికొండలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తాను సీఎం జగన్‌ను కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. దీంతో పాటుగా తనను సంప్రదించకుండా తాడికొండ ఇన్‌చార్జ్‌గా నియమించడం, మళ్లీ చెప్పాపెట్టకుండా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న అన్ని పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లో కీలకంగా మెలిగిన డొక్కా.. ఇప్పుడు సీటు దక్కకపోగా పార్టీలోనూ ప్రాధాన్యత లోపిస్తుండటంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని వాదన వినిపిస్తోంది.

మళ్లీ సొంత గూటికే వెళ్తారా!

ఒకవేళ డొక్క వరప్రసాద్.. వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తే మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా డొక్కా వరప్రసాద్ కూడా కాంగ్రెస్‌లో చేరితే జగన్‌కు వ్యతిరేకత తీవ్రతరం అవుతుందని, ఇప్పటికే షర్మిల, సునీత రెడ్డి, కిల్లీ కృపారాణి వంటి నేతలు వైసీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి స్వరానికి డొక్కా గొంతు కూడా చేరితే వైసీపీలో గందరగోళం రేగుతుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ డొక్కాను వదులుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందువల్ల డొక్కాను పార్టీలోనే ఉంచేలా వైసీపీ అధిష్టానం ప్లాన్స్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో డొక్కా వరప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయనను పార్టీలోనే కొనసాగేలా చూసేందుకు పార్టీ ఏమైనా చేస్తుందేమో చూడాలి.

Read More
Next Story