రామాయణంలో పిడకల వేటలా... కర్నూలు పోలీసుల దర్యాప్తు!
x
నాగార్జున రెడ్డి, పక్కన ఆయన పెట్టిన పోస్టు

రామాయణంలో పిడకల వేటలా... కర్నూలు పోలీసుల దర్యాప్తు!

కల్తీ మద్యం ఎక్కడుందో కనుక్కోమంటే పోలీసులు నోటీసు ఇస్తారా


కర్నూలుకు సమీపంలో బస్ తగలబడి 19 మంది సజీవ దహనం అయిన కేసులో పోలీసుల దర్యాప్తు దిశ దారి తప్పిందా? ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా మారుతోందా? ప్రాణాలు కోల్పోయిన ఘటనకు కారణాలేంటో వెలికితీయాల్సిన సమయంలో, పోలీసులు ప్రజల అభిప్రాయాలపై వేట ప్రారంభించారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

పోలీసుల తీరు రామాయణంలో ‘పిడకల వేట’ను తలపిస్తోందన్నారు రాయలసీమ విమోచన సమితీ క్రియాశీల కార్యకర్త తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి. అసలు లక్ష్యాన్ని పక్కదారి పట్టించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. మంటల్లో బస్సు దగ్ధమైంది, కానీ విచారణ మంటల్లో సత్యం దగ్ధమవుతోందని నాగార్జున రెడ్డి ఆరోపించారు.
అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద వి.కావేరీ ట్రావెల్స్ బస్ దహనమై 19 మంది సజీవ దహనం అయ్యారు. ఆ ఘటనకు మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నడిపిన ద్విచక్ర వాహనమే కారణమని పోలీసులు తేల్చారు. ఆ ఘటనపై నాగార్జున రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

"బైక్ తోలిన వ్యక్తి పెట్రోల్ పోయించుకున్న పెట్రోల్ గురించి మాత్రమే మనం ఆ వ్యక్తి తాగిన కల్తీ మద్యం గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఆ వ్యక్తి ఆ టైంలో కూడా తాగడానికి ఎక్కడ బెల్ట్ షాపులు దొరికాయే బతికిన వ్యక్తిని విచారించి చర్యలు తీసుకోవాలి" అని తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. దీనికి పోలీసులు ఆయనకు నోటీసు ఇచ్చారు.
పోలీసుల నోటీసులో ఏముందంటే...
BNSS చట్టం సెక్షన్‌ 35 (3) కింద కర్నూలు జిల్లా పోలీసులు నాగార్జున రెడ్డికి తాడిపత్రి వెళ్లి నోటీసు ఇచ్చారు. అందులో "Cr.No.385/2025 U/s 352, 353 (1)(b), 186 (1), 61(2) BNSS కేసు దర్యాప్తు సందర్భంగా, కర్నూలు తాలూకా యూపీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదు అయిన ఎఫ్‌.ఐ.ఆర్‌కి సంబంధించి, మీరు చేసిన కొన్ని వ్యాఖ్యలు లేదా పరిస్థితులపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాం.
అందువల్ల, మీరు ఈ నోటీసు అందుకున్న తేదీ నుండి మూడురోజుల లోగా కర్నూలు వచ్చి కొండారెడ్డి బురుజు వద్ద నున్న ఎస్‌పీడీవో కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తున్నాం" అని పేర్కొన్నారు.

దాంతో పాటు పాటించవలసిన నిబంధనల పేరిట మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అవి..
a) ఇకముందు ఎటువంటి నేరం చేయరాదు.
b) కేసులో ఉన్న ఆధారాలు లేదా సాక్ష్యాలను ఏ విధంగానూ చెడగొట్టరాదు.
c) కేసుకు సంబంధించి తెలిసిన విషయాలను దాచిపెట్టకూడదు లేదా ఇతరులను ప్రభావితం చేయకూడదు.
d) దర్యాప్తు ప్రక్రియలో అవసరమైనప్పుడు హాజరై సహకరించాలి.
e) దర్యాప్తులో వాస్తవాలను నిజాయితీగా, ఎటువంటి అంశాన్ని దాచిపెట్టకుండా చెప్పాలి.
f) కేసు తుది నిర్ధారణకు అవసరమైన పత్రాలు లేదా సమాచారం సమర్పించాలి.
g) అవసరమైతే ఇతర నిందితుల గుర్తింపు లేదా పట్టుకోవటానికి సహకరించాలి.
h) దర్యాప్తు కోసం అవసరమైన సాక్ష్యాలను ధ్వంసం చేయరాదు.
i) దర్యాప్తు అధికారి విధించిన ఇతర షరతులను కూడా పాటించాలి.
ఈ నోటీసులో పేర్కొన్న నిబంధనలను మీరు పాటించకపోతే, BNSS చట్టం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్‌ చేయవచ్చు అని కర్నూలు- సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి పేరిట నోటీసు ఇచ్చారు.
దీనిపై నాగార్జున రెడ్డి ఏమన్నారంటే..
ప్రజలు ఒక సంఘటనపై ప్రశ్నించటం నేరమా? ఆలోచించటం, విమర్శించటం, వ్యాఖ్యానించటం.. వంటివన్నీ ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులు. కానీ కర్నూలు పోలీసులు ఆ హక్కును దర్యాప్తు పేరుతో దెబ్బతీయాలని చూస్తున్నట్లున్నారని నాగార్జున రెడ్డి ఆరోపించారు.
బస్సు ఎందుకు దహనం అయిందో తెలుసుకోవడం కంటే, ఆ ప్రమాదంపై సోషల్‌ మీడియాలో ఏమి రాశారో తెలుసుకోవడమే పోలీసులకు ముఖ్యమైందేమో అన్న సందేహం కలుగుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఒక సామాన్య పౌరుడు లేదా కార్యకర్త సోషల్‌ మీడియాలో తన అభిప్రాయం రాయడమే నేరమైతే, అప్పుడు “సత్యం” గురించి మాట్లాడే ప్రతి గొంతు భయంతో మూగబోయే రోజు దూరంలో లేదనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమ అనే మాటకే భయం ఎందుకు?
రాయలసీమ ప్రాంతం సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, అభివృద్ధి అసమానతల గురించి ఎవరైనా మాట్లాడితే, వారిని “అసమ్మతి స్వరం”గా గుర్తించి, నోరు మూయించాలని చూస్తున్నారని నాగార్జున రెడ్డి ఆరోపించారు. రాయలసీమ విమోచన సమితి చెబుతున్నట్లుగా, ఈ వ్యవహారం కేవలం ఒక బస్‌ ప్రమాదం దర్యాప్తు కాదు, ప్రజాస్వామ్యంలో భిన్న స్వరాల ఉనికిని పరీక్షించే ఘట్టమన్నారు.
ఒక ప్రమాదం వెనుక నిజాలు దొరకాలంటే, దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. నిజం ఎక్కడో దాగి ఉంది, దానిని వెలికితీయాల్సిన వారు మాత్రం దానిని మరింత కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని నాగార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు పోలీసుల తీరు చూస్తుంటే “రామాయణంలో పిడకల వేట” అనే సామెత గుర్తుకు వస్తోందని, బస్ ఎలా కాలిపోయింది, కానీ దాని వెనుక ఉన్న వాస్తవం ఏమిటనే దాన్ని గుర్తించడానికి బదులు పోలీసులకు సూచనలు చేసేలా ఉండే సామాజిక మాధ్యమాల పోస్టులకు నోటీసులు ఇవ్వడం తగదన్నారు.
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు వేయడమే కాదు — ప్రశ్నించగల హక్కు కూడా. ఆ హక్కును మసకబారేలా చేయడం మొదలైతే, అది ప్రభుత్వ వైఫల్యానికి మొదటి సంకేతం.
Read More
Next Story