
పట్టువీడని చంద్రబాబు... పంతం పట్టిన కరేడు ప్రజలు
కరేడు భూములను సేకరించేందుకు ప్రభుత్వం నిన్న GO కూడా ఇచ్చింది.అయితే పోరాడుతాం అంటున్నారు ప్రజలు. కరేడు నుంచి కాంతి నల్లూరి గ్రౌండ్ రిపోర్టు : 2
రాష్ట్రప్రభుత్వం గ్రామ ప్రజల భూములు సేకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వంద ఉత్తర్వులు జారీ చేసింది.
కరేడు ప్రజలు చేస్తున్న ఉద్యమాలు, రోడ్లెక్కడాలు, దిగ్బంధాలు పెద్ద పెద్ద ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలు దాసిపెట్టినా చిన్న చిన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు, యూట్యూబ్ ల, మౌఖిక ప్రచారం జరగాల్సినంతగా జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో కరేడు గ్రామ ప్రజలు, రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపడానికి ఆంధ్రప్రదేశ్ పౌరుహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి 13 మందిమి 6..7.. 25న కరేడు, చుట్టుపక్కల 18 గ్రామాలకు మద్దతు తెలపడానికి వెళ్ళాం. ఈ టీంలో ఇద్దరు పిడియం (Patriotic Democratic movement) సభ్యులు ఉన్నారు.
ఊర్లోకి వెళ్ళగానే ఊరికి పల్లెకి మద్యలో పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉంది. పల్లె ఊరు కలిసిపోయి ఉన్నాయి. ఆ పక్కనే ఓ వైపు టీవీల వాళ్లు వాయిస్ లు, ఆ పక్కనే మా భూములు వదల బోమ్మంటూ పురుషులు స్త్రీలు పిల్లలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు. ఊరంతా అక్కడే. సంక్రాంతి పండుగ వాతావరణంలా కనిపిస్తుంది. మా 13 మంది కూడా గ్రూపులు గ్రూపులుగా విడిపోయి గ్రామ సర్పంచ్ నుంచి చదువుకుంటున్న విద్యార్థుల వరకు మాట్లాడుతూ సమాచారం సేకరించాం.
మేము సేకరించుకున్న, ఎక్కువగా నేను సేకరించిన సమాచారoను, గ్రామస్తులు చెప్పిన విషయాలను వివరిస్తున్నాను. మేడం మేము ఎందుకు పోవాలి. మా ఊర్లో 20 ప్రైమరీ స్కూల్స్ ఒక హైస్కూలు ఉన్నాయి. ఆడపిల్లలకు ఒక కస్తూరిబాయ్ స్కూలు, రెండు గురుకుల (బాలబాలికలకు వేరువేరుగా) పాఠశాలలు ఉన్నాయి. మూడు సచివాలయాలు, నాలుగు చికెన్ కోట్లు, నాలుగు పాల కేంద్రాలు, జిరాక్స్ సెంటర్లు, సిమెంట్, సిమెంట్ బ్రిక్స్, స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు, అప్పుడే పట్టుకొచ్చిన ఫ్రెష్ ఉండే చేపలు రొయ్యలు. విస్తారంగా వేరుశెనగ పండే వేల ఎకరాల భూములు ఉన్నాయి. మా ఊరు వాళ్లే కాదు వేరే ఊళ్ళ నుండి వచ్చి శనగ పంటలో పనిచేసే డబ్బులు తీసుకెళ్తారు. ఉత్తరద్వార దర్శనం ఉన్న గుడి ఉంది. ఎదురుగా స్మశానం ఉంది. శివయ్య ఎప్పుడు స్మశానం వైపు చూస్తూ ఉంటాడు. ఇంటింటికి రెండు పూటలా నీళ్లు వచ్చే కుళాయిలు ఉన్నాయి.
మా ఊరు నుండి సుమారు 100 మంది ఫారెన్ లో ఉన్నారు. గెజిటెడ్ ఆఫీసర్స్, గ్రూప్ 1, గ్రూప్2 ఉద్యోగులు, ఇంజనీర్లు, ఎంబీఏ చేసిన వాళ్లు, టీచర్స్ చాలామంది ఉన్నారు. ఇవన్నీ కాదు మేడం, ఇక్కడ ఓ మనిషి చచ్చిపోతే 100 మంది వస్తారు. కనీసం పదిమంది అయినా రాత్రిపూట బాడీ చుట్టూ ఉంటారు. పట్టణాల్లో చనిపోతే ఎంతమంది వస్తారు. మీరు రాగానే ఇక్కడ చూడండి ఎంత మంది వచ్చారు. జాతరలు జరిగితే అందరం ఎక్కడ ఉన్నా ఈ ఊరికి వస్తాం. బాబాయి, తాత, మామ, అన్న తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకుంటాం. సంక్రాంత్రి సంబరాలు చేసుకుంటాం. మా పెద్దవాళ్ళు అయితే నాటు కోళ్లు, పచ్చి చేపలు తప్ప బాయిలర్ కోళ్లు తినరు. పెద్దవాళ్ళు నలుగురు ఈ అరుగుల మీద చెరి కాలక్షేపం చేస్తారు. పిల్లల దగ్గరకు కూడా వెళ్లరు. వెళ్లిన అక్కడ ఉండలేరు,ఈ వాతావరణానికి అలవాటు పడి. ఇక్కడ మాకు ఒక బాల్యం ఉంది. మా నాన్న, తాత, ముత్తాతల సమాధులు ఉన్నాయి. పెద్ద పండగ సంక్రాంతికి మా పితృదేవతలకు బట్టలు పెట్టుకుని దండం పెట్టుకుంటాం. వాటన్నిటిని మరిచి బయటకు ఎట్లా వెళతాం. అక్కడ ఎవరి సమాధులు ఉంటాయి. డబ్బులు ఇస్తారు సరే, ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాం. డబ్బులు ఉంటే తాగి తందనాలు ఆడేవాళ్ళు ఎంతమంది. ఆ ఇచ్చిన డబ్బులు అయిపోతే ఏం చెయ్యాలి. నిజంగా డబ్బులు ఇస్తారా? నాగార్జునసాగర్, శ్రీశైలం, పోలవరం, గంగవరం, రామాయపట్నం, సోంపేట.... ప్రాజెక్టులు, విమానాశ్రయాల కోసం తీసుకున్న భూముల నిర్వాసితులు ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు. అక్కడిదాకా ఎందుకు మేడం. ఇక్కడ డబ్బుకు ఆశపడి హేసరీస్ కు భూములమ్ముకున్నారు కొంతమంది. ఇప్పుడు ఆ భూములమ్ముకున్న చాలామంది, ఆ హేసరీస్ వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. మా టీంలో ఉన్నవారు ఆ గ్రామంలో ఉన్న జనాభా వివరాలను, ఏ కులం ఎంత మంది ఉంది, ఏం పని చేస్తుంది, ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులను, ఉద్యమ తీరుతెన్నులను, రాజకీయ పార్టీల అవగాహనలను, రాజకీయ నాయకులను, మాజీ సర్పంచ్ ని, పెద్దలను, మహిళలను అడిగి తెలుసుకున్నారు. హైవే 16 కు దగ్గరగా ఉన్నా రామకృష్ణ పురం నుండి మొదలుపెడతామని వెళ్ళేం.
రామకృష్ణపురానికి విజయవాడ నుండి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపున పదిమంది లాయర్లు, హైకోర్టు లాయర్లు కూడా వచ్చారు.
మీ భూములు తీసుకుంటామని మీకు గవర్నమెంట్ ఎప్పుడు తెలిపింది అన్న ప్రశ్నకు రామలక్ష్మి అనే ఓ పెద్దమ్మ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎవరు గవర్నమెంట్ తరుపున రాలేదు. పేపర్లో వచ్చిందని, ఇంటికి ఐదు లక్షలు ఇస్తారని కరేడు రైతులు చెప్పారు. 350 ఇళ్లు ఉన్నాయి. నా చిన్నప్పుడు 35 ఎకరాల పట్టా భూములు మాకు ఇచ్చారు. ఈ భూముల్లో తుమ్మచెట్లు కొట్టుకొని, జమ్మూ కోసి, మెరక బోసి సాగులోకి తెచ్చుకున్నాం. ఈ భూములను కూడా ఒక ఎమ్మార్వో లంచం తీసుకుని రైతులకు ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు ఎమ్మార్వో గారిని పట్టిచ్చాం. 10 సెంట్లు 20 సెంట్లు 50 సెంట్లు కొన్ని కుటుంబాలకు ఉంది. దీంట్లోనే ఆకుకూరలు, పూలు వేసుకొని అమ్ముకుంటాం. బర్రెలు పెట్టుకుని పాలు అమ్ముకుంటాం. కొన్ని కుటుంబాలకు ఏమీ లేదు. వ్యవసాయ కూలీపనులకి పోతాం. మగవాళ్లు మొద్దు కొట్టుకుంటారు. (మొద్దు కొట్టడం అంటే తుమ్మ, పిచ్చి చెట్లు నరికి, నెలలో ఉన్న వేళ్ళతో సహా తీసేయడం. ఈమొద్దులు పచ్చాకు సీజన్లో బ్యార్నిల లో ఆకు కాల్చడానికి ఉపయోగిస్తారు) జామాయిల్, చౌక మొద్దు కొడుతూ కందుకూరు, పామూరు దాకా వెళతారు.
కొక్కిలిగడ్డ కృష్ణారావు మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఇంటికి మంచినీళ్ళ పైపు కనెక్షన్ ఉంది. రెండుపూటల నీరు వస్తుంది .ప్రతి ఊరికి ఒక మంచినీళ్ల ట్యాంకు ఉంది. తాగు, సాగు నీటికి ఇబ్బందే లేదు. 1200ఎకరాల కరేడు చెరువు, ఓ రెండువందల ఎకరాల చిన్నచిన్న చెరువులు ఉన్నాయి. మా గ్రామాలలో దేనికి ఇబ్బంది లేదు. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు రోడ్లు, కరెంట్, వాటర్ ట్యాంకులు, పైపులు మొదలైనవన్నీ పోరాడి తెచ్చుకున్నాo .
జగన్నాథం శేషమ్మ మాట్లాడుతూ పట్టాల కోసం మేము కోర్టు దాకా వెళ్ళాము.మా ఊరిని వదిలేది లేదు. కష్టమైనా లాభమైన ఇక్కడే ఉంటాం. 96లో తుఫాను వచ్చినా, చచ్చిపోయిన పోలేదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాం. తుఫాన్ అప్పుడే, చచ్చిపోయినప్పుడే పోలేదు. ముసలా ముతక, ఇల్లు వాకిలి , గోడ్డు గోదా అన్ని ఉండి, ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి ఉన్నాం. ఇప్పుడు ఎట్లా పోతాం. లక్ష్మీ సుజాత మాట్లాడుతూ వ్యవసాయ సంఘం తరఫున ఎర్రజెండా కింద పోరాడి ఈ భూముల్ని సంపాదించుకున్నాం. మా భూములు మాకు ఉండాలి. ఇళ్ళు చూపిస్తారని, ఇస్తారని గ్యారెంటీ లేదు. ఇప్పటికి ఎర్రజెండా వాళ్ళు అండగా ఉంటారు అనుకుంటున్నాం. రాసుకుంటున్న నేను తలెత్తి ఆమె వైపు చూశాను. ఆమె వెనక ఎర్రజెండా ఎగురుతుంది. (కింది ఫోటో)
అందరి ముఖాల్లో ఆందోళన
ఇండియన్ లాయర్స్ యూనియన్ తరపున వచ్చిన మాధవరావుగారు టీవీల ద్వారా పేపర్ల ద్వారా ఇక్కడున్న కొంతమంది ద్వారా తెలుసుకొని వచ్చాం. మీకు అండగా ఉంటాం. 2014 లో చేసిన చట్ట ప్రకారం మీ భూములను ఇళ్లను తీసుకోకూడదు. గట్టిగా నిలబడితే మీ మీద కేసులు పెడతారు. మీ మీద పెట్టే కేసులకు చట్టపరమైన న్యాయం కోసం మేము సహాయం చేస్తాం. అయితే చట్టాలలో ఏ మేరకు న్యాయం జరుగుతుందనే అనుమానం లాయర్లమైన మాకే ఉంది. దానికన్నా ఢిల్లీలో రైతులు చేసినట్లు చేస్తే వాళ్లకై వాళ్ళు వెనక్కి వెళతారు.
ఢిల్లీలో రైతులు చేసినట్లు మీరు చేసే పోరాటాల వల్లనే వెనక్కి తగ్గుతారు అని చెప్పాడు.
పౌర హక్కుల సంఘం తరఫున చిలకా చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరికన్నా ఎనుకబడిన ఎస్టీ భూములను, నోటి దగ్గర నుండి మీ ముద్దను లాగుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజకీయ నాయకులను, అధికారులను మా భూములు మాకు కావాలి అని నిలవేసి అడగండి. మీరు చేసే ఉద్యమాల వల్లే మీరు నిలబడతారు. మేము అన్ని సంఘాలకు తెలియజేస్తాం.మీ ఇళ్లను పడగొడతామంటున్నారు కానీ ఎమ్మెల్యే ఎంపీల ఇళ్ళ దగ్గరకు వెళ్లి ఇల్లు కూలగొడతాం అంటారా? మనకు ఓటు ఉంది. ఆ ఓటు ద్వారా నిలదీద్దాం అని గ్రామ ప్రజలకు ధైర్యాన్నిస్తూ మద్దతు తెలియజేశారు.
రెండు టీములుగా చీలి లాయర్సు కొన్ని గ్రామాల వైపు, పౌరుహక్కుల సంఘంవాళ్లు కొన్ని గ్రామాలవైపు వెళదాం అనుకున్నాం. పౌరహక్కుల సంఘంవాళ్ళు ఉప్పరపాలెం వెళ్ళాం. ఉప్పరపాలెం ఎస్సీ గ్రామం. వంద కుటుంబాలు. 350 ఓటింగ్ ఉంది. గ్రామ పెద్ద గంజి యలమందయ్య మాట్లాడుతూ మా ఊరు 1919లో ఏర్పడింది. దాదాపు 100 సంవత్సరాలు పైగా అయింది. పది ఇరవై సెంట్ల నుండి ఆరెకరా, ఎకరా, రెండు ఎకరాల వరకు భూమి ఉంది.అవి కూడా కమ్యూనిస్టు పార్టీ ల మద్దతుతో మేము పోరాటం చేయగా ఇందిరాగాంధీ టైంలో ఇచ్చిన పట్టా భూములు. పట్టా భూములు కదా అందరికీ సమంగా ఇవ్వలేదా అన్న ప్రశ్నకు కొంతమంది ఎకరా ఆరెకరా కొనుక్కున్నారని యలమందయ్య అన్నాడు. మెట్ట భూముల్లో సపోటా, మామిడి, పెసర, పువ్వులు, ఆకుకూరలు వేస్తాం. మాగాణిలో వరి వేస్తాం. మాగాణి 10, 20 సెంట్లులో కొద్ది కొద్దిగానే ఉంది. చాలామందికి బర్రెలు గొర్రెలు మేకలు ఉన్నాయి.
మీకు నోటీసులు ఇచ్చారా? అడిగేం. మాకు ఎవరు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. చెప్పలేదు. ఊర్లో వారికి ఇచ్చారు. తర్వాత ఇచ్చే వాళ్లలో మేము ఉన్నాం. మా భూములు, ఇళ్ళు కూడా పోతాయి, మా ఊరే పోతుందని చెప్పడంతో మేం కూడా అన్నింటిలో పాల్గొన్నo. డబ్బులు ఏం చేసుకుంటాం. డబ్బులు ఉంటే పది రోజులు ఉంటాయి. 11వ రోజు చెప్పకుండా పోతాయి. తాగుబోతులు ఉంటే నాలుగు రోజులు కూడా ఉండవు. యలమందయ్యా కొనసాగిస్తూ కంపెనీ వాళ్లు ప్రభుత్వం వాళ్లు చిన్నచిన్నగా వస్తే తెలియకుండానే అయిపోయేది. గుంపుగా వేల వేల ఎకరాలు కావాలని వచ్చారు. కనుక మా అందరికీ భయం వేసింది. రోడ్డు మీద ధర్నా చేయడం, జాయింట్ కలెక్టర్ రావడంతో భూసేకరణ, మా ఇళ్ళు తీసుకోవడం ఆగిపోయాయి. ఆ గ్రామస్తులకు మహిళలకు ధైర్యం చెప్పి పొట్టేనుగుంట సంఘం వెళ్ళేం.
ఇది యానాదుల సంఘం. ఈ 18 గ్రామాల్లో ఇది బాగా వెనకబడి ఉన్నది. 40 ఇళ్ళవరకు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా తాతలప్పట్నుంచి గుడిసెలేసుకుని ఉన్నారు. 2002 లో బుజ్జమ్మ, శంకరయ్య కాంట్రాక్టర్లు ప్రభుత్వం తరపున కాంటాక్ట్ కు ఇళ్ళు కట్టించారు. (శంకరయ్య కట్టించిన ఇళ్ళు కొంచెం బాగున్నాయి. కొన్ని ఇళ్ళు అసలు బాగాలేవు) కూలి పనులు చేసుకుని రేషన్ బియ్యం తింటూ బ్రతుకుతాం. ఎవరికి భూములు లేవు. భూములు లేకపోయినా ఈ ప్రకృతి, గాలి, నీరు చుట్టూ వాతావరణం, ఎప్పుడూ పనులు ఉండే ఊరు. ముసలోళ్లను, పిల్లలను తీసుకుని ఊరు వదిలి ఎలా పోతాం అని ప్రశ్నించాడు. మహిళలందరూ మేం పోయేదే లేదని గట్టిగా చెప్పారు. అందరూ అండగా ఉండండి అని అడిగారు. మా మద్దతు తెలిపి ఆకుతోట సంఘం వెళ్ళాం.
ఎక్కడకు వెళ్ళినా, పిలవగానే మహిళలతో సహా వస్తున్నారు. చెప్పాలంటే మహిళలే ముందున్నారు. మాధవరావు, మోహన్ రావు, అక్కులు మాట్లాడుతూ రోడ్డుకు అవతల నోటిఫికేషన్లు ఇచ్చారు. మూడుసార్లు నోటిఫికేషన్లు ఇవ్వాలనుకున్నారు. మాకు ఇంకా ఇవ్వలేదు. తర్వాత ఇచ్చే 4000 లో మేము ఉన్నాం. ఊరు మొత్తానికి 50 ఎకరాలు భూమి ఉంది. అర ఎకరా నుండి మూడు నాలుగు ఎకరాల వరకు ఉంది. మా ఊర్లో పండని పంట అంటూ ఉండదు. ఆకుకూరలు,వేరుశనగ ఎక్కువగా పండిస్తాం. కూలి పనులకు ఉలవపాడు, కరేడు, పట్టపుపాలెం వెళతాం. 300 గడప ఉంది. 600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. ముసలోళ్ళు, పిల్లల్ని తీసుకెళ్లి ఊరు గాని ఊరిలో ఎక్కడకో పోయి ఎలా బ్రతుకుతాం అన్నారు. తెడ్డు భాగ్యం మాట్లాడుతూ ఇక్కడ ఇళ్ళు ఎలా ఉన్నాయో అలా కట్టిస్తేనే,ఈ వాతావరణం, నీరు, ఈ కొబ్బరి, అరటీ సపోటా, ఆకు తోటలు ఇస్తేనే వెళతాం అంటాం. ఇలాంటి వాతావరణం, నీరు ఎక్కడ ఉండదు. మా చెట్టు మా పుట్ట, దేవతలు, మా గుళ్ళు అన్నిటిని వదిలిపెట్టి ఎలా వెళ్తాం. వెళ్ళేది లేదని ఓ మహిళా ప్రతినిధిగా గట్టిగా చెప్పింది.
అసలు ఆ ఊరు వెళ్తున్నప్పుడే దారంతా ఇరువైపులా చల్లని వాతావరణంలో కొబ్బరి, మామిడి, సపోటా తోటలు తలలెత్తుకొని నిటారుగా నీలి మేఘాలతో ప్రేమ కబుర్లు చెబుతున్నట్టుగా ఉన్నాయి. అందరం కేరళలో లేo కదా అని ఆశ్చర్యపోయాం. కంచెల వెనుక ఆ తోటల సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం కారు ఆపమన్నాను. మనం వచ్చింది ఎందుకు? కావాలంటే ఇంకొక రోజు వద్దాం. ఇప్పుడు చాలా గ్రామాల తిరగాలి. టైం సాలదు అని అరక్షణం కూడా ఆపకుండా కారుని ముందుకు తీసుకెళ్లారు. కార్ లోనుండి ముఖం బయటపెట్టి తోటల సౌందర్యాన్ని చూస్తూ గుండెల నిండా పచ్చటి చెట్ల నుండి వచ్చే, ఏ కాలుష్యము లేని ఆక్సిజన్ పిలుచుకున్నాను. ఆ గాలి మధురంగా ఉంది ఆ తోటలు అంత బాగున్నాయి. ఆ ఊర్లోకి వెళ్ళగానే ఇంకా ఆశ్చర్యపోయాం. ప్రతి ఇంటి చుట్టూ పచ్చటి మొక్కలు, చెట్లు.ఇళ్ళు చిన్నగా ఉన్నా చుట్టూ విశాలంగా ఖాళీ స్థలం ఉంది.ఇళ్ళు కనిపించకుండా మొక్కలు చెట్లు ఉన్నాయి. ఇది ఎస్టీ కాలని అయినప్పటికీ ఓ మధ్యతరగతి వాతావరణం కనిపించింది. అందరూ గుడి దగ్గరకు వచ్చారు. గుడి విశాలంగా,నీట్ గా చాలా బాగుంది. ఎస్ టి కాలనీలో ఇంత పెద్ద గుడి ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. గుడి స్థలంలోనే, సముద్రంలో ఓడలకు దారి చూపే లైట్ హౌసలా ఊరిని తెలియజేస్తూ దిక్సూచిలా వాటర్ ట్యాంక్ ఉంది. పక్కనే ఉన్న స్కూల్ కూడా బాగుంది. పిల్లలందరూ స్కూల్ కి వెళ్తారట. నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. స్కూల్ లో చెట్టు చుట్టూ కట్టిన అరుగుపై కూర్చుని వనభోజనంలా మధ్యాహ్న భోజనం తిన్నాం. స్త్రీలు, పిల్లలు చాలా నీట్ గా ఉన్నారు. చాలా పద్ధతిగా ఉన్నారు. ఎస్టీల బాహ్య లక్షణాలు కూడా కనిపించనంతగా ఉన్నారు. భాగ్యం మాట్లాడుతున్నప్పుడు స్పష్టమైన మాటలు వారి పట్టుదలను తెలియజేస్తున్నాయి చుట్టూ ఉన్న వాతావరణoలా. హృదయమున్న మనుషులకు ఈ సంఘం ఒక్కటి చాలు ఈ భూములు తీసుకోకూడదు, ఈ ప్రకృతిని నాశనం చేయకూడదు అనడానికి. భూ దాహులకు, పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు ఇలాంటి సున్నిత హృదయం ఉంటుందా అనిపించింది. వాళ్లందర్నీ తీసుకొచ్చి కర్రేడు చుట్టుపక్కల గ్రామాలలో ఓ పది రోజులు ఉంచితే వాళ్ళ హృదయాలలో కొద్దిగా అన్న మార్పు వస్తుందేమో అనుకున్నాం. మీరెంత గట్టిగా మీ పోరాటాలను చేయగలిగితేనే మీ భూములు ఇళ్ళు నిలుస్తాయి. మీ పోరాటం వల్లనే బయటనుండి రాజకీయపార్టీల, ప్రజాసంఘాల మద్దతు ఉంటుంది. మీరు ఓట్లు వేసిన రాజకీయ నాయకుల్ని, పార్టీలను నిలదీయండి. మాతరుపున మా మద్దతు, న్యాయపరమైన సహాయం ఉంటుందని, కేసులకు భయపడవద్దని చెప్పి బాలకోటయ్య సంఘం వైపు కదిలేం.
మాల కొండయ్య మాట్లాడుతూ నాకు ఒక ఎకరా 30 సెంట్లు భూమి ఉంది. ఇక్కడ తృప్తిగా బతుకుతున్నాం. వంద గడప పైనే ఉంది. 2007లో 70 ఇళ్ళు గవర్నమెంట్ వాళ్లు కట్టించారు. 200 ఓట్లు ఉన్నాయి. 60 ఏళ్ల పైనుంచి ఇక్కడ ఉంటున్నాం. 13 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఇచ్చారు. 105 ఎకరాల దేవాదాయ భూములు మా పోరాటం వలన ఇచ్చారు. ఇంకా చుట్టూ ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఆ కనిపించే సౌకలన్నీ ఫారెస్ట్ భూమిలోనివే అని కొద్ది దూరంలో ఉన్న లావుగా ఊరిన సౌకచేలను చూపించాడు. వేరుశనగ ఇతర పంటలతో పాటు రాగి కూడా పండిద్దన్నాడు.
చల్లంచర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇండోసోల్ కంపెనీవాళ్ళు ఇద్దరు వచ్చి భూములిమ్మని నన్ను అడిగారు. నేనొక్కడినే ఏమి చెప్పినా జరగదు, అందరితో మాట్లాడతాను. ఈ వాతావరణాన్ని వదిలిపెట్టి నేనైతే పోను అని చెప్పాను. అరఎకరo ఉన్న మా తాత, మా నాన్న నేను బ్రతికాం. నా తర్వాత నా పిల్లలు బ్రతుకుతారు. ఆ తర్వాత తరమైనా, వాళ్ల పిల్లల తరమైనా బ్రతుకుతారు. భూములు ఉంటే పిల్లలకు ఇవ్వగలంగాని డబ్బులు ఎంత కాలం దాచి పెట్టి ఇవ్వగలం. ఇల్లు కట్టించకపోతే పోయే వాళ్ళమేమో!? ఇప్పుడు ఇల్లు కట్టి0చి, కరెంటు వేసి ఇంటింటికి పైపులుపేసి ఇప్పుడు పొమ్మంటే ఎలా పోతాం. ఏ పని దొరికిద్ది. దాదాపు మహిళలoదరు గేదెలు పెంచుకుంటూ పాలు అమ్ముకుంటూ, ఆకుకూరలు పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
గ్రామ సభలో ఊరి ప్రజలు
మూడు గంటలకు కరేడులో గ్రామస్తులు ఏర్పాటు చేసిన మీటింగ్ ఉండటంతో బయలుదేరి పట్టపు, పల్లెపాలేలాను, వారి పంట భూములను పరిశీలిస్తూ ముందుకు కదిలేం. న్న చెప్పిన భాగంలో ఆ పంట భూములు ఎలా ఉన్నాయో వివరంగా చెప్పాను. రోజు ఎండలకు, పడమట గాలులకు ఊలపోయిన మేము, దారంతా చల్లటి వాతావరణంలో ఆకాశము నుండి భూమికి దిగుతున్న మబ్బులలో ప్రయాణిస్తున్నాం. ఓ తట్టు సముద్రపు సంగీతం మరొకతట్టు పాటలు చెవులకు, పొలాల పచ్చదనం నైనాలకు కనువిందు చేస్తున్నాయి.
మేము వెళ్లేసరికి కరేడు గ్రామపంచాయతీ దగ్గర సభ అప్పుడే మొదలయింది. చిలక చంద్రశేఖర్, బ్రహ్మం, ఎల్లంకి వెంకటేశ్వర్లును వేదిక మీదకి ఆహ్వానించారు. రెండు వేలమంది ప్రజలున్నారు. గ్రామ సభలో ఆ ఊరి పెద్దలు మాట్లాడుతూ ఒక ప్రాంతంలో ఒకే రకమైన పంట పండిద్ది. కానీ ఇక్కడ అన్ని రకాల పంటలు (20 రకాల) ఉన్నాయి. అన్ని ఇక్కడ ప్రజలే డెవలప్ చేసుకున్నారు. మేమేమన్నా ప్రభుత్వాలను, కార్పోరేట్ కంపెనీలను భూములు ఇమ్మని అడిగామా? తరతరాల నుండి కష్టపడిన ఈ ప్రజలను తరమి ప్రభుత్వం, దాని వెనక ఉన్నవాళ్లు ఇన్ని వందల ఎకరాలను తీసుకోవడం సరైంది కాదు. (సభలో అంతమOది మాటలు, మైకుల శబ్దాలు. అయినా పక్షుల కుహు రాగాలు విపిస్తున్నాయి. ఎక్కడనుంచో అనుకున్న. సభ జరుగుతున్నoత సేపు వినిపిస్తూనే ఉన్నాయి. పంచాయతీ లో, చుట్టు చెట్లే. ఇంత గోలలో కూడా పక్షుల రాగాలు విన్పిస్తున్నాయి చూడు అని పక్కనే ఉన్న శ్రీనుకు చెప్పేను. అవును.that is కరేడు. కరేడు అంతే అన్నాడు. మీటింగ్ తో పాటు ఆ పక్షుల రాగాలను రికార్డు చేశా) సోలార్ పలకలు తయారు చేయడానికి బాగా ఎండ కావాలి. ఇక్కడ అంత ఎండ కూడా ఉండదు . పంటలు పండే ఈ భూములను తీసుకుని పారిశ్రామిక వాడలు నిర్మిస్తారా? ఆ పారిశ్రామిక వాడలలో ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించగలరా? మాతో పాటు ఉన్న పశుసంపదకి వన్యప్రాణులకి ఆహారo అందించగలరా? పంటలే లేకపోతే ప్రజలేం తిని బతుకుతారు. గ్రామ చరిత్రను చెప్పేరు. మొత్తం పరిస్థితిని వివరించారు. రావూరు, చెవూరు నుండి వచ్చిన గ్రామస్తులు మేము భూములు ఇచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీరు భూములు ఇవ్వవద్దని గట్టిగా చెప్పేరు. హక్కుల, లాయర్ల సంఘాల తరుపున మద్దతు తెలియజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేరు. (ఇంకా ఉంది)
ఉద్యమ తీరుతెన్నులు రేపు చూద్దాము.