
వెలిగొండ ప్రాజెక్టు 1వ టెన్నెల్ వద్ద పరిశీలనకు వచ్చిన పౌర సమాజ ప్రతినిధులు
Veligonda: వెలిగొండపై దుమ్మెత్తి పోసుకోవడమే చంద్రబాబు, జగన్ లక్ష్యమా?
వెలిగొండకు నీళ్లు ఎప్పుడోస్తాయో చెప్పలేని దుస్థితిపై నిపుణుల క్షేత్రస్థాయి పర్యటన
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మళ్లీ రాజకీయ ఉచ్చులో చిక్కుకుంది. పనులు పూర్తి చేయడంపై కాకుండా, పరస్పర ఆరోపణలకే చంద్రబాబు, జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
జగన్ ప్రభుత్వం పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసి, ప్రజలను మోసం చేసిందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2020లో జగన్ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేస్తామని, 2023 ఖరీఫ్ సీజన్ నాటికి నీరు అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఈ హామీలు నెరవేరలేదు.
మరోవైపు, వైఎస్సార్‌సీపీ నాయకులు జగన్ హయాంలో సొరంగాల నిర్మాణం, ఆనకట్టలు, పునరావాస కార్యక్రమాలకు అధిక నిధులు కేటాయించారని, చంద్రబాబు ప్రభుత్వం 2014-2019 మధ్య కాలంలో ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని వాదిస్తున్నారు. ఈ పరస్పర ఆరోపణలు ప్రాజెక్టు పురోగతిని రాజకీయ వివాదంగా మార్చాయి.
గొట్టిపడియ కొండల మధ్య నిర్మించిన ఆనకట్ట
జూలై 2026 నాటికి వెలిగొండ పూర్తవుతుందా?
వెలిగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో కరువు, ఫ్లోరైడ్ సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు వరదాయిని. అయినప్పటికీ రాజకీయ జోక్యం, నిధుల కొరత, సాంకేతిక సవాళ్లు ప్రాజెక్టు పూర్తిని ఆలస్యం చేస్తున్నాయి. జగన్ హయాంలో సొరంగాల నిర్మాణంలో కొంత పురోగతి సాధించినప్పటికీ, కాలువలు, పునరావాసం వంటి కీలక పనులు పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం 2026 జులై గడువును నిర్దేశించినప్పటికీ, రాజకీయ ఆరోపణలు, ఆర్థిక అడ్డంకులు ఈ లక్ష్యాన్ని సవాలుగా మార్చాయి.
గొట్టిపడియ గ్యాప్ ఆనకట్టను పరిశీలించేందుకు చేరుకున్న ఆలోచనా పరుల వేదిక నాయకులు, రైతు నాయకులు
ఆలోచనా పరుల వేదిక ఆధ్వర్యంలో పర్యటన
ఈనెల 4న ఆలోచనా పరుల వేదిక ఆధ్వర్యంలో నీటి పారుదల రంగంపై అవగాహన ఉన్న మేధావి వర్గం వెలిగొండ ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు కార్యాలయాల్లో ఉన్న అధికారులతో ఈ బృదం మాట్లాడింది. ఆ తరువాత గొట్టిపడియ కొండల మధ్య గ్యాప్ లో నిర్మించిన ఆనకట్టను పరిశీలించారు. అక్కడ తాగునీటి కోసం నిర్మిస్తున్న రెగ్యులేటర్ ను కూడా ఈ బృదం పరిశీలించింది.
ఫేజ్ వన్ కింద సొరంగాలు, గ్యాప్ ల వద్ద ఆనకట్టలు పూర్తి కావచ్చాయని, ఫేజ్ -2 కింద కాలువల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందని అధికారులు వివరించారు. ఫేజ్ టూ కింద పనులన్నీ పూర్తి కావాలంటే ఇంకా రూ. 5వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు వివరించారు. ఆలోచనా పరుల వేదిక ద్వారా వచ్చిన బృందంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు, టీ లక్ష్మీనారాయణ, భవానీ ప్రసాద్, నల్లమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, బరిసెర్ల కృష్ణమూర్తి నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, అందె నాసరయ్య, టీసీహెచ్ చెన్నయ్య లు ఉన్నారు.
ఈ సందర్భంగా వీరు విలేకరులతో మాట్లాడుతూ కేవలం ఒక కిలో మీటరు సొరంగ మార్గం తవ్వితే వెలిగొండ ప్రాజెక్టుకు నీరు అందించ వచ్చని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు నిర్మాణానికి ఇంత కాలం పట్టిందని, 2026 నాటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం లేదన్నారు. ప్రాజెక్టుకు కావాల్సిన రూ. 5వేల కోట్లను వెంటనే విడుదల చేసి పనులను వేగవంతం చేయాలన్నారు. శ్రీశైలం డ్యామ్ కు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.
4.47 లక్షల ఎకరాలకు సాగునీరు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రాష్ట్రంలో నీటిపారుదల, తాగునీటి సరఫరా కోసం కీలకమైన భారీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో 1996లో శంకుస్థాపన జరిగింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు రాజకీయ వివాదాలు, ఆర్థిక అడ్డంకులతో నిర్మాణ ఆలస్యాన్ని ఎదుర్కొంటోంది.
నిర్మాణ ఖర్చు, ఎస్టిమేషన్
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభ అంచనా వ్యయం 1996లో రూ. 980 కోట్లు కాగా 2005 నాటికది రూ. 5,500 కోట్లకు, 2025 నాటికి రూ. 9,000 కోట్లకు పైమాటగా ఉంది. ఇప్పటివరకు సుమారు రూ. 5,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పనుల కోసం మరో రూ. 5,000 కోట్లకు పైగా అవసరమని అంచనా వేస్తున్నారు.
మిగిలిన నిర్మాణ పనులు
ప్రాజెక్టులో రెండు సొరంగాల నిర్మాణం కీలకం. మొదటి సొరంగం (18.8 కి.మీ.) పనులు పూర్తయ్యాయి. రెండవ సొరంగం పొడవు 18.787 కిలోమీటర్లు కాగా ఇప్పటికి 17.858 కిలోమీటర్లు పూర్తి అయింది. అంటే సుమారు ఒక కిలోమీటరు పని మిగిలి ఉంది. దీనిని 2026 జూన్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇతర మిగిలిన పనుల్లో హెడ్ రెగ్యులేటర్, టన్నెల్ లైనింగ్, బెంచింగ్, ఫీడర్ కెనాల్ వాల్ తొలగింపు ఉన్నాయి. కాలువల నిర్మాణం 80 శాతం పూర్తైనప్పటికీ, రిజర్వాయర్ నింపడానికి, నిర్వాసితుల పునరావాసం, పరిహారం చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంది.
ఆనకట్టల నిర్మాణం
సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద నల్లమల కొండల్లో నిర్మించిన మూడు ఆనకట్టలు 2014 నాటికి పూర్తయ్యాయి. ఈ ఆనకట్టలు దాదాపు 11 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేశారు. అయినప్పటికీ ప్రాజెక్టు ఇతర భాగాలు ఆలస్యమవుతున్నాయి.
ప్రాజెక్టు పూర్తి గడువు
ప్రస్తుత ప్రభుత్వం 2026 జులై నాటికి వెలిగొండ రిజర్వాయర్‌ను నీటితో నింపి, ఆయకట్టు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని నిర్ణయించింది.
రెండు దశల్లో వెలిగొండ ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ రెండు దశలలో నిర్మాణం కానుంది. ఇందులో ప్రతి దశకు సంబంధించిన భాగాలు, నీటిపారుదల సౌకర్యాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
స్టేజ్ 1 (Stage 1)
- మొత్తం కిలోమీటర్లు: 44.625 కి.మీ.
- నీటిపారుదల విస్తీర్ణం: 1,19,000 ఎకరాలు.
సంబంధిత భాగాలు
1. టన్నెల్ రెగ్యులేటర్లు
2. టన్నెల్ 1
3. టన్నెల్ 2
4. ఫీడర్ కాలువ
5. కాంక్రీట్ డ్యామ్
6. హెడ్ రెగ్యులేటర్లు
7. పర్మనెంట్ వర్క్స్ ఆఫ్ నోస్
8. డైవర్షన్ రోడ్
9. టీగాలరు కాలువ
10. ఈస్టరన్ మెయిన్ కాలువ
11. ఇన్ఫ్రా వర్క్స్ ఎట్ 7 R&R సెంటర్లు
మార్కాపురం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న ఆలోచనా పరుల వేదిక నాయకులు
స్టేజ్ 2 (Stage 2)
- మొత్తం కిలోమీటర్లు: 130.525 కి.మీ. (బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆఫ్‌టేక్ పాయింట్ వరకు)
- నీటిపారుదల విస్తీర్ణం: 3,28,300 ఎకరాలు.
సంబంధిత భాగాలు
1. ఈస్టరన్ మెయిన్ కాలువ
2. పెడ్డిపల్లి బ్రాంచ్ కాలువ
3. వెస్టరన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
4. రచెర్ల రిజర్వాయర్
5. ఇండిపెండెంట్ రిజర్వాయర్లు
6. గుండ్లబ్రహ్మేశ్వరం రిజర్వాయర్
7. రాళ్లవాగు రిజర్వాయర్
8. టుర్మిల రిజర్వాయర్
9. సీతారామసాగర్ ట్యాంక్
10. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కాలువ వ్యవస్థ
ఈ రెండు దశలు కలిపి వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా నీటిపారుదల సౌకర్యాలను విస్తరించి, స్థానిక రైతులకు మరింత నీటి లభ్యత కలిగేలా రూపొందించారు.
మూడు జిల్లాలు... 4,47,300 ఆయకట్టు
ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని భూములకు సాగు, తాగునీరు అందుతుంది. స్టేజ్ – 1 కింద 1.19 లక్షల ఎకరాలు, స్టేజ్ -2 కింద 2,17,100 ఎకరాలకు కలిపి మొత్తం రెండు స్టేజీల్లోనూ 3,36,100 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగునీరు అందుతుంది. స్టేజ్ -2 కింద పనులు పూర్తి కాగానే వీరికి సాగునీరు ఇస్తారు. ఉదయగిరి నియోజకవర్గంలో 63వేల ఎకరాలు, ఆత్మకూరు నియోజకవర్గంలో 21వేల ఎకరాలకు సాగు నీరు ప్రాజెక్టు ద్వారా అందుతుంది.
కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గానికి ప్రాజెక్టు నుంచి సాగు నీరు అందుతుంది. మొత్తం 27వేల ఎకరాలు ప్రజెక్టు కింద సాగవుతుంది.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాలకు కలిపి స్టేజ్ -1 పనులు పూర్తి కాగానే 1,19,000 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. స్టేజ్ -2 కింద పనులు పూర్తి కాగానే 3,28,300 ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. అంటే మొత్తం ప్రాజెక్టు ఆయకట్టు 4,47,300 ఎకరాలుగా ఉంటుంది.
గొట్టిపడియ కాలువను పరిశీలిస్తున్న సివిల్ సొసైటీ ప్రతినిధులు
2026 జూలైకి ప్రాజెక్ట్ పూర్తవుతుందా?
వెలిగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలవనుంది. అయినప్పటికీ, రాజకీయ ఆరోపణలు, ఆర్థిక ఆంక్షలు ప్రాజెక్టు పురోగతిని అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వం, కాంట్రాక్టర్లు, స్థానిక సంఘాలు సమన్వయంతో పనిచేస్తే 2026 జులై నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. రైతులకు, ప్రజలకు నీరు అందించే అవకాశం ఉంది. రాజకీయ ఉచ్చు నుంచి బయటపడి, ప్రజా ప్రయోజనాలను ప్రాధాన్యతగా భావిస్తే తప్పకుండా పూర్తవుతుంది.
వెలిగొండ మార్కాపురం కార్యాలయంలో నాయకులు
రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు
రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు అనేక నీటిపారుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం, సిద్దేశ్వరం అలుగు, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి, మరికొన్ని ఇతర మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా ఈ ప్రాంతంలో 10-15 ముఖ్యమైన ప్రాజెక్టులు నీటిపారుదల, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలతో సహా పెండింగ్‌లో ఉన్నాయి.
రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పాలకులు పదేపదే చెబుతున్నా ఆ ప్రాంతంలోని ప్రాజెక్టులపై ఏ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని జలరంగ నిపుణులు, కేంద్ర రైతు సంఘ నాయకులు రావుల వెంకయ్య చేసిన వ్యాఖ్య నిజమేమోననిపిస్తోంది.
Next Story