విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకే కేంద్రం ప్లాన్ చేస్తోందా?
x

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకే కేంద్రం ప్లాన్ చేస్తోందా?

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం ఒక్క మంత్రి వల్ల అయ్యే పని కాదా? కేంద్ర సహాయక మంత్రి శ్రీవర్మ ఏం చెప్పారు? విశ్లేషకులు ఎందుకు అనుమానిస్తున్నారు?


విశాఖ ఉక్కు కర్మాగారం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సహా కేంద్రం ప్రభుత్వం కూడా దీనిపై ఒక్కసారిగా ఫోకస్ పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. ఇన్నాళ్లూ విశాఖ ఉక్కును పట్టించుకోని కేంద్ర ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి విశాఖ ఉక్కుకు పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తోంది. విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించడానికి, కర్మాగార ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తామని కేంద్రం మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు. అయితే కేంద్రం పడుతున్న శ్రమంతా కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి మార్గాన్ని సుగమం చేసుకోవడానికే అన్న వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చంద్రబాబు కూడా తన ఢిల్లీ పర్యటనలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా భారీగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఇది ఒక మంత్రి తీసుకునే నిర్ణయం కాదు’

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే జరిగిపోయే ప్రక్రియ కాదని శ్రీనివాస వర్మ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయత్వంలోని కేబినెట్ అంతా కూడా కూర్చుని చర్చించుకున్న తర్వాత మాత్రమే తీసుకోగలిగిన నిర్ణయమని ఆయన చెప్పారు. ‘‘కేంద్రం కేబినెట్ అంతా నిర్ణయిస్తే కానీ ప్రైవేటీకరణ జరగదు. ఒక్కరు అభ్యంతరం వ్యక్తం చేసినా అది ఆగాల్సిందే. కాగా విశాఖ ఉక్కును ప్రభుత్వ సంస్థ సెయిల్‌లో విలీనం చేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయి. వీటిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధింకే కేంద్రం మంత్రి విశాఖ పర్యటనకు వచ్చారన్న ప్రచారం వాస్తవం లేదు. కర్మాగార పరిస్థితులపై అవగాహన పొందడానికే ఆయన వచ్చారు. సెయిల్, ఎన్ఎండీసీ, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో కేంద్రమంత్రి కుమార స్వామి సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఉన్న మార్గాలపై వారు చర్చించారు’’ అని వివరించారు శ్రీనివాస వర్మ.

ఆందోళన అవసరం లేదు: కుమార్ స్మామి

తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కూడా స్పందించారు. కర్మాగారం పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ‘‘ఈ కర్మాగారంపై అనేక మంది ఆధారపడి ఉన్నారు. దీన్ని రక్షించడం మా బాధ్యత. ప్లాంట్ మూతబడుతుందనో, ప్రైవేటు పరమవుతుందో అన్న ఆందోళన అవసరం లేదు. మోదీ నాయకత్వంలో విశాఖ ఉక్కు మరోసారి తన పూర్వవైభవాన్ని పొందుతుంది. పెరిగిన సామర్థ్యంతో దూసుకెళ్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

విలీనం అవసరం ఏముంది!

కేంద్ర మంత్రులు చెప్తున్నట్లు విశాఖ ఉక్కును మళ్ళీ తన పూర్వవైభవానికి తీసుకురావడానికే కేంద్రం ఇంత తాపత్రయపడుతుంటే.. ఇంతలో సెయిల్‌లో విలీనం ప్రతిపాదనలను ఎందుకు ప్రశ్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు. ప్రైవేటీకరణ అని చెప్పకుండే వేరే సంస్థలో విలీనం చేసి ఆ తర్వాత.. సదరు సంస్థ నష్టాల్లో ఉందని కబుర్లు చెప్పి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం ఆలోచిస్తోందని కూడా వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలా కాని పక్షంలో విశాఖ ఉక్కును ప్రభుత్వ కర్మాగారంగానే ఎందుకు కొనసాగించకూడదని, ఎన్నడూ లేనిది సెయిల్‌లో విలీనం అన్న అంశం ఇప్పుడు ఎందుకు ఊపందుకుంటుంది? అని వారు ప్రశ్నిస్తున్నారు కూడా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం ప్రయత్నిస్తోందని, నేరుగా చెప్తే మళ్ళీ ఉద్యమాలు, పోరాటాలు చేస్తారన్న భయంతో రూట్ మార్చి.. ఒకవైపు అభివృద్ధి చేస్తామని చెప్తూనే మరోవైపు సెయిల్‌లో విలీనం అంటోందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. నిజంగా విశాఖ ఉక్కు కార్మికుల సంక్షేమం, కర్మాగార అభివృద్ధి కోసమే ఈ చర్యలు చేపట్టి ఉంటే కర్మాగారాన్ని ప్రభుత్వానికి సంబంధించిన దానిగా ఉంచాలని వారు సూచిస్తున్నారు.

అంతేకాకుండా దీనిపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కు అంశం నుంచి ప్రజలకు డైవర్ట్ చేయడానికే చంద్రబాబు వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. దానిని విశ్లేషకులు కూడా అంగీకారం తెలుపుతున్నారు. మరి దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏమని స్పందిస్తాయో చూడాలి.

Read More
Next Story