
బూచేపల్లికి మద్యం కుంభకోణంతో సంబందం ఉందా?
ఇప్పటి వరకు బూచేపల్లి కుటుంబం రాజకీయ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు లేవు. మద్యం కుంభకోణం బూచేపల్లి మెడకు చుట్టుకుంటుందా?
ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై మద్యం కుంభకోణం ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలు ప్రధానంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఫోన్ సంభాషణల ఆధారంగా సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అనుమానాలు వ్యక్తం చేసినట్లు చెప్పబడుతోంది. అయితే సిట్ వద్ద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై నేరుగా ఆధారాలు లేవు.
బూచేపల్లి కుటుంబం రాజకీయ నేపథ్యం
బూచేపల్లి కుటుంబం ప్రకాశం జిల్లాలో అత్యంత రాజకీయ ప్రభావం కలిగినది. బూచేపల్లి సుబ్బారెడ్డి సహకార శాఖలో సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, చీమకుర్తిలోని తన పొలంలో గ్రానైట్ నిక్షేపాలు కనుగొని వ్యాపారవేత్తగా మారారు. ఆయన గ్రానైట్ క్వారీల ద్వారా సంపాదించిన సంపదతో పేదలకు సాయం చేస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరునిగా బూచేపల్లి సుబ్బారెడ్డి పనిచేశారు. ఆయన మరణానంతరం కుమారుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా పనిచేసి, ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆమెను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ తో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన తండ్రి సుబ్బారెడ్డి, తల్లి వెంకాయమ్మ
శివప్రసాద్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా ఆకట్టుకుంటుంది. తండ్రి మరణం, సోదరుడి మరణం వంటి వ్యక్తిగత బాధల మధ్య కూడా రాజకీయంగా ధైర్యంగా నిలబడ్డారు. దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబంపై ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు లేవు. గ్రానైట్ క్వారీలలో జరిగిన ప్రమాదాలలో మరణించిన కార్మికుల కుటుంబాలకు సాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆ సమయంలో సాక్షి తరపున ఆర్థిక సాయం అందించారు. వీరికి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. పేద విద్యార్థులకు విద్య ఫీజు రాయితీలు ఇస్తుంటారు.
బూచేపల్లి సన్నిహతుల్లో లోతైన చర్చ
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణంలో ఇరుక్కుని జైలుకు వెళ్లారు. ఎన్నికల సమయంలో మద్యం సొమ్మును ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేశారని, ఆసందర్భంలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరికొందరితో ఫోన్ లలో మాట్లాడారని, మద్యం అవినీతిలో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు సిట్ భావించింది. దీంతో కొంత కలకలం రేగింది. ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్టంలోని చాలా మంది రాజకీయనాయకులు, బూచేపల్లి కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వారిలోనూ ఈ అంశం చర్చకు దారి తీసింది. ఈ విషయంలో సిట్ అధికారుల వద్ద డాక్టర్ బూచేపల్లి వివప్రసాద్ రెడ్డి మద్యం కుంభకోణంలో ఉండొచ్చనే అనుమానానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? అనే అంశం చర్చనియాంశంగా మారింది.
మద్యం కుంభకోణం సమగ్ర చిత్రం
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. సిట్ దర్యాప్తులో రూ. 3,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తేలింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసి, ఎన్నికల ఖర్చులకు మళ్లించినట్లు సిట్ ఆరోపిస్తోంది. ప్రధాన నిందితుల్లో రాజ్ కెసిరెడ్డి, కె ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి వారు ఉన్నారు. సిట్ హైదరాబాద్, విజయవాడలో సోదాలు నిర్వహించి, నగదు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకుంది.
ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి రూ. 250-300 కోట్ల నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించినట్లు తేలింది. కాల్ డీటెయిల్ రికార్డులు (సీడీఆర్), సెల్ టవర్ డేటా, టవర్ డంప్స్ వంటి డిజిటల్ ఆధారాలు ఆయన ప్రమేయాన్ని నిరూపిస్తున్నాయి. చెవిరెడ్డి తన డ్రైవర్లు, బంధువుల పేరిట డమ్మీ కంపెనీలు సృష్టించి బ్లాక్ మనీని వైట్‌గా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిట్ రెండో ఛార్జిషీట్‌లో చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలపై ఆరోపణలు నమోదు చేసింది. మొత్తం 32 మంది వ్యక్తులు, 19 సంస్థలు నిందితులుగా ఉన్నాయి.
వైఎస్సార్సీపీ మాత్రం ఈ దర్యాప్తును రాజకీయ కుట్రగా చూస్తోంది. సిట్ బలవంతపు పద్ధతులు అవలంబిస్తోందని ఆరోపిస్తోంది. చెవిరెడ్డి కూడా తనను అన్యాయంగా ఇరికించారని, ఆరోపణలు చేసిన వారిని వదిలేది లేదని చెప్పారు.
ఫోన్ లో మాట్లాడితే కుంభకోణంతో సంబంధం ఉంటుందా?
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డితో ఫోన్ సంభాషణలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయానికి సూచికగా సిట్ చూపిస్తోంది. అయితే సిట్ దర్యాప్తు నివేదికలు, ఛార్జిషీట్లు, వార్తా కథనాల్లో బూచేపల్లి పేరు నేరుగా లేదు. సిట్ సమర్పించిన సీడీఆర్, సెల్ టవర్ డేటా వంటి ఆధారాలు ప్రధానంగా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు వంటి వారి చుట్టూ తిరుగుతున్నాయి. బూచేపల్లి కుటుంబంపై ఇప్పటి వరకు అవినీతి మచ్చ లేదు, మరి ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమా లేక నిజమా అనేది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టత రాదు.
రాజకీయంగా చూస్తే, వైఎస్సార్సీపీ నాయకులపై ఎన్డీఏ ప్రభుత్వం దర్యాప్తులు ముమ్మరం చేయడం వల్ల రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. బూచేపల్లి వంటి నాయకులు పార్టీలో కీలకంగా ఉండటం వల్ల ఈ ఆరోపణలు పార్టీ మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరిగితే మాత్రమే నిజాలు బయటపడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా బూచేపల్లిపై ఆధారాలు లేవు, కానీ రాజకీయ గాలులు మాత్రం కలకలం రేపుతున్నాయి.