క్రాస్ ఓటింగ్ ఖాయమా?
గుంటూరు పార్లమెంట్‌లో మూడు ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం కూటమి, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
ఏపీలోని గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గంలో క్రాస్ ఓటింగ్ ఖాయంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సర్వేలు నిర్వహించిన పలు సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమైన దిన పత్రికలు నిర్వహించిన సర్వేల్లోను ఈ విధమైన ఫలితాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గుంటూరు జిల్లాలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఏమి జరుగుతోంది. ఏ పార్టీ పరిస్థితి ఏమిటి.
వెకంజలో ఉన్నామా?
ఇప్పటికే ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు గడ్డు కాలం ఎదురవుతున్నట్లు ఆ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు నిర్వహించిన సర్వేల్లోనూ ఇటువంటి సమాచారం ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఐదు నియోజక వర్గాలపై చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంచి పట్టు తెలుగుదేశం పార్టీకి ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో మనం వెనుకబడితే అమరావతి అనే పధానికే అర్థం ఉండదని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
అభ్యర్థులు పార్లమెంట్‌కు కొత్త..
గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కిలారి రోశయ్య, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్, భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థిగా జంగాల అజయ్‌కుమార్‌లు పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు జనసేన, బిజెపీల నుంచి మద్ధతు కూడా ఉంది. జంగాల అజయ్‌కుమార్‌కు కాంగ్రెస్ మద్ధతు ఉంది. పెమ్మసాని ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తుండగా, అజయ్ ఇండియా కూటమి నుంచి పోటీలో ఉన్నారు. రోశయ్య మాత్రం కేవలం వైఎస్‌ఆర్‌సీపీ ద్వారానే పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఈ పార్లమెంట్‌కు కొత్తే. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు కొత్త వాళ్లు కావడం విశేషం. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తున్న కిలారు రోశయ్య ప్రస్తుతం పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ స్థానం నుంచి మార్చి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలకు కొత్త. ఇతను ఒక వ్యాపార వేత్త. అమెరికాలో ఒక కంపెనీని స్థాపించి వ్యాపారంలో స్థిపరడ్డారు. సమాజసేవ కార్యక్రమాల్లో ఆయన ముందుండే వారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. రెండేళ్లుగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు టీడీపీ అవకాశం కల్పించింది. జంగాల అజయ్‌కుమార్ సీపీఐ రాష్ట్ర నాయకుడు. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ మద్దతుతో ఈయన కూడా పార్లమెంట్‌కు మొదటి సారి రంగంలోకి దిగారు. వీరు ముగ్గురూ కొత్తవారు కావడం, ప్రధానంగా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్య పోటీ ఉండటం, సీపీఐ అభ్యర్థి నామ మాత్రంగానే ఉంటుందని గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు చర్చించుకుంటున్నారు.
ఓటర్లు ఎవరి వైపు..
గుంటూరు పార్లమెంట్ పరిధిలో సుమారు 16లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. వీరు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే దానిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వైపు ఎక్కువ మంది ఓటర్లు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఓటరు కొనుగోలు విషయంలో చంద్రశేఖర్ ఇప్పటికే కావలసిన చర్యలన్నీ తీసుకున్నారని, గుట్టు చప్పుడు కాకుండా ఓటర్ల కొనుగోలు కార్యక్రమం ఇప్పటికే పూర్తి అయిందని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు పార్టీ ఫండ్ కోట్లల్లోనే అందిందని, ఆ ఫండ్‌ను ఓట్ల కోసం ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ పెద్దల నుంచి సమాచారం అందినట్లు ఆ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు చెప్పడం విశేషం. పార్టీ నుంచి వచ్చిన డబ్బులో రూపాయి కూడా ప్రచారానికి వినియోగించొద్దని, అభ్యర్థి సొంత డబ్బునే ప్రచారానికి వినియోగించుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ పెద్దలు సూచించినట్లు సమాచారం.
అసెంబ్లీల్లో పరిస్థితి ఏమిటి?
పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అందులో తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తాడికొండ నియోజక వర్గాలు వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నాయనే టాక్ జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది. పొన్నూరు, మంగళగిరి నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సునాసంగా గెలిచే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పొన్నూరు టీడీపీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు దూళ్లిపాళ్ల నరేంద్ర పోటీలో ఉన్నారు. ఈ నియోజక వర్గానికి కొత్తగా అంబటి మురళిని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా నియమించింది. సీపీఎం నుంచి జక్కా రవీంద్రనా«ద్ రంగంలో ఉన్నారు. పోటీ మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్యనే ఉంటుంది. అంబటి మురళి రాజకీయాలకు కొత్త. మొదటి నుంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈయన రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సోదరుడు. ఈ నియోజక వర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్ల డామినేషన్ ఎక్కువుగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.
మంగళగిరి నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య రంగంలో ఉన్నారు. లావణ్య రాజకీయాలకు కొత్త. అయితే వారి కుటుంబం మాత్రం రాజకీయ కుటుంబం. నారా లోకేష్ మంగళగిరిలో 50వేల ఓట్ల మెజారిటీకి తగ్గకుండా గెలుస్తానని పలు సందర్భాల్లో శపథం చేశారు. మెజారిటీ ఎలా ఉన్నా లోకేష్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.
తెనాలి నుంచి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాదేండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి అన్నాబత్తుల శివకుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగానే ఉన్నా టీడీపీ వర్గాలు మనోహర్‌కు అనుకున్న స్థాయిలో సహకరించమని టీడీపీలోనే అంతర్గత చర్చలు సాగుతున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు ఆలపాటి రాజా మనోహర్‌కు సహకరించడం లేదు. జనసేన పార్టీలోని కొందరు ముఖ్య నేతలు కూడా పట్టీ పట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇక్కడి ఓటర్లు వైఎస్‌ఆర్‌సీపీ వైపే మొగ్గు చూపుతారని పార్లమెంట్ విషయానికి వస్తే క్రాస్ ఓటింగ్ టీడీపీకి పడుతుందని నియోజక వర్గంలో ఓటర్ల మనోభావలను తెలుసుకున్న కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
ఇక తాడికొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా తెనాలి శ్రావణ్‌కుమార్, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మేకతోటి సుచరిత పోటీ పడుతున్నారు. నాలుగు మండలాల్లో టీడీపీకి అనుకూల వాతావరణం ఉందని, ఒక మండలంలో వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉందనే చర్చ కూడా సాగుతోంది. ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంది.
ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా బోర్ల రామాంజనేయులు పోటీ చేస్తుండగా, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బాలసాని కిరణ్‌కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూల వాతావరణం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా విడదల రజని రంగంలో ఉన్నారు. గుంటూరు ఈస్ట్‌లో టీడీపీ నుంచి మహ్మద్ నజీర్, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి షేక్ నూర్ ఫాతిమా పోటీ పడుతున్నారు. ఈ రెండు నియోజక వర్గాల్లోను క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ పార్టీల నాయకులు చెప్పుకోవడం విశేషం. వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూల వాతావరణం కనిపిస్తుందని, అయితే పార్లమెంట్ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థికి ఓటర్లు క్రాస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ నాయకులే మాట్లాడటం మరో విశేషం.
Next Story