
పెట్టుబడి దారీ వ్యవస్థలో అసమానతలు లేని సమాజం సాధ్యమా?
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీ-4 విధానం పెట్టుబడి దారుల దయపై ఆధారపడి ఉంటుంది?
పేదరికం నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 విధానం (పబ్లిక్-ప్రైవేట్-ఫిలాంత్రపిస్ట్ పార్టనర్షిప్) ఒక నూతన ప్రయోగం. ఇది దాతల దయపై ఆధారపడి ఉన్నదా? లేదా వ్యవస్థాత్మక మార్పులకు దోహదం చేసే మోడలా? ఈ విధానం ద్వారా పేద కుటుంబాలను 'బంగారు కుటుంబాలుగా' దత్తత తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నా, నిజంగా ఇది వ్యవస్థలో అసమానతలను తగ్గించగలదా అన్నదే ప్రధాన ప్రశ్న.
దీని విస్తరణకు బలమైన వ్యవస్థలు అవసరం. ఆగస్టు 10 సర్వే, ఆగస్టు 15 దత్తత లక్ష్యం వంటి గడువులు పాలకులపై వత్తిడిని పెంచుతాయి. విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు పెద్దగా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అంటే ఇక్కడ అధికారులు, ఉద్యోగులపై వత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు పేదలను దత్తత తీసుకోవాలనే ప్రభుత్వ వత్తిడిని ఎవ్వరూ మర్థించరు. కేవలం మానవతా దృక్పదం మాత్రమే పేదవాడి జీవితాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు టీచర్ల కుటుంబాలు పేదలను దత్తత తీసుకోవాలనే ఆదేశాలు పాలకుల ఒంటెత్తు పోకడలను గుర్తు చేస్తున్నాయి. బలవంతపు ప్రయోగాలు ఎప్పుడూ సక్సెస్ కావు.
స్పష్టమైన మార్గదర్శకాలు ఏవి?
పారదర్శకత, జవాబుదారీతనం కీలకం. కామన్ ఫండ్, డిజిటల్ ప్రచారం సానుకూల దశలు, నిధుల కేటాయింపు వంటి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. ఎన్‌ఆర్‌టీలు, కార్పొరేట్‌ల భాగస్వామ్యం బలం. కానీ దీనికి పన్ను రాయితీలు, గుర్తింపు వంటి ప్రోత్సాహకాలు అవసరం అవుతాయి.
కుటుంబాల సాధికారతపై దృష్టి సుస్థిర అభివృద్ధి సూత్రాలకు అనుగుణంగా ఉంది. కానీ నిరుద్యోగం, ఆరోగ్య సేవలు, చదువు నాణ్యత వంటి నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించకపోతే ప్రభావం పరిమితమవుతుది. కేపీఎంజీ, మిలాప్ వంటి సంస్థల భాగస్వామ్యం ఆశాజనకం, కానీ వాటి పాత్రలు స్పష్టంగా నిర్వచించాలి. ఏమి చేస్తున్నారో స్పష్టం చేయాలి.
పీ4 కార్యక్రమం విజయవంతమవుతుందా?
పీ4 కార్యక్రమం విజయం ప్రభుత్వం, సంపన్న వ్యక్తులు, సమాజం మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఆగస్టు 15, 2025 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలని లక్ష్యం. కానీ 57,503 మార్గదర్శుల ద్వారా 5,74,811 కుటుంబాలు మాత్రమే దత్తత తీసుకోగలిగారు. ఇంకా 2 లక్షల మార్గదర్శుల అవసరం ఉంది. పల్నాడు జిల్లా దత్తతలలో ముందుండగా, విశాఖపట్నం వెనుకబడింది. ఇది ప్రాంతీయ అసమానతలను సూచిస్తుంది.
మార్గదర్శులను వెతకడం ఓ సవాల్
ఆగస్టు 15,2025 నాటికి 2 లక్షల మార్గదర్శులను సమీకరించడం సవాలు. జిల్లా కలెక్టర్లు, కార్పొరేట్‌లు, మార్గదర్శుల మధ్య సమన్వయం కీలకం. దీర్ఘకాల నిధులు, మార్గదర్శుల నిబద్ధతపై స్పష్టత లేదు. నిరంతర సాయం లేకపోతే కుటుంబాలు తిరిగి పేదరికంలోకి పోవాల్సిందే. కామన్ ఫండ్, ఆన్‌లైన్ అవగాహన ఉన్నప్పటికీ, నిధుల దుర్వినియోగ నివారణ, సమాన పంపిణీకి విధానాలు స్పష్టం కావాలి. విశాఖపట్నం వంటి జిల్లాల వెనుకబాటు సమాన దత్తత రేట్ల కోసం ప్రత్యేక ప్రయత్నాల అవసరాన్ని చూపిస్తుంది.
1. దత్తత అంటే ఏమిటి?
పీ4 కార్యక్రమంలో దత్తత అంటే సంపన్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌టీలు, కార్పొరేట్ సంస్థలు బంగారు కుటుంబం సామాజిక, ఆర్థిక ఉద్ధరణకు బాధ్యత తీసుకోవడం. చదువు, ఉపాధి, నైపుణ్య అభివృద్ధిపై సలహాలు ఇవ్వటం. చదువు, ఆరోగ్యం వంటి నిర్దిష్ట అవసరాలకు నిధులు ఇవ్వటం. వనరులు, నెట్‌వర్క్‌లు, అవకాశాలకు అనుసంధానం చేసుకుని అడుగులు వేయడం. దత్తత చట్టపరమైన ప్రక్రియ కాదు. స్వచ్ఛంద బాధ్యత. వ్యక్తిగత దత్తతలకు కాలపరిమితి లేదు. కానీ నిర్దిష్ట నిధులకు కాలపరిమితి ఉంటుంది.
2. కుటుంబానికి సాయం చేయడం అంటే ఏమిటి?
పీ4 కార్యక్రమంలో సాయం చేయడం అంటే ఎలా ఉంటుందనేది పెద్ద ప్రశ్న. వైద్య అత్యవసరాలు, పాఠశాల ఫీజుల వంటి తక్షణ అవసరాలకు నగదు సాయం. “ఫండ్ ఎ నీడ్” విధానం కింద కాలపరిమితితో అడుగులు వేయాల్సి ఉంటుంది. మార్గదర్శనం, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత దత్తత లేని కుటుంబాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా గ్రామాలకు ప్రయోజనం చేకూరేలా చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 10, 2025 నాటికి పూర్తయ్యే కుటుంబ అవసరాల సర్వే ఆధారంగా సాయం అనుకూలిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
3. పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందుతుందా?
పీ4 కార్యక్రమం పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందిస్తుంది. మార్గదర్శులు పాఠశాల ఫీజులు, యూనిఫాంలు, పుస్తకాలు, కోచింగ్‌కు నిధులు ఇవ్వవచ్చు. చదువును సర్వే ప్రాధాన్య అవసరంగా గుర్తిస్తుంది. మార్గదర్శులు ఆర్థిక, ఆర్థికేతర (ఉదా. కెరీర్ కౌన్సెలింగ్) సాయం అందిస్తారు.
4. వ్యాపారాలకు రుణాలు ఇస్తారా?
“ఫండ్ ఎ నీడ్” విధానం కింద చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం అందవచ్చు. రుణాలుగా స్పష్టంగా పేర్కొనకపోయినా, నగదు సాయం, ప్రారంభ మూలధనం, సామగ్రి ఖర్చులను కవర్ చేయవచ్చు. సాయం మార్గదర్శి ఇష్టానుసారం లేదా గ్రాంట్ రూపంలో ఉంటుంది.
5. ఇళ్లు కట్టిస్తారా?
పీ4 కార్యక్రమం ఇళ్ల నిర్మాణాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. కానీ సమాజ దత్తత (మూడో విధానం) మౌలిక సదుపాయాల అభివృద్ధిని కలిగి ఉంటుంది. కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా గృహ మెరుగుదలలు సాధ్యమవుతాయి. ఇళ్ల సాయం కార్పొరేట్ నిబద్ధత, కుటుంబ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
6. అనారోగ్యానికి కార్పొరేట్ వైద్యం చేస్తారా?
కార్యక్రమం మార్గదర్శులను ఆరోగ్య అవసరాలకు సాయం చేయాలని ప్రోత్సహిస్తుంది. ఇందులో కార్పొరేట్ వైద్య సేవలు (వైద్య శిబిరాలు, ఆసుపత్రి చికిత్స, బీమా పథకాలు) ఉన్నాయి. ఆగస్టు 10, 2025 సర్వే ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా గుర్తిస్తుంది. మార్గదర్శులు ఆర్థిక, లాజిస్టిక్ సాయం అందిస్తారు.
7. సాయం, చేయూత అంటే ఏమిటి?
వైద్య బిల్లులు, పాఠశాల ఫీజులు, ఆదాయ, ఉత్పాదక కార్యకలాపాలకు నగదు. రాష్ట్ర స్థాయి దాతల నిధులను కామన్ ఫండ్ ద్వారా కుటుంబాలకు అందిస్తారు. మార్గదర్శనం, నైపుణ్య శిక్షణ, ఉపాధికి అనుసంధానం చేస్తారు. నీటి సరఫరా, రోడ్లు, పాఠశాలలు, క్లినిక్‌ల వంటి మౌలిక సదుపాయాలు గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కుటుంబాలు, మార్గదర్శులకు అవగాహన కల్పిస్తారు. ఇది ప్రభుత్వం చేపట్టే ఆలోచనపై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.
ఆర్థిక రంగంలో రాజకీయాలు వద్దు: ఫ్రొఫెసర్ చలం
పబ్లిక్ అంటే పీపుల్ కాదా? వేరుగా ఉంటారా? కన్ఫ్యూజన్ ఎందుకు? రాజకీయాలు వద్దు? ఆర్థికాభివృద్ధిలో రాజకీయాలు నష్టం చేకూరుస్తాయని ఫ్రొఫెసర్ కేఎస్ చలం అన్నారు. పీ4 పై మాట్లాడాల్సిందిగా ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధి కోరినప్పుడు ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అధికారంలోకి రావడానికి రాజకీయాలు కావాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే బాగా నష్టపోయింది. చంద్రబాబు అనుభవం గల వ్యక్తి. రాజకీయాలు బాగా తెలిసిన వాడు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏపీకి కావాల్సిన ప్రత్యేక హోదా తీసుకు రాగలిగితే మంచిదని హితవు పలికారు. కేంద్రం విభజన హామీల్లో భాగంగా ఇస్తామన్న నిధులు తీసుకు రావాలి. జన్మభూమి చేశాడు. ఎలా చేశాడో ఆయనకు తెలుసు. దాని గురించి మరిచిపోయాడా? ఎవరికోసం ఈ పి4 విధానం. జన్మ భూమి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేశాడు. ఏ కార్యక్రమమైనా సక్సెస్ కావాలంటే ప్రజలు అందులో ఇన్వాల్స్ కావాలి. జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేపడితే గ్రామాలకు మేలు జరుగుతుంది. పీ4 అంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పాట్నర్ షిప్ అనాల్సి ఉంటుంది. ఎందుకు ఇటువంటి వ్యర్థ ప్రయోగాలు చేస్తారోనని అన్నారు.
లాభం లేని పని పెట్టుబడి దారులు ఎందుకు చేస్తారు?: మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు
ధర్మకతృత్వ సిద్ధాంతం అని 70 ఏళ్ల కితం మహాత్మా గాంధీ పెట్టాడు. పేదవాళ్లకు డబ్బున్న వారు అండగా ఉండాలన్నారు. అది ఏమైందో తెలియంది కాదని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మన్ రావు అన్నారు. ప్రస్తుతం పెట్టుబడి దారులను మార్గదర్శకులు, పేదలను బంగారు కుటుంబాలు అంటున్నారు చంద్రబాబు నాయుడు. పెట్టుబడి పెట్టేవారు లాభం ఉంటేనే చేస్తారు. కంపెనీలకు లాభం ఉంటేనే ఈ పనులు చేస్తారు. ప్రభుత్వం పని సంక్షేమం, అభివృద్ధి సాధించడం. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటిది జరగలేదు. జరగదు కూడా అని ఆయన పేర్కొన్నారు.
జీరో పావర్టీ పీ4 కార్యక్రమం సహకార పేదరిక నిర్మూలనలో ధైర్యమైన ప్రయోగం. దీని విజయం మార్గదర్శుల సమీకరణ, పారదర్శకత, ప్రాంతీయ అసమానతల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణలు ఆశను కలిగిస్తాయి, కానీ నిరంతర ప్రయత్నం, వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. సక్రమంగా అమలు జరిగితే పీ4 పేదరిక నిర్మూలనకు ఆదర్శంగా నిలుస్తుంది. లేకపోతే శుభాకాంక్షతో కూడిన తాత్కాలిక ప్రయత్నంగా మిగిలిపోతుంది. రాబోయే నెలలు దీని దిశను నిర్ణయిస్తాయి