
వైసీపీ నేతలకోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ లో వేటాడుతున్నారా ?
ఇపుడు పోసాని(Posani Krishna Murali)ని అయినా ఇంతకుముందు వంశీని అయినా ఏపీ పోలీసులు హైదరాబాదు(Hyderabad)లోనే అరెస్టుచేశారు
ఏపీ రాజకీయాలు రోజురోజుకు నేలబారుగా తయారవుతున్నాయి. తాజాగా వైసీపీలో ఒకపుడు కీలకంగా పనిచేసిన సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు గురువారం ఉదయం అరెస్టుచేశారు. తనకు ఆపరేషన్ అయ్యిందని, అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పినా వినకుండా పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్ళినట్లు పోసాని, ఆయన భార్య మండిపడుతున్నారు. సుమారు వారం రోజులక్రితం గన్నవరం టీడీపీ మాజీ ఎంఎల్ఏ, జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)కి సన్నిహితంగా ఉన్న వల్లభనేనివంశీ(Vallabhaneni Vamsi)ని కూడా ఏపీ పోలీసులు అరెస్టుచేశారు. ఇపుడు పోసాని(Posani Krishna Murali)ని అయినా ఇంతకుముందు వంశీని అయినా ఏపీ పోలీసులు హైదరాబాదు(Hyderabad)లోనే అరెస్టుచేశారు. ఇంకాచాలామంది వైసీపీ నేతల అడ్రస్సులను ఏపీ పోలీసులు హైదరాబాదులో సేకరించిపెట్టుకుంటున్నట్లు సమాచారం. నిజానికి వైసీపీ నేతల(YCP leaders)ను ఏపీలోని వాళ్ళ నియోజకవర్గాల్లోనే అరెస్టుచేయచ్చు. కాని వ్యూహాత్మకంగా హైదరాబాదులోనే అరెస్టులు చేస్తున్నారు.
వైసీపీ నేతలను హైదరాబాదులో అరెస్టుచేసి తర్వాత ఏపీకి తీసుకెళ్ళి కోర్టుల్లో ప్రవేశపెట్టి రిమాండుకు తరలిస్తున్నరు. తర్వాత పిటీషన్లు వేసి విచారణకు పోలీసులు తమకస్టడీకి తీసుకుంటున్నారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది కీలకనేతలను అరెస్టుచేయటం కోసం పోలీసులు రెడీగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. వైసీపీ అయినా టీడీపీ అయినా చాలామంది నేతలకు ఇళ్ళు, వ్యాపారాలు హైదరాబాదులో ఉన్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగేంతవరకు అందరు నేతలు ఉన్నది హైదరాబాదులోనే. రాజధాని హైదరాబాదే కాబట్టి చాలామంది వ్యాపారాలు, ఇళ్ళకు శాశ్వత చిరునామాగా హైదరాబాదునే చేసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగినా వ్యాపారాలు, ఇళ్ళు, ఫామ్ హౌసులు అన్నీ హైదరాబాదులోనే కంటిన్యు అవుతున్నాయి.
అధికారంలో వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా అధినేతలు జగన్, చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)తో పాటు చాలామంది కీలక నేతల అడ్రస్ మాత్రం హైదరాబాదే అనటంలో సందేహంలేదు. 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతల మకాం ఎక్కువగా హైదరాబాదులోనే ఉండేది. ఇపుడు అదేపద్దతిలో వైసీపీ నేతలు కూడా ఉంటే తమ నియోజకవర్గాల్లో లేకపోతే హైదరాబాదులో ఉంటున్నారు. ఈ విషయాలు పోలీసులకు బాగా తెలుసు కాబట్టే హైదరాబాదులోని వైసీపీ నేతల అడ్రస్సులు సేకరించి పెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఎవరిని అరెస్టుచేయాలనే ఆదేశాలు రాగానే హైదరాబాదులోని టార్గెట్ నేతను అరెస్టుచేయటానికి పోలీసులు రెడీగా ఉన్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా టార్గెట్ నేతల ఇళ్ళ చుట్టూ ముందుగా రెక్కీ చేస్తున్నారు. ఆదేశాలు రాగానే కేసులు పెట్టి తర్వాత సడెన్ గా ఇంటిపైన దాడిచేసి అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకెళ్ళిపోతున్నారు. రెక్కీ అన్న పదాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ఉపయోగించారు. హైదరాబాదులోని తమ ఇళ్ళు, ఆఫీసుల ముందు ఏపీ పోలీసులు తిరుగుతున్నట్లు గతంలో పెద్దిరెడ్డి చేసిన ఆరోపణలు గుర్తుండే ఉంటాయి. అరెస్టుచేయదలచుకుంటే తమను హైదరాబాదులో అరెస్టుచేయాల్సిన అవసరం ఏముందని, తాము నియోజకవర్గాల్లో ఉన్నపుడే అరెస్టుచేయచ్చు కదాని పెద్దిరెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానం లేదు.
ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టుచేశారు. చాలారోజుల తర్వాత నందిగం బెయిల్ పై బయటకు వచ్చారు. మాజీ ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా చాలారోజులు జైల్లో ఉండి బెయిల్ పై రిలీజయ్యారు. మాజీమంత్రి జోగిరమేష్, ఎంఎల్సీ తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, కొడాలినాని, పేర్ని నేని భార్య తదితరులు చాలామంది మీద తండ్రి, కొడుకులు చంద్రబాబు, లోకేష్(Lokesh Nara) టార్గెట్ పెట్టిన విషయం తెలిసిందే. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ నేతలను టీడీపీ టార్గెట్ చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చాలామంది నేతలపైన ఏదో కేసు నమోదవుతునే ఉంది. అందుకనే అరెస్టుభయంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాల నుండి వచ్చేసి హైదరాబాదులో ఉంటున్నారు.
కక్షసాధింపు రాజకీయాలు మొదట టీడీపీతోనే మొదలయ్యాయి. సమైక్యరాష్ట్రంలో మరీ ఇంతస్ధాయిలో రాజకీయాలు నేలబారుగా ఉండేవికాదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు మొదట సీఎం అయ్యారు. జగన్ మీదున్న మంటతో చాలామంది వైసీపీ ఎంఎల్ఏలు, నేతలపైన కేసులుపెట్టి ఇబ్బంది పెట్టారు. తర్వాత రెండో ఎన్నికలో జగన్ అధికరంలోకి రావటంతో వైసీపీ ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరించింది. ఇపుడు మళ్ళీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగానే చెప్పినట్లుగా వైసీపీ నేతలపైన కేసులు, అరెస్టుల బాధ్యతను ప్రత్యేకంగా లోకేష్ భుజానికి ఎత్తుకున్నాడని స్వయంగా జగనే ఆరోపిస్తున్నారు. అందుకనే ఎక్కడెక్కడి నేతలపైనా వెతికి వెతికి కేసులుపెట్టి మరీ అరెస్టులు చేయిస్తున్నట్లు వైసీపీ అధినేత మండిపడుతున్నాడు. ఇందులో భాగంగానే హైదరాబాదులోని నేతల ఇళ్ళు, ఆఫీసుల అడ్రస్సులను పట్టుకుని ముందుజాగ్రత్తగా పెద్దిరెడ్డి ఆరోపించినట్లుగా రెక్కీ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది వైసీపీ నేతలను హైదరాబాదులో అరెస్టు చేస్తారో చూడాల్సిందే.