ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు మేధావుల విన్నపం
x

ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు మేధావుల విన్నపం

ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఇతర రావలసిన రాయితీలు అనేవి ముగిసిన చాప్టర్ అని బూటకపు మాటలు చెప్పేవారు ఆంధ్ర ద్రోహులుగా తీర్మానించిన మేధావులు.


ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పది మంది మేధావులు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేయాలని వారు కోరారు. ఈ సందర్బంగా చంద్రబాబు, ఆయన కేబినెట్‌కు చలసాని శ్రీనివాస్, కే రామకృష్ణ, వి శ్రీనివాసరావు, జేడీ లక్ష్మీనారాయణ, సుంకర పద్మశ్రీ , తాటికొండ నరసింహారావు, దోనేపూడి శంకర్, వి ఉమా మహేశ్వర రావు, పోతుకూచి ఉమాబట్టిశ్వర శర్మ, జీవీ రంగారెడ్డి, వీ రవీంద్రనాథ్, జి కోటేశ్వరరావు, జి ఈశ్వరయ్య, పరుచూరి రాజేంద్ర,పెనుమత్స దుర్గాభవాని పలు సూచనలు చేశారు. ఈరోజు నిర్వహించిన ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కార్యవర్గ సమావేశంలో వారు ఈ విజ్ఞప్తి చేశారు. వారు సూచనలు యథాతథంగా..

‘‘రాష్ట్రంలో చరిత్రలో కనీవినీ ఎరగనంత మెజార్టీతో తెదేపా జనసేన + కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, 25 మంది మంత్రుల మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ముందుగా వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

1. ఆంధ్రప్రదేశ్ విభజన ఒక కండిషనల్ విభజన. పార్లమెంట్లో ఇచ్చిన హామీలు, బిల్లులో పెట్టిన హామీలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 36 మంది పార్లమెంట్ సభ్యులు మీద ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు మొత్తం విభజన హామీల్లో ఒక పది శాతం మాత్రమే అమలు చేసి ఉంటారు. ఇప్పుడు కచ్చితంగా అన్ని విభజన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసి సాధించాలి.

ప్రత్యేక హోదా 10-13 సంవత్సరాల లోపు ఎనౌన్స్ చేయాలి అంటూ ఒక టైమ్ లిమిట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మొట్టమొదటి సంతకంగా ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవారు. ఈశాన్య రాష్ట్రాలలో ఇంకా ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు అమలు అవుతూనే ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు ప్రత్యేక హోదా రాయితీలు అనేవి ముగిసిన చాప్టర్ అని బూటకపు మాటలు చెప్పేవారు ఆంధ్ర ద్రోహులుగా తీర్మానిస్తున్నాం.

2. 2019 లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అసెంబ్లీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేతృత్వం అసెంబ్లీ కూడా ప్రత్యేక హోదా విభజన హామీలపై ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేసి ఉన్నాయి. ఆ కాపీని మరోసారి కేంద్రానికి పంపించాలని కోరుచున్నాము.

3. పోలవరం ప్రాజెక్టు రాతి-మట్టి కట్టడానికి ఏదో నిధులు సరిపెట్టి కేంద్రం మోసగించాలని చూస్తుందని భయంకర వార్తలు వస్తున్నాయి. పునరావాస ప్యాకేజీ పూర్తిగా కేంద్రం బాధ్యతగా ముందే అమలు చేయాలి, 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టి 960 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తేనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిందని భావించాలి తప్ప, కేంద్ర ప్రభుత్వంలోని కొందరి మాయలో పడిపోయి రాతి-మట్టి ఆనకట్ట అయిపోతే ప్రాజెక్టు పూర్తయిపోయింది అనుకోవద్దు. గిరిజనులను, ముంపు గ్రామాల ప్రజలను ముంచి ఆ నీటితో పండగ చేసుకోవాలని ఏ ఆంధ్రుడు అనుకోడు. పోలవరం ప్రాజెక్టు ఆర్ఆర్ ప్యాకేజీ నిధులు కేంద్రం ఎగ్గొట్టే ప్రణాళికలకు ఏ ఆంధ్రుడు మద్దతు ఇచ్చిన వారు ఆంధ్రకి తీరని అన్యాయం చేసినట్లే.

4. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీకి ఇంతవరకు ప్రత్యేకంగా ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వలేదు, అలాగే రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు ( దీనికి భూసేకరణ ఎప్పుడో అయిపోయింది) కేంద్ర ప్రభుత్వ రంగంలో ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉంది. అదేవిధంగా చెన్నై- విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూర్- చెన్నై వెళ్లే ఇండస్ట్రియల్ కారిడార్ కి అనంతపురం కృష్ణపట్నం అనుసంధానం చేయటం, దాదాపు లక్ష 43 వేల కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తుల్లో 58 శాతం ఆంధ్ర ప్రదేశ్ కి తెచ్చుకోవడం, నీటిపారుదల ఇతర విషయాలపై తెలంగాణతో అంగీకారానికి రావడం దీనిలో కేంద్రం ముఖ్యపాత్ర పోషించాలి.

అనేక విద్యా ఇతర సంస్థలు పెట్టి పదేళ్లయిన దాని మొత్తం ప్రాజెక్టు ఖర్చులు ఇంతవరకు 20% కూడా ఖర్చు అవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. వాటిని వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలి. హైదరాబాద్లో వందలాది కేంద్ర ప్రభుత్వ సంస్థలు 1956 నుంచి ఏర్పరిచారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కనీసం ఒక 50 సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

5. ఆంధ్రప్రదేశ్ కి కొత్త ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఎస్ ఓ టి ఆర్ కంటే ఈ హామీలు చాలా అధికంగా ఉన్నాయి. అందువల్ల ప్రత్యేక హోదా, విభజన హామీలు గనుక సాధిస్తే కేంద్ర నుంచి అత్యధిక నిధులు వస్తాయి. అనేక పరిశ్రమలు వేలాదిగా రావడానికి కాకుండా 40-50 లక్షల అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి. అందుకనే వాటి మీద దృష్టి పెట్టాలని కోరుచున్నాము.

6. అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వటమే కాకుండా ఆ నగర మౌలిక వసతులు సదుపాయాలు కల్పన కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని చట్టంలో ఉంది. కేంద్రం ఏమో దానికి ప్రత్యేకంగా 1500 కోట్లు మాత్రం ఇచ్చి ఊరుకుంది. అందువల్ల అన్ని వర్గాలకి అలవాలంగా, గొప్ప హరిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతూ సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధికి కూడా చేయాలని కోరుచున్నాము.

7. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగుజాతి ప్రజల ఆత్మ త్యాగంతో రక్త తర్పణంతో ఏర్పడింది. ఇప్పుడు మన తెలుగు బిడ్డలే వివిధ స్థాయిల్లో బొగ్గు శాఖ, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. తక్షణమే విశాఖ ఉక్కు కర్మాగారంకు కాప్టివ్ మైన్స్ వెంటనే కేటాయించాలని అదే విధంగా హోదా, విభజన హామీల పారిశ్రామిక రాయితీలు కోసం పరిశ్రమ శాఖ సహాయ మంత్రి తక్షణమే స్పందించాలని మన తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని కోరుచున్నాము. ఆరు అలాంటి పనులు చేస్తే చరిత్రలో స్థానం ఉంటుంది లేదా చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు.

8. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ప్రత్యేక హోదా పై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అది కూడా 25 పార్లమెంట్ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న ఆయన దాదాపు 33 మంది పార్లమెంట్ సభ్యులు ఆయన ఇచ్చినా సరే ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై కేంద్రాన్ని గట్టిగా నిలదీసిన దాఖలాలు లేవు. ఐదేళ్లలో ఒక అఖిలపక్షం కూడా వేయలేదు. అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ఆఖరికి ఆయన ఇంటి ముట్టడికి వెళ్లిన సాధన సమితి నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టారు.

9. అన్ని వర్గాల ప్రజలకు ఆలవాలంగా ఉండేటట్లు గొప్ప హరిత రాజధానిగా అమరావతి నిర్మాణం కావాలని సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధికి కేంద్రీకరణ కూడా చేయాలనేది మా డిమాండ్. ఆ విషయంలో ఉద్యమించిన మా ముఖ్య నేతలపై అనేక కేసులు అక్రమంగా బనాయించారు.

10. ఇదే కాక గత 10 సంవత్సరాల బడ్జెట్లలో కూడా ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు త్రిబుల్ ఇంజన్ సర్కారు అంటూ వచ్చిన కేంద్రం వారి పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిమీద పిడతడు మట్టి, చెంబుడు మురికి నీళ్లు కొట్టి పోయారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత వినయంగా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చినా సరే విభజన హామీలు ప్రత్యేక హోదా ముఖ్యమైన విషయాల్లో మొండి చేయి చూపించారు.

11. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీలు ప్రత్యేక హోదా రాయితీలు వీటిపై అఖిలపక్షాల సంఘాల సమావేశం సమయం చూసుకుని నిర్వహించాలని కోరుచున్నాము.

రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా అదే సమయంలో వచ్చే వారం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా చట్టసభల ప్రతినిధులకు, అన్ని ముఖ్య పార్టీల వారికి దయచేసి ఇది మన హక్కుల సాధన కోసం తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మంచి సమయంగా భావిస్తూ వాటి మీద దృష్టి పెట్టాలని కోరుచున్నాము. కేంద్ర ప్రభుత్వంలో ఆదానీజీ అండ్ కో చక్రం తిప్పి ఇతర మార్గాల ద్వారా ఉత్తర భారతీయ జనతా పార్టీకి మెజార్టీ చేసే పరిస్థితి వస్తే మనకున్న అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇదే మన హక్కుల సాధన కోసం బంగారు సమయంగా భావించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విన్నవిస్తున్నాము.

ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీటి అమలుకు కొన్ని నెలల సమయం ఇవ్వాలని భావిస్తున్నాము. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ సాధించలేక పోతే అప్పుడు ఉద్యమ బాట చేపడుతాము తప్ప అంతవరకు మా వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా సంపూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నిలబడతామని హామీ ఇస్తున్నాం’’ అని వారు ప్రకటనలో తెలిపారు.

Read More
Next Story