
వైసీపీ కుట్రలపై విచారణ
రాష్ట్రానికి వైసీపీ పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకుంటోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రానీకుండా వైసీపీ అడ్డుకుంటోందని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా వివిధ సంస్థలకు మెయిళ్లు పెడుతోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తోన్న ఈ కుట్రలపైన విచారణ చేపడుతామన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రానీకుండా అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందనే అంశాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని దాదాపు 200 సంస్థలకు వైసీపీ వాళ్లు మెయిల్స్ పెట్టారని కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు.
ఇటీవల టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యేల మీద అసహనం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కొంత మంది మంత్రులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు, తాను ఆశించిన మేరకు మంత్రులు పని చేయడం లేదని, మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను కించపరిస్తే ఎందుకు స్పందించడం లేదని మంత్రులను సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చాలా అప్రమత్తంగా ఉండాలని, జగన్ కుట్రలను ఎక్కిడికక్కడ, ఎప్పటికప్పుడూ తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించడంలో మంత్రులు విఫలమయ్యారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిలో ఆందోళనలు మొదలయ్యాయి. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో అనే ఆందోళనలు వారిని వెంటాడుతున్నాయి.
Next Story