శివరాంపురం నువ్వులకు అంతర్జాతీయ గుర్తింపు
నువ్వు పంట పండించిన రైతులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 140 దేశాల్లో అమ్ముకునేందుకు వారికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం వారికి ఎలా వచ్చింది?
ఆంధ్రప్రదేశ్‌లోని 15 మంది రైతులు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా నువ్వులు పండించారు. ఈ నువ్వులకు ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు వచ్చింది. రసాయన ఎరువులు లేకుండా పండించినందున పంటలకు మంచి గిరాకీ పెరుగుతున్న విషయం తెలిసిందే. వీరు పండించిన నువ్వుల పంట వెనుక వ్యవసాయ శాఖ అధికారుల కృషి కూడా ఉంది.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన రైతులు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నువ్వు పంటపై రైతులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే ఈ పంటపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చేలకు కంచె లేకపోతే మేకలు కొమ్మల చివర్లు కొరికి తింటాయి. ఇలా జరిగితే పంట చేతికి వచ్చే అవకాశం లేదు. మాగాణి పొలాల్లో పొలాల గట్ల మధ్య కంచెవేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. వరి పంట కోయగానే బీడుగా వదిలేస్తారు. ఆ తరువాత సమృద్ధిగా నీరు ఉంటే రెండో పంట వేస్తారు. లేదంటే మొదటి పంటతోనే సరిపెట్టు కుంటారు. తాళ్లూరు మండలంలోని పలు ప్రాంతాలకు నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఒక్క పంటకు మాత్రమే నీళ్లు అందుతాయి. రెండో పంటకు నీరు ఉండదు. అయితే కరీఫ్ పంట కోత పూర్తయిన తరువాత రబీ సీజన్‌లో ఈ నువ్వుల పంటను ఎక్కువ మంది ఆరుతడి పంటగా వేసేందుకు రైతులు మొగ్గు చూపుతారు.
వ్యవసాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ
తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన రైతుల ద్వారా నువ్వుల పంట వేయిస్తే బాగుంటుందని వ్యవసాయ శాఖ వారు భావించారు. అందులోనూ ప్రకృతి వ్యవసాయం చేయిస్తే దిగుబడికి తగిన ఫలితం కూడా ఉంటుందని భావించిన మండల వ్యవసాయాధికారులు జిల్లా వ్యవసాయాధికారుల ప్రోత్సాహంతో నువ్వు పంట వేసేందుకు నిర్ణయించారు. 2023–24 సంవత్సరంలో రబీ పంటగా శివరాంపురం రైతుల నుంచి నువ్వులు పండించేందుకు 15 మంది రైతులను వ్యవసాయాధికారులు ఎంపిక చేశారు. 14 వారాల పాటు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ నువ్వు పంటను సాగు చేశారు.
నువ్వు పంటకు ఒక్క తడి నీరు పెడితే సరిపోతుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంట పండించారు. విత్తనాల నుంచి పంట పండే వరకు వ్యవసాయాధికారులు దగ్గరుండి రైతులతో పంట వేయించడంతో మంచి దిగుబడులు వచ్చాయి. కేవలం సేంద్రీయ ఎరువులు మాత్రమే వాడటం వల్ల ఆరోగ్యకరమైన నువ్వులు పండించ గలిగారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిని చొరవ తీసుకోవడంతో సేంద్రీయ వ్యవసాయంపై రైతులు దృష్టిపెట్టారు.
గుర్తింపు ఎలా వచ్చింది?
రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన నువ్వు పంటను సేకరించిన జిల్లా వ్యవసాయాధికారి బి శ్రీనివాసరావు బెంగుళూరులోని యురేకా ఎనలిటికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో మంచి ఉత్పత్తులుగా నిర్థారణ అయింది. దీంతో గ్లోబల్ మార్కెటింగ్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ఆమోదించి స్కోప్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్ ద్వారా 140 దేశాలలో నువ్వు పంటను అమ్ముకోడానికి అవకాశం లభించింది. దీనికి ఇండి గ్యాప్ ధృవీకరణ అవసరం. ఈ సర్టిఫికెట్ పొందాలంటే మేలైన సాగు పద్దతుల ద్వారా పంట పండించాల్సి ఉంటుంది. ఇందుకు వ్యవసాయ శాఖ వారు సహకరించడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు పంటను ప్రకృతి వ్యవసాయ పద్దతిలో రైతులు పండించారు.
ఎకరాకు రూ. 40 వేలు ఆదాయం
ఎకరా పొలంలో నువ్వు పంట పండించేందుకు రైతులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వరి పంట కోసిన తరువాత నువ్వు పంట రబీలో ఆరుతడి పంటగా వేసుకుంటే సరిపోతుంది. ఈ సందర్భంగా ది ఫెడరల్ ప్రతినిధితో రైతులు నారిపెద్ది వెంకటేశ్వర్లు, మన్నం వేణు, వేమిరెడ్డి రవీంద్రరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరెడ్డి, ముప్పనేని రామంజి, వద్దినేని సుబ్బారావులు మాట్లాడుతూ తాము గత సంవత్సరం అక్టోబరులో పంట వేసినట్లు తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా పండించడం వల్ల మా పంటకు మంచి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. పంట వేసేందుకు విత్తనం, దున్నకం ఖర్చులు కలుపుకుని ఎకరాకు రూ. 12 వేల వరకు ఖర్చవుతుందన్నారు. అయితే దిగుబడి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు ఉంటుందని, క్వింటా నువ్వులు ప్రస్తుతం మార్కెట్లో రూ. 10వేల వరకు ఉన్నాయన్నారు. ఎకరాకు రూ. 40 నుంచి రూ. 50వేల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉంటుందని, ఆదాయ బాగా ఉన్నందున ఇకపై ప్రతి సంవత్సరం నువ్వు పంట పండిస్తామన్నారు. పైగా విదేశాల్లో అమ్ముకునేందుకు కొనుగోలు చేసే వారు మరో వెయ్యి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచంలోని 140 దేశాల్లో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు ఉన్నందున మా పంటకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు.
అభినందించిన కలెక్టర్
నువ్వు పంట పండించిన 15 మంది రైతులు శనివారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్‌ను ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలిసారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు నేతృత్వంలో కలిసి రైతులు పండించిన నువ్వు పంటకు వచ్చిన గుర్తింపు గురించి వివరించారు. దీంతో కలెక్టర్ రైతులను అభినందించారు.
Next Story