'పో, జగన్’ అంటే పోవడానికి ఆయనేమైనా ఈగా, దోమా 'బాబూ'!
చంద్రబాబు ఇచ్చిన క్విట్ జగన్ పిలుపుపై ఆంధ్రప్రదేశ్ లో సెటైర్లు పేలుతున్నాయి. చంద్రబాబునే అధికారం నుంచి దించిన వ్యక్తిని పట్టుకుని క్విట్ జగన్ అంటే పోతారా?
క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ.. ప్రొద్దుటూరు సభలో చంద్రబాబు ఇచ్చిన పిలుపిది. ప్రతిపక్ష పార్టీ నాయకుడు గనుక ఆయన అంతకుమించి ఏమి మాట్లాడతార్లెమ్మని మనం సరిపెట్టుకోవచ్చు గాని తప్పుకో జగన్ అంటే తప్పుకుంటారా? నువ్వు రా బాబూ, వచ్చి నా కుర్చీలో కుర్చోమని అంటారా? అదంత సులువే అయితే టీడీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకే ఎందుకు పరిమితం అవుతుంది? ఏకైక రాజధాని అనుకున్న అమరావతి మూడు రాజధానులు ఎలా అవుతుందీ? చంద్రబాబు పార్టీ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఎందుకు వైసీపీ జెండాలు కప్పుకుంటారు, చంద్రబాబు నిండు సభలో ఎందుకు ఏడవాల్సి వస్తుందీ, సీఎం అయితే తప్ప అసెంబ్లీకి రానని ఎందుకు భీష్మ ప్రతిజ్ఞ చేయాల్సి వస్తుందీ? ఇలా సవాలక్ష ప్రశ్నలు, సందేహాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనంలో మెదళ్లలో మెదులుతున్న ప్రశ్నలు.
చంద్రబాబు ఏమంటారంటే...
జగన్ ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాలు విసిరారు. ‘జగన్‌కు రాయలసీమ అంటే హింస, హత్యా రాజకీయాలు.. టీడీపీ అంటే సీమకు నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. రైతును రాజు చేయడమే టీడీపీ సంకల్పం. పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మేది లేదంటున్నారు. విపరీతమైన మార్పు వచ్చింది.. ట్రెండ్ మారింది.. వైసీపీ బెండు తీస్తారు’ అన్నారు చంద్రబాబు. ఇంకో అడుగు ముందుకేసి ’వైసీపీ నేతల దాడులకు టీడీపీ కార్యకర్తలు భయపడలేదు. కడపకు స్టీల్‌ప్లాంట్ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. శంకుస్థాపనలు కాదు.. ప్రారంభోత్సవాలు జరగాలి. రాయలసీమకు మేం కియా మోటార్స్ తీసుకొచ్చాం. కరవుసీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయి. నా బ్రాండ్ కియా మోటార్స్ తేవడం.. జగన్ బ్రాండ్ వేసిన స్టీల్‌ప్లాంట్‌కు మళ్లీ శంకుస్థాపన చేయడం..! పరిశ్రమలు తేకపోగా.. ఉన్నవాటిని తరిమేశారు’’
‘‘జగన్‌కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా..? రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. ఆ సంకల్పంతోనే 72 శాతం పనులు పూర్తి చేశాం. ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా..? రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ నినాదం కావాలి. ఈ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
బాబు ప్రసంగంపై పేలిన సెటైర్లు...
చంద్రబాబు ప్రసంగం అట్లా పూర్తయిందో లేదో సెటైర్లు పేలాయి.‘చంద్రబాబు ఏమైనా స్వాతంత్య్ర ఉద్యమం చేస్తున్నారా? లేక మరేదైనా విముక్తి పోరాటామా‘ పో అంటే జగన్ పోవడానికి. ఆయనా ఈయనా ఇద్దరు చేస్తున్నది అధికార యుద్ధమే కదా అన్నారు సీపీఐ ఎంఎల్ నాయకుడు జి.రామకృష్ణ. చంద్రబాబును గద్దె దించి జగన్ అధికారంలోకి వచ్చింది బాబు పొమ్మంటే పోవడానికా అన్నారు వైసీపీ అనుబంధ రైతు సంఘం నాయకుడు భరత్ రెడ్డి. రాయలసీమను రత్నాలసీమగా చంద్రబాబు మార్చేస్తే ఆయన పార్టీ సీమలో ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందన్నారు భరత్ రెడ్డి. ’చంద్రబాబు పచ్చిమోసగాడు.. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్షపాతి. చంద్రబాబు ఊడత ఊపులకు భయపడరు’ అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ’ ’ ’అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించింది చంద్రబాబు కాదా? షాజహాన్ తాజ్ మహల్ కడితే నేను అమరావతి కడతానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమేముందని’ అన్నారు కేశినాని నాని.
వైసీపీ వాళ్ల ప్రశ్నలు ఏమిటంటే...
చంద్రబాబు ప్రకటనపై వైసీపీ నేతలు స్ట్రాంగ్ గానే స్పందించారు. రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి మొదలు ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతల వరకు.. సంధించిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
–చంద్రబాబు రైతు రుణమాఫీ పేరిట దగా చేశారా? లేదా?
–అమరావతి పేరిట చూపింది రంగుల కల, అవునా కాదా?
–కుటుంబాలలో కలహాలు సృష్టించింది చంద్రబాబు అవునా కాదా?
–బీసీలను అవమానించి సాక్షాత్తు సచివాలయం గేట్లు ఎక్కకుండా చేసింది చంద్రబాబే కదా
–ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్రానికి నష్టం చేసిందే చంద్రబాబు కాదా?
–బీజేపీతో పొత్తును వ్యతిరేకించి బయటకు వచ్చి అదే పార్టీతో మళ్లీ పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు కాదా?
–పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అదే మామ ఎన్టీఆర్ బొమ్మతో ఊరేగడం చంద్రబాబుకే చెల్లుబాటవుతుంది
–కొడుకు మీద ప్రేమతో ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని లోకేశ్ ను దొడ్డిదారిన మంత్రిని చేసింది ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు.
ఇద్దరిపైనా మూడో పక్షం విమర్శలు...
’ఈ ఇద్దరు నాయకులు (వైఎస్ జగన్, చంద్రబాబు) మాట్లాడుతున్న తీరు చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది. వీళ్లేదో ప్రజాస్వామ్యాన్ని ఉద్దరించడానికి మహోద్యమం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ల మాటలు వింటుంటే.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపిన మహాత్మాగాంధీ కూడా దిగదుడుపేనేమో.. అధికారం కోసం తన్నుకులాడుతున్న వీళ్లు ఒకర్ని ఒకరు క్విట్ చేసుకోవడానికి చేసే పోరాటంలో ప్రజలు బలి కావాల్నా?’ అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు. ఇలా మూడో పక్షంగా ఉన్న కొన్ని పార్టీలు ఇద్దర్నీ విమర్శిస్తూ ఇద్దరిపైనా సెటైర్లు వేయడం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న చరిత్ర.